A Soulful Telugu Poem: పక్షులు వాలని నేల నా మాతృభూమి
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:19 AM
నేనెప్పుడూ నాతోటే ఉన్నప్పటి చింత... నా నిశ్శబ్దంలో దాక్కుని నేనే మాట్లాడడం లాంటిది, నా సముద్ర భాషను నేనే వింటున్న దిగులు, నా ఏకాంత రాత్రులకు...
నేనెప్పుడూ
నాతోటే ఉన్నప్పటి చింత...
నా నిశ్శబ్దంలో దాక్కుని నేనే మాట్లాడడం లాంటిది,
నా సముద్ర భాషను నేనే వింటున్న దిగులు,
నా ఏకాంత రాత్రులకు మల్లెపూలిచ్చి పొమ్మని
నేనెవరినీ పిలవడం లేదు..
నేను వెల్లకిలా పడుకుంటే గుచ్చుకున్న కాలం,
ఉదయాలుగా, సాయంత్రాలుగా ముక్కలైంది
తెల్లార్లూ కూచున్నా రాత్రి తెల్లారదు..
ఈ నిశ్శబ్దం అతి ప్రాచీనం
రాత్రి కన్న కలలు దిండు కింద నలిగి
పొద్దుటికి వాడిపోతాయి..
నేను సంక్షుభిత మానవుడ్ని
ఆకురాలు కాలం నా హృదయం
పక్షులు వాలని నేల నా మాతృభూమి
తీరీతీరని దాహాలలో రోజులన్నీ మధ్యాహ్నాలే
జీవితం అర్ధరాత్రి స్కలిస్తుంది
కాలికాలి కాంక్షలు పక్కనే నిద్రపోతాయి
మనసు భిక్షాపాత్ర-
తరచూ అది ద్రవరూప వేదనతో నిండిపోతుంది
కదల లేని యితివృత్తం
కాలానికి అడ్డంగా పడుకుంటుంది
ఈ దుఃఖంతో శరీర సాంగత్యం ఎన్నాళ్లు?
అబద్ధాలు శాంతినివ్వవు
సంతోషాలు కాంతివిహీనం
చినుకుకీ చినుకుకీ మధ్య ఖాళీలోకి
తలుపులు తెరుచుకుంటాను
చూపు తడుస్తుంది..
నా చెవి వెనక సముద్రపు హోరు,
సమస్త మానవాళి దుఃఖగీతిక లాగు..
అప్పుడప్పుడు పాత ముఖాలే కొత్త పరిచయాలుగా
ఎదురొస్తాయి
ఎవరివో అడుగు జాడలు,
యింకా పచ్చిగానే ఉన్నాయి
మళ్ళీమళ్లీ రానివారెవరో పాదముద్రలు వదిలిపెట్టి వెళ్లారు
ఏ సూర్యోదయానికి ప్రణమిల్లామో,
ఏ సూర్యాస్తమయానికీ తెలీదు..
ఏ ప్రయాణంలో కలిసి నడుస్తామో
ఏ రహదారికీ తెలీదు..
రేపటి ఆశలకు నేడు నివాళి
అరుణ్ బవేరా
94407 10678
ఈ వార్తలు కూడా చదవండి..
అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
మేడారంలో కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
For More TG News And Telugu News