Share News

కర్తవ్యాన్ని మరువని బడ్జెట్!

ABN , Publish Date - Feb 18 , 2026 | 01:00 AM

రాష్ట్రాభివృద్ధికి కీలక పాత్ర పోషించే బడ్జెట్ రూపకల్పన వెనుక ఎంతో కసరత్తు, దూరదృష్టి ఉంది. స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యంగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ 2025–26లో రూ.3,22,359 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పుల భారం...

కర్తవ్యాన్ని మరువని బడ్జెట్!

రాష్ట్రాభివృద్ధికి కీలక పాత్ర పోషించే బడ్జెట్ రూపకల్పన వెనుక ఎంతో కసరత్తు, దూరదృష్టి ఉంది. స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యంగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ 2025–26లో రూ.3,22,359 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పుల భారం, వడ్డీల చెల్లింపులు ఒకవైపు భయపెడుతున్నా, సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యత పాటిస్తూ ఆయన బడ్జెట్‌ను రూపొందించారు. విద్య, వైద్యం, పట్టణ పరిపాలన, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, జల వనరులు, రహదారులు వంటి శాఖలకు భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి, సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం తన నిబద్ధతను నిరూపించుకున్నది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన జరిగింది. ప్రజలే ముందు అనే నినాదాన్ని బడ్జెట్ కేటాయింపుల్లో నిజం చేసి చూపించారు. భారమైనా భారీగానే బడ్జెట్ కేటాయింపులు జరిపి సమస్యలకు, సవాళ్లకు తలొగ్గేది లేదన్న తెగువను కనబర్చారు ఆర్థికమంత్రి. గత అయిదేళ్ళ పాలనలో విధ్వంసం అయిన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ప్రారంభమయింది. ప్రజలపై పన్నుల భారం మోపకుండానే వీలైనంతగా ప్రభుత్వ ఆదాయం పెంపునకు కృషి చేస్తామని బడ్జెట్‌లో వాస్తవికతను ప్రజల కళ్లకు కట్టారు. సంక్షేమంతో ఆంధ్రప్రదేశ్‌లో శ్రేయోరాజ్యం స్ఫూర్తిని చాటడం ద్వారా రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. రెండు అంకెల వృద్ధి రేటు కేవలం గణాంకం కాదు, రాష్ట్ర ఆర్థిక శక్తికి, సమర్థ పాలనకు, పెట్టుబడుల సాధన, ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు నమ్మకమైన సంకేతం. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పాలనకు ప్రాధాన్యత ఇచ్చి ధ్వంసం అయిన వ్యవస్థలను గాడిలో పెట్టి 20 నెలల్లో ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించి, రాష్ట్ర జీఎస్‌డీపీ మొత్తంగా 11.75శాతం వృద్ధి సాధించడం గర్వించదగ్గ విషయం.


రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలకం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వృద్ధి రేటును పెంచే లక్ష్యంతో ఈ బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు పెరగడం రైతుల ఆదాయం పెంపుదలకు సానుకూల సంకేతం. ప్రభుత్వానికి అతిపెద్ద ఆర్థిక భారమయ్యేది సంక్షేమం. అభివృద్ధి లేకుండా సంక్షేమం కొనసాగదు. ఆదాయం లేకుండా పథకాలు నిలవవు. ఈ బడ్జెట్‌లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, ఐటీ రంగానికి ప్రాధాన్యత, స్టార్టప్‌లకు మద్దతు, ఆర్థిక క్రమశిక్షణ నిజమైన మార్పు. అలాగే మూలధన వ్యయం పెంపు, పరిపాలనా ఖర్చుల నియంత్రణ, అప్పుల నిర్వహణ కొనసాగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ స్థిరపడే అవకాశం ఉంది. సొంత ఆదాయాన్ని పెంచుకుంటూనే, సంక్షేమ పథకాలను ఆపకుండా నిర్వహించడం కత్తిమీద సామే. విభజన హామీలు, ప్రత్యేక ప్యాకేజీల రూపంలో కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధుల రాబట్టాల్సి వుంది. ఏది ఏమైనా కేటాయింపులు కాగితాలకే పరిమితం కాకుండా, అవి క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకున్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.

నీరుకొండ ప్రసాద్

ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతని దెబ్బతీసింది.. అచ్చెన్నాయుడు ధ్వజం..

వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారెవరూ బతికి బట్టకట్టలేదు.. స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఫైర్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 18 , 2026 | 01:00 AM