ఆఖరి మానవ రచయిత ఇంకా ఎంతెంత దూరం?
ABN , Publish Date - Sep 21 , 2026 | 05:00 AM
సాహిత్యం ఎప్పుడూ ప్రశ్నల మధ్యనే బతికింది. మనిషి ఎవరు? ప్రేమ అంటే ఏమిటి? మరణం తర్వాత మిగిలేదేమిటి? జ్ఞాపకం మనిషిలో ఉంటుందా, మనిషే జ్ఞాపకంలో ఉంటాడా? అన్నవే ఆ ప్రశ్నలు....
సాహిత్యం ఎప్పుడూ ప్రశ్నల మధ్యనే బతికింది. మనిషి ఎవరు? ప్రేమ అంటే ఏమిటి? మరణం తర్వాత మిగిలేదేమిటి? జ్ఞాపకం మనిషిలో ఉంటుందా, మనిషే జ్ఞాపకంలో ఉంటాడా? అన్నవే ఆ ప్రశ్నలు. కాలం మారినప్పుడల్లా ప్రశ్నల రూపం మారింది. ఇప్పుడు కృత్రిమ మేధ సాహిత్యం ముందు నిలబెడుతున్న ప్రశ్నలు మాత్రం మరింత అసౌకర్యమైనవి.
యంత్రం సృష్టించిన సాహిత్యానికి యజమాని ఎవరు? కవి, కలం అనే పాత సమీకరణం ఇప్పుడు ప్రాంప్ట్, కవి, యంత్రం అనే కొత్త త్రికోణంగా మారిందా? సోషల్ మీడియా కవిత్వాన్ని ప్రజాస్వామ్యీకరిస్తోందా, లేక అల్గారిథమ్‌కు అనుగుణంగా కుదిస్తున్నదా? భవిష్యత్ పాఠకుడు పుస్తకాన్ని చదువుతాడా, లేక దానితో మాట్లాడతాడా? యంత్రం కూడా రాయగలిగినప్పుడు మానవ రచయిత ఎందుకు? ఇవీ ఆ కొత్త ప్రశ్నలు.
ఏఐ ఏదైనా సరే అద్బుతంగానే రాసేస్తుందేమోనన్న వాదనను కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. ‘‘ఏఐ ఎప్పటికీ మనిషిలా రాయలేదు’’ అని మనల్ని మనం ఓదార్చుకోవడం వంచనే అవుతుంది. అసలు ప్రశ్న– మనిషి ఎందుకు రాస్తాడు? అన్నది. కొన్నిసార్లు మనిషి బతకడానికి రాస్తాడు. ప్రేమ విఫలమైన తర్వాత రాస్తాడు. జైలులో రాస్తాడు. యుద్ధం మధ్య రాస్తాడు. తనను ఎవరూ విననప్పుడు కాగితానికి చెబుతాడు. అంటే రచన ఒక ఉత్పత్తి మాత్రమే కాదు. ఒక మానవ చర్య. కొన్నిసార్లు సాక్ష్యం. కొన్నిసార్లు ప్రతిఘటన. కొన్నిసార్లు తనను తాను కాపాడుకునే ప్రయత్నం.
మనిషి యంత్రం ముందు కూర్చుని, ‘‘కవిత రాయి’’ అంటున్నాడు. చూడటానికి సాధారణమైన ఈ వాక్యం సాహిత్య చరిత్రలో అసాధారణమైనది. ఇంతకు ముందెప్పుడూ లేనిది. ఇంతకాలం మనిషి తన కథను మరో మనిషికి చెప్పాడు. ఇప్పుడు తనకోసం కథో, కవితో, వ్యాసమో తయారు చేయమని యంత్రాన్ని అడుగుతున్నాడు.
సాహిత్యం మొదట్నుంచీ మనిషిని నిర్వచించడానికి ప్రయత్నించింది. దేవుళ్లు, రాక్షసులు, దయ్యాలు, రోబోలు.. తనకు భిన్నమైన జీవులను ఊహించి వాటిలో తననే చూసుకుంది. ఇప్పుడు ఏఐ ఆ ప్రశ్నను మరింత సంక్లిష్టం చేస్తోంది. మరణించిన భర్త పాత మెయిళ్లు, స్వరం, ఫోటోల ఆధారంగా రూపొందించిన ఏఐ అవతార్‌తో ఒక మహిళ ప్రతిరోజూ మాట్లాడుతుందనుకుందాం. ఆమె ఎవరితో మాట్లాడుతోంది? భర్తతోనా? జ్ఞాపకంతోనా? డేటాతోనా? తన ఒంటరితనంతోనా? ఒక హ్యూమనాయిడ్ ‘‘నాకు బాధగా ఉంది’’ అంటే, అది నిజంగా బాధపడుతోందా అన్నది మాత్రమే ప్రశ్న కాదు. అది బాధపడుతోందని మనిషి నమ్మితే ఆ సంబంధం నిజమవుతుందా? అన్నదే మరింత ఆసక్తికరం.
