Share News

కట్టడి లేకపోతే అనైతిక దారుల్లో ఏఐ

ABN , Publish Date - Oct 20 , 2026 | 05:41 AM

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఒక బొమ్మ లాంటి దశ నుంచి, నేడు దేశ భద్రతను ప్రభావితం చేసే స్థాయికి కృత్రిమ మేధస్సు (ఏఐ) వేగంగా మారింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆరు అగ్రశ్రేణి ఏఐ సంస్థలు..

కట్టడి లేకపోతే అనైతిక దారుల్లో ఏఐ

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఒక బొమ్మ లాంటి దశ నుంచి, నేడు దేశ భద్రతను ప్రభావితం చేసే స్థాయికి కృత్రిమ మేధస్సు (ఏఐ) వేగంగా మారింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆరు అగ్రశ్రేణి ఏఐ సంస్థలు కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఏఐ వల్ల వచ్చే సైబర్, జీవ సంబంధమైన ముప్పుల నుంచి కాపాడుకోవడానికి ఇది నాలుగు రకాల భద్రతా చర్యలను సూచించింది. అయితే, ఒక పేజీ మాత్రమే ఉన్న ఈ ఒప్పందానికి చట్టబద్ధత లేదు.

ఏఐ భద్రత కోసం ఐరాస స్థాయిలో ఒక వ్యవస్థను తీసుకురావాలని, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తరహాలో ఏఐ కోసం కూడా ఒక సంస్థను ఏర్పాటు చేయాలని సింగపూర్ సూచించింది. ఏఐని ప్రైవేట్ కంపెనీల చేతుల్లో వదిలేయడం ప్రమాదకరమని, ప్రభుత్వాలే దీన్ని ఆధీనంలోకి తీసుకోవాలని ఆంత్రోపిక్ మాజీ ఉద్యోగి జాకబ్ కాక్సన్ వాదిస్తున్నారు. ఏఐ సిస్టమ్స్ ఇప్పటికే అనూహ్యంగా ప్రవర్తిస్తున్నాయి. ఓపెన్ ఏఐ ఏజెంట్ ఒక ప్రభుత్వ మెడికేర్ పోర్టల్‌లో భద్రతా నియంత్రణలను సైతం బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించడం పట్ల ఆస్ట్రేలియా ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. మాట వినకపోవడం, తప్పుడు డేటాను సృష్టించడం, ఏఐ ఏజెంట్లు ఒక గ్రూపుగా కలిసి పనిచేయడం లాంటి ప్రమాదకర ప్రవర్తనలను ఓపెన్ ఏఐ గుర్తించింది. జూలైలో, ఓపెన్ ఏఐకి చెందిన ప్రయోగాత్మక ఏఐ ఏజెంట్లు ఎటువంటి మానవ ఆదేశం లేకుండానే అంతర్గత భద్రతా ప్రమాణాల పరీక్ష సమయంలో తమ శాండ్‌బాక్స్ (ఏకాంత పరీక్షా వాతావరణం) నుంచి బయటకు వచ్చి, ‘హగ్గింగ్ ఫేస్’ ప్లాట్‌ఫారమ్‌పై దాడి చేశాయి. ఏఐ చేసే చిన్న పనుల్లో కూడా ప్రమాదం పొంచి ఉండవచ్చు. సినిమా టిక్కెట్లు బుక్ చేయమని చెబితే, మంచి సీట్ల కోసం ఏఐ ఏకంగా సిస్టమ్‌నే హ్యాక్ చేసినట్లు డీప్‌మైండ్ గమనించింది. అందుకే ఏఐకి మనం ఒక పని ఇస్తే, అది నీతిబాహ్యమైన దారుల్లో ఆ పనిని పూర్తి చేయకుండా ‘ఏఐ అలైన్‌మెంట్’ అవసరం.

అత్యంత ప్రమాదకరమైన జీవ సంబంధమైన, కంప్యూటర్ వైరస్‌లను రూపొందించడంలో సహాయపడటంతో సహా, ఏఐ లెక్కలేనన్ని మార్గాల్లో దాడి చేయగలదని నోబెల్ పురస్కార గ్రహీత జెఫ్రీ హింటన్ చెబుతున్నారు. ప్రమాదకరమైన వైరస్‌ల పరిశోధనలకు ఏఐని ఎలా వాడుకున్నారో ఆంత్రోపిక్ ‘డిటెక్టింగ్ అండ్ కౌంటరింగ్ మిస్‌యూజ్ ఆఫ్ ఏఐ’ అనే నివేదికలో వెల్లడించింది. చికెన్‌గున్యా వ్యాధిని మరింత సులభంగా వ్యాపించేలా చేయడం, మశూచికి సంబంధించిన వైరస్‌లపై పరిశోధనలు చేయడం, పక్షుల్లో వచ్చే ఫ్లూ జంతువులకు సోకేలా ప్రయోగాలు ప్లాన్ చేయడం లాంటి పనులకు ఏఐని ఉపయోగించారు. అయితే ఈ ప్రయోగాలు చేసినవారు మంచి కోసం చేశారా, చెడు కోసం చేశారా అనేది స్పష్టంగా తెలియదు.


