Share News

A Poetic Reflection on Loneliness: నెనరు లేని నెమరు

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:09 AM

ఒక్కడినే నీడలు అనేకం వెంట ఉండేవి తక్కువ వెంటాడేవి ఎక్కువ వెనక ముందు నీడల మధ్య నలిగిపోతున్న...

A Poetic Reflection on Loneliness: నెనరు లేని నెమరు

ఒక్కడినే

నీడలు అనేకం

వెంట ఉండేవి తక్కువ

వెంటాడేవి ఎక్కువ

వెనక ముందు నీడల మధ్య

నలిగిపోతున్న

తల నిండా నీడలు

బుస కొడుతున్నాయి

పొదల తల పొంచి ఉంది

జ్ఞాపకం తొంగి చూడగానే

ఓ నీడ వికటాట్టహాసం

వెన్నెల చుట్టుకొని ఉన్న జాబిల్లి.

పడగ విప్పినట్టుంది

కాలం తోక మీద నడుస్తున్న

ఎప్పుడు తల దగ్గరికి వస్తానో ఏమో

భయం భయం

నమ్మకం కుబుసం విడిచిన సత్యం

కాలం మెలికలలో పొద్దు

పడమరకు పాకుతుంది

ఇంతకాలం బతికి చచ్చిన

క్షణమైన చచ్చి బతుకుతే బాగుండు

దేహం గిలిగింతల స్పర్శ కోల్పోయింది

మొద్దుబారిన మొండి రాగిచెట్టు

ఏ తేదీ ఏ తిథీ నాది కాదు

జెంత్రీ నుంచి కాలాన్ని ఎప్పుడో జప్తు చేసుకున్నరు

ఎద్దు పోయిన గంగెడ్లన్నీ

దండం పెట్టుకున్న, బొట్టు పెట్టుకున్న ముట్టుకోనల్లే

నిచ్చెన ఎక్కుదామంటే పండబెట్టి పాడెను చేస్తున్రు

ఇట్లా వచ్చి అట్లా ఎక్కి పోతున్నారు

దేశం నాకు మారుతల్లి

రగతం కారింది లేదు గాయం కనిపించింది లేదు

బాధ కళ్ళని పలకరించిపోతుంది

ఏకాంతం అవుదామంటే

ఒంటరితనం వదలట్లేదు

ఎదకు అంటని రంగులు

మొఖానికి ఎంత పూసుకుంటే ఏంది

ఇగురు తొడగని ఇంట్లో

సెగలు కమ్మి

అగ్గిధారలు కురుస్తుంటే తడుస్తున్న

అటుకులు ఇస్తే ఆ లింగనం చేసుకునేటోడేడి

ఆవుసిస్తే మట్టి ఒక్కటే ఆలింగనం చేసుకుంటుంది.

మునాసు వెంకట్

99481 58163

ఈ వార్తలు కూడా చదవండి..

అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

మేడారంలో కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

For More TG News And Telugu News

Updated Date - Jan 19 , 2026 | 12:09 AM