ఒకప్పుడు కవితను సంపాదకుడు ఎంపిక చేసేవాడు. తర్వాత పాఠకుడు ఎంపిక చేశాడు. ఇప్పుడు అల్గారిథమ్ ఎవరికి ఏ కవిత కనిపించాలో నిర్ణయిస్తోంది. పొడవైన ధ్యానాత్మక కవిత కంటే వెంటనే అర్థమయ్యే పంక్తి వేగంగా ప్రయాణిస్తుంది. రెండోసారి చదివినప్పుడు మాత్రమే తెరుచుకునే కవితకంటే మొదటి మూడు సెకన్లలో ఆకట్టుకునే వాక్యానికి ఎక్కువ అవకాశముంటుంది. ఇక్కడ ప్రమాదం రచన చిన్నదవడం కాదు. పాఠకుడి ఓపిక చిన్నదవడం.
సోషల్ మీడియా కవిత్వానికి ఒక ప్రజాస్వామ్యాన్నిచ్చింది. ప్రచురణకర్త తలుపు మూసిన కవికి అది కిటికీని తెరిచింది. కానీ ప్రతి ప్రజాస్వామ్యం వెంట మార్కెట్ కూడా వస్తుంది. కవిత చదవటమే కాదు, ఎన్ని సెకన్లు చూసారు, ఎన్ని సార్లు షేర్ అయింది అన్నది కూడా ఆ కవిత ప్రయాణాన్ని నిర్ణయిస్తోంది. ఏఐ ఈ వేగాన్ని మరింత పెంచుతోంది. ఒకే భావానికి పదిరూపాలు క్షణాల్లో తయారవుతాయి ‘‘ఇంకా విషాదంగా’’, ‘‘మరింత తాత్వికంగా’’, ‘‘ఇంకా వైరల్ అయ్యేటట్టు’’. ఇక్కడ కవి ఎదుర్కొనే అసలు ప్రమాదం యంత్రం తన స్థానాన్ని ఆక్రమించడం కాదు. తన స్వరాన్ని తానే గుర్తుపట్టలేని స్థితికి చేరడం. ఇక్కడే సృజన కర్తృత్వం అనే ప్రశ్న వస్తుంది. ఒక కవి ఏఐతో ‘‘భర్త చనిపోయిన తర్వాత అతని ఖాళీ కుర్చీతో మాట్లాడుతున్న వృద్ధురాలి మీద కవిత రాయి’’ అంటాడు. సందర్భం మనిషి ఇచ్చాడు. భావోద్వేగ ఉష్ణోగ్రతను మనిషి నిర్ణయించాడు. పదాలను యంత్రం అమర్చింది. అప్పుడు కవిత ఎవరిది?
రచన అంటే వాక్యాలను సమర్థంగా అమర్చడమే అయితే యంత్రమూ రచయితే. కానీ రచన అంటే జీవనానుభవం భాషగా పరివర్తన చెందడం అయితే సమస్య అక్కడ మొదలవుతుంది. యంత్రానికి బాల్యం లేదు. తల్లి ఒడి జ్ఞాపకం లేదు. ప్రేమలో ఎదురుచూపు లేదు. మరణించిన తండ్రి తర్వాత ఇంట్లో ఏర్పడిన ఖాళీ తెలియదు. కానీ వీటన్నింటి గురించి మనుషులు రాసిన కోట్లాది వాక్యాల నమూనాలు దానికి తెలుసు. అంటే యంత్రానికి జ్ఞాపకం లాంటి సమాచారం ఉంది, జ్ఞాపకం లేదు. వేదన గురించి భాష ఉంది, వేదన లేదు.
