Share News

కామదహనం ఎందుకు నిర్వహిస్తారంటే..?

ABN , Publish Date - Mar 02 , 2026 | 04:15 PM

హోలీ