Share News

బహుజనుల లక్ష్యం ప్రబుద్ధ భారత్‌

ABN , Publish Date - Oct 14 , 2026 | 02:21 AM

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1956 అక్టోబర్ 14న మహారాష్ట్రలోని నాగపూర్ దీక్షాభూమిలో దాదాపు ఆరు లక్షల మంది అనుచరులతో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. భారత చరిత్రలో...

బహుజనుల లక్ష్యం ప్రబుద్ధ భారత్‌

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1956 అక్టోబర్ 14న మహారాష్ట్రలోని నాగపూర్ దీక్షాభూమిలో దాదాపు ఆరు లక్షల మంది అనుచరులతో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. భారత చరిత్రలో ఇదొక సామాజిక విప్లవం. ఇది కేవలం మత మార్పిడి కాదు, 5 వేల ఏళ్ల అసమానతలపై తిరుగుబాటు.

హిందూ ధర్మంలోని చాతుర్వర్ణ వ్యవస్థ, మనుధర్మ శాస్త్రం దళితులను అంటరానివారిగా చేసింది. వారికి గుడిలోకి ప్రవేశం లేదు, చెరువులో నీరు తాగే హక్కు లేదు. ఇవన్నీ అంబేడ్కర్‌ను ప్రభావితం చేశాయి. తనకు హిందూ మతంలో సమానత్వం దొరకలేదని అంబేడ్కర్‌ భావించారు. 1935లో యోలా సభలో ‘నేను హిందువుగా పుట్టాను, కానీ హిందువుగా చనిపోను’ అని ప్రకటించారు. పూనా ఒప్పందం అనంతరం రిజర్వేషన్లు వచ్చినా, రాజకీయ బానిసత్వం పోలేదు. దీంతో ‘రాజకీయ అధికారం కేవలం ఓటుతో రాదు, సాంస్కృతిక విముక్తి కావాలి’ అని అంబేడ్కర్‌కు అర్థమైంది.

అంబేడ్కర్‌ బౌద్ధంలోకి మారడానికి కొన్ని కారణాలున్నాయి. ఇస్లాం లేదా క్రైస్తవంలోకి మారితే దేశం విడిపోతుందని, సిక్కు మతంలోకి మారితే మళ్లీ కులం వెంటాడుతుందని ఆయన గ్రహించారు. బౌద్ధం ఈ దేశపు నేలలో పుట్టిన ధర్మం. సమతా, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, హేతువాదం దాని పునాదులు. దేవుడు లేడు, ఆత్మ లేదు, కులం లేదు అని బుద్ధుడు చెప్పాడు. ‘అత్త దీపా భవ’ అనగా నీకు నీవే దీపానివి అన్నాడు. అంబేడ్కర్‌కు కావాల్సింది అదే. ఆయన రాసిన ‘బుద్ధ అండ్ హిజ్ ధమ్మ’ గ్రంథంలో బౌద్ధం అంటే కేవలం పూజ కాదు, ఒక జీవన విధానం, సామాజిక విప్లవం అని అంబేడ్కర్‌ తెలిపారు. 22 ప్రతిజ్ఞల ద్వారా బ్రాహ్మణీయ అసమానత్వ భావజాలాన్ని పూర్తిగా తిరస్కరించారు.

రాజ్యాంగం వల్ల నేడు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో కొంత పురోగతి వచ్చింది. కానీ సాంస్కృతిక, ఆర్థిక అసమానతలు ఇంకా ఉన్నాయి. నేటికీ దళితులపై దాడులు, గుడి ప్రవేశాల్లో అడ్డంకులు, కుల వివక్ష కొనసాగుతోంది. పరువు హత్యలు ఆగడం లేదు. కాన్షీరాం చెప్పినట్లు ‘ఓటు మాది, పాలన మీదా?’ అనే పరిస్థితి ఇంకా ఉంది. జనాభాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు 85శాతం ఉన్నా, రాజ్యాధికారం మాత్రం మిగిలిన 15శాతం అగ్రవర్ణాల చేతుల్లోనే ఉంది. ప్రజల్లో అంబేడ్కర్ కోరుకున్న రాజకీయ చైతన్యం రావాలి. బౌద్ధంలోని సమతా ఆర్థిక విధానం అమలు కావాలి. ఆయన ఆశించిన ‘ప్రబుద్ధ భారత్’ దిశగా బహుజనులంతా అడుగులు వేయాలి. ‘మనసు మారితేనే సమాజం మారుతుంది’ ఇదే ధమ్మపదం చెప్పే సత్యం.

పుల్లెంల గణేశ్‌

ఇవి కూడా చదవండి..

ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 02:21 AM