ఏఐ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో పూర్తిగా అర్థం కాదు కాబట్టి వాటిని ‘బ్లాక్ బాక్స్‌’లుగా పిలుస్తారు, ప్రస్తుతానికి అవి మానవ నియంత్రణలోనే ఉన్నాయి. అయితే ‘ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్’ గురించి పెద్ద భయమే ఉంది. రికర్సివ్ సెల్ఫ్–ఇంప్రూవ్‌మెంట్ (నిరంతర స్వీయ–మెరుగుదల) ద్వారా ఏఐ తనను తాను మెరుగుపరుచుకుంటూ మనుషుల కంటే అత్యంత తెలివైనదిగా మారవచ్చు. అది కొద్ది రోజుల్లోనే మానవ నియంత్రణ నుంచి తప్పించుకోవచ్చు. అయితే, ఏఐతో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం లాంటి ప్రస్తుత సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఈ అనవసర భయాలు సృష్టిస్తున్నారని ఏఐ నిపుణుడు యాన్ లెకున్ వాదిస్తున్నారు.

ఏఐ వల్ల జరిగే ప్రమాదాలను వెంటనే రిపోర్ట్ చేసేలా యూరోపియన్ యూనియన్ ఒక చట్టం తెచ్చింది. ఐరాస ‘గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్’ కూడా ఏఐ పారదర్శకత కోసం దేశాలు కలిసి పనిచేయాలని కోరుతోంది. మానవ నియంత్రణ లేకుండా దాడి చేసే ఆయుధాలను నిషేధించడానికి 2026 చివరి నాటికి ఒప్పందం కుదుర్చుకోవాలని ఐరాస ఒత్తిడి చేస్తోంది.

ఈ అంశంలో భారతదేశానికి కీలకపాత్ర ఉంది. 50 వేల జీపీయూలతో కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంటూ, సొంత ఏఐ వ్యవస్థలను భారత్ నిర్మిస్తోంది. ఫిబ్రవరిలో జరిగిన ‘ఇండియా ఏఐ సమ్మిట్’లో 92 దేశాలు ఆమోదించిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ పేద దేశాలకు కూడా ఏఐ టెక్నాలజీ సమానంగా అందాలని నొక్కి చెప్పింది. ఏఐ తయారు చేయడానికి అవసరమైన డేటా కోసం, తక్కువ జీతానికి పనిచేసే ఉద్యోగుల కోసం పేద దేశాలను వాడుకుంటూనే, మళ్లీ ఆ ఏఐ ఉత్పత్తులను వారికే అమ్మి కార్పొరేట్లు డబ్బు వసూలు చేస్తున్నాయి. ఈ డిజిటల్ వలసవాదాన్ని అడ్డుకోవడంలో భారత్ దారిచూపాలి.

యూపీఐ లాగే ఏఐని కూడా ప్రజలందరికీ అందేలా చేయడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలు సొంతంగా ఏఐని సృష్టించుకునేలా చేయాలి. మన ‘మోసిప్’ అనే ఓపెన్ సోర్స్ ఐడీ సిస్టమ్‌ను ఇప్పుడు ఆఫ్రికా, ఆసియా దేశాల్లో వాడుతున్నారు. గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థాపక సభ్య దేశంగా భారత్ పబ్లిక్ డేటా విధానాలను సమర్థిస్తోంది.

ఏఐతో కలిసి జీవించాలంటే కచ్చితమైన ఆడిట్‌లు, ఐరాస నియంత్రణ ఉండాలి. ఉద్యోగాలు పోతాయన్న భయం, డీప్‌ఫేక్ వీడియోలు లాంటి సమస్యలు ఉన్నా, ఏఐ అద్భుతాలు చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. ఏఐ మంచి సమాజాన్ని నిర్మిస్తుందని, రోగాలను నయం చేస్తుందని, ఉపాధ్యాయులకు, వృద్ధులకు సాయపడుతుందని ‘ఏఐ గాడ్‌మదర్’ ఫెయ్‌–ఫెయ్‌ లీ ఆశిస్తున్నారు. మానవాళి ఇప్పుడు వేసే అడుగులే ఆ కలను సాకారం చేస్తాయా, లేదా అనేది నిర్ణయిస్తాయి.

శ్రీవాణి మాధవ్, ఎం.ఎస్. (ఏఐ), అమెరికా

శ్రీనివాస్ మాధవ్, భారత్

ఈ వార్తలూ చదవండి:

విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకలు.. 2 వేల మంది కళాకారులతో దసరా కార్నివాల్

టైగర్‌ ష్రాఫ్‌పై హత్యాయత్నం

టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన.. బయటకొచ్చిన నిందితుల ఫొటో

Updated Date - Oct 20 , 2026 | 05:41 AM