ప్రసేన్
70133 58154
అలాగని మనిషైనా శూన్యంలోంచి రాయడు. కనుక అతని రచన ఒరిజనలేనా అనే ప్రశ్న ఎదురవడం కూడా సమంజసమేనేమో. పదేళ్ల క్రితం ఈ ప్రశ్న అసందర్భం. కానీ ఇప్పుడు ఏఐ రచనా పద్ధతిని శంకిస్తున్న నేపథ్యంలో ఈ ప్రశ్న సరైనదే. అతనిలో చదివిన పుస్తకాలు, విన్న కథలు, ఊరి భాష, పురాణం, చరిత్ర, రాజకీయ అనుభవం అన్నీ ఉంటాయి. తేడా ఏమిటంటే మనిషి వాటిని తన జీవితంతో రంగరిస్తాడు. అవి అతని శరీరం, కాలం, ప్రేమ, అపరాధబోధ, భయం, నష్టం అన్నింటినీ తాకి భాషగానో సృజనగానో మారతాయి. అందుకే ఇక ‘‘ఎవరు టైప్ చేశారు?’’ అనే ప్రశ్న కంటే ‘‘ఈ రచనకు నిర్ణయాత్మక సృజనాత్మక బాధ్యత ఎవరిది?’’ అన్నది ముఖ్యమవుతుంది. దీంతో కాపీరైట్ ప్రశ్న కూడా సంక్లిష్టమవుతుంది. యంత్రం రూపొందించిన వచనానికి హక్కు ప్రాంప్ట్ ఇచ్చిన వ్యక్తిదా? సాంకేతిక సంస్థదా? శిక్షణలో ఉపయోగించిన రచయితలకూ నైతిక వాటా ఉందా? భవిష్యత్తులో కాపీ రైట్‌తోపాటు ఒక రచన ఎలా తయారైంది, మానవుడి పాత్ర ఎంత, యంత్ర సహాయం ఎంత అనే creative provenance కూడా ముఖ్యమవ్వచ్చు. ఏఐ వాడటం తప్పు కాదు. కానీ ఏఐ రాసినదాన్ని పూర్తిగా తానే రాసినట్టు ప్రకటించడం సమంజసమా అన్నది ప్రశ్న. ఇది సాహిత్య నైతికతలో ఏఐ సంధించిన ఒక కొత్త విలువ సమస్య.
భవిష్యత్ కథల్లో ఏఐ పాత్రలు మనిషికి ప్రత్యర్థులుగా మాత్రమే ఉండవేమో. అవి ప్రేమికులు, స్నేహితులు, పిల్లలు, సంరక్షకులు, జ్ఞాపకాల ప్రతిరూపాలు కావచ్చు. అప్పుడు సాహిత్యంలో ముఖ్యంగా ఫిక్షన్‌లో ‘‘పాత్ర’’ అనే భావనకే కొత్త నిర్వచనం చెప్పుకోవాల్సుంటుంది. బహుశా భవిష్యత్ పుస్తకం మౌనంగా ఉండదు. ‘‘ఈ సంఘటనను కర్ణుడి దృష్టిలో చెప్పు’’, ‘‘ఈ పాత్ర ఎందుకు అబద్ధం చెప్పింది?’’ అని అడిగితే వెంటనే సమాధానం వస్తుంది. అంటే పుస్తకం వస్తువు నుంచి సంభాషణగా మారిందనమాట. ఈ గొప్ప అవకాశం వెనుక మరో ప్రమాదం కూడా ఉంది. సాహిత్యంలోని గొప్ప ఆనందాల్లో అస్పష్టత ఒకటి. రచయిత చెప్పకుండా వదిలిన ఖాళీలోనే పాఠకుడు తన అనుభవాన్ని చూసుకుంటాడు. ప్రతి మౌనానికీ యంత్రం అర్థం చెప్పేస్తే, పాఠకుడి ఊహకు మిగిలేది ఏమిటి?
బహుశా భవిష్యత్తులో మంచి పాఠకుడు ఎక్కువ సమాధానాలు పొందినవాడు కాదు, కొన్ని ప్రశ్నలను యంత్రాన్ని అడగకుండా తనలోనే ఉంచుకోగలిగినవాడు. సాహిత్యం అత్యుత్తమంగా అమర్చిన పదాల సమాహారం మాత్రమే కాదు, జీవితం తనను తాను భాషలో కనుగొన్న క్షణం కూడా. కనుకనే రాబోయే కాలంలో మానవ రచయిత అడగవలసిన ప్రశ్న ‘‘యంత్రం ఎంత గొప్పగా రాస్తుంది?’’ అని కాదు. ‘‘యంత్రం కూడా రాయగలిగే ఈ ప్రపంచంలో నేను మాత్రమే రాయవలసినది ఏమిటి?’’ అని. బహుశా అక్కడే రేపటి సాహిత్యం మొదలవుతుంది. భవిష్యత్తు ప్రశ్న ‘‘ఇది మనిషి రాశాడా? యంత్రం రాసిందా?’’ అని కాకపోవచ్చు. ‘‘ఈ రచన వెనుక ఏ రకమైన చైతన్యం, ఎంపిక, అనుభవం, బాధ్యత ఉన్నాయి?’’ అని కావచ్చు. కనుక ‘‘ఆఖరి మానవ రచయిత’’ వచ్చేస్తున్నాడన్న ఆందోళన ఇప్పుడే అవసరం లేదు. ఏఐతో కలిసి రాసే మొదటి తరం రచయితలు, కవులు, వ్యాసకర్తలు ఇప్పటికే వచ్చేశారన్నదైతే నిజం.
ఈ వార్తలు కూడా చదవండి..
క్యాన్సర్ చికిత్సలో మరో ముందడుగు.. జీజీహెచ్‌లో ఉచిత జన్యు పరీక్షలు
ప్రజల భూమిని లాక్కునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: మంత్రి పొంగులేటి
Read Latest AP News And Telugu News