రాజధానిపై జగన్‌ది పగటి కలే!
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:27 AM
అమరావతికి చట్టబద్ధత కల్పించడం కోసం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి, దానిమీద సుదీర్ఘ చర్చ జరిగినప్పుడు... అమరావతి రైతులు ఇప్పుడిదంతా అవసరమా అనుకున్నారు. ఆ చర్చలో గత ప్రభుత్వపు...
అమరావతికి చట్టబద్ధత కల్పించడం కోసం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి, దానిమీద సుదీర్ఘ చర్చ జరిగినప్పుడు... అమరావతి రైతులు ఇప్పుడిదంతా అవసరమా అనుకున్నారు. ఆ చర్చలో గత ప్రభుత్వపు దాష్టీకాలను ఏకరువు పెడుతుంటే, టీవీల ముందు కూర్చున్న రైతులు ఆ ప్రభుత్వం ఇలా చేసింది కాబట్టే దానిని 11 సీట్లకు పరిమితం చేసి, మీకు అధికారం అప్పజెప్పాం కదా అనుకున్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ అమరావతికి అవసరం లేని హైప్ ఇస్తున్నారు. దీనివల్ల 2014–19 మధ్య రాష్ట్రం మొత్తం అమరావతి మీద వచ్చిన వ్యతిరేకత లాంటి దానికి వీళ్ళు మళ్ళీ ఆజ్యం పోస్తున్నారా అనిపించింది. అమరావతికి భూములిచ్చిన రైతులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాదని రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా తెలిసినా, ఇప్పటికీ అమరావతి కేవలం ఒక వర్గం వాళ్లకు చెందిందని వైసీపీ విషం చిమ్ముతున్నది. అయితే గత ఎన్నికలు అమరావతి కేవలం 29 గ్రామాల రైతులది కాదని రాష్ట్ర ప్రజలందరిదీ అని నిరూపించాయి. గత ప్రభుత్వం అమరావతి మీద వెళ్ళగక్కిన విషం వల్ల రాష్ట్ర ప్రజలందరికీ అమరావతి స్వరూపం అవగతం అయింది. ఆ కారణంగానే అప్పటి అధికార పక్షానికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు తీర్పు ఇచ్చారు.
అమరావతి శరవేగంతో రూపుదిద్దుకోవడంతో పాటు రైతుల సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించి, వారికి అండగా నిలవడం ఇప్పటి ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. గత ప్రభుత్వ కాలంలో ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రైతులు, మహిళల పోరాటం, పటిష్ఠమైన సీఆర్‌డీఏ చట్టం, న్యాయవ్యవస్థల కారణంగా అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా కదపలేకపోయారు. ఈ నేపథ్యంలో అమరావతికి చట్టబద్ధత ఉన్నా, లేకున్నా అదే రాష్ట్రానికి ఏకైక రాజధాని అని ప్రజలు భావిస్తున్న తరుణంలో అమరావతి నిర్మాణం ఇంకా వేగవంతంగా జరగాలి తప్ప, ఈ తీర్మానాల వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని రైతులు అనుకున్నారు. ఈ ప్రభుత్వం మారి పాత ప్రభుత్వమే మళ్ళీ వచ్చినా, అప్పటి అమరావతినే ఏమి చేయలేనివారు, ఇంకో ఐదేళ్ల తర్వాత ఏమి చేయగలరని కూడా అనుకున్నారు. ఈ తతంగం వల్ల అమరావతి మీద ప్రజలలో అనవసరమైన వ్యతిరేకత వస్తుందేమోనని భయపడ్డారు.
అయితే అనూహ్యంగా జగన్‌రెడ్డి వేసుకున్న సెల్ఫ్ గోల్ వల్ల పరిస్థితి తారుమారయింది. మావిగన్ పేరుతో కొత్త ప్రతిపాదన చేయడం వల్ల అమరావతి పట్ల ఆయనకున్న వ్యతిరేకత మరొకసారి బహిర్గతమైంది. గత ఎన్నికల్లో ఓటమికి అమరావతి కూడా ఒక కారణమనే స్పృహ లేకుండా మరోసారి రాజధాని పట్ల ఆయన కక్షపూరిత ధోరణిని వ్యక్తం చేశారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన చట్టం సవరణను తన ప్రభుత్వం వస్తే మళ్లీ సవరిస్తానని పేర్కొనడం జగన్ అజ్ఞానానికీ మూర్ఖత్వానికి నిదర్శనం. పార్లమెంటులో మళ్ళీ సవరణ చేయాలంటే కేంద్రంలో ఆయనకు అనుకూలమైన ప్రభుత్వం రావాలి. ఒకవేళ కాంగ్రెస్ మిత్రపక్షాలతో కూడిన ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా, జగన్ చర్యలను సమర్థిస్తారా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంటులో చేసిన ఈ సవరణకు కూడా ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఈ స్థితిలో జగన్ పగటి కలలు కంటున్నాడు అనేది సర్వవిదితం. ఇది అర్థం చేసుకున్న ఏ వ్యాపారవేత్త అయినా అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేయడు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోకుండా ఇటువంటి ప్రతిపాదనలు చేయడం, ఆయన చుట్టూ ఉన్న వారితో వాటికి జై కొట్టించటం వల్ల ఆయన ఊసరవెల్లితనంపై పదేపదే ప్రజలు మాట్లాడుకునేలా చేసుకోవడంతో ఆయన ఉనికి రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా మారింది. అమరావతి పట్ల కక్షపూరిత చర్యలు జగన్ చుట్టూ ఉన్న వారికే ఏవగింపు కలిగిస్తున్నాయి. రాష్ట్ర పురోభివృద్ధికి ఉపయోగపడే ఏ విధమైన సూచనా చెయ్యకపోగా, రాష్ట్రాన్ని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. అమరావతే రాజధాని అన్న దగ్గర నుంచి, మూడు రాజధానుల మీదుగా ఇప్పుడు మావిగన్ దగ్గర తేలాడు. ఆయనకి రాజకీయాల పట్ల ఒక అవగాహన లేదు. రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల నిర్దిష్టమైన విధానం లేదు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని కానీ, అమరావతి నిర్మాణం ఆగిపోతుందని కానీ, పెట్టుబడిదారులు ఆందోళనతో రాష్ట్రం వైపు చూడరని గాని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కల పగటి కలలాగానే మిగిలిపోతుంది. రాష్ట్రం పురోగామి దిశగా ముందుకు దూసుకుపోతుంది.
బండ్ల మాధవరావు
అమరావతి రైతు
ఈ వార్తలు కూడా చదవండి...
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఏం చర్చించారంటే..
కేసీఆర్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు: మంత్రి వివేక్
33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కిరణ్ కుమార్ రెడ్డి
Read Latest Telangana News And AP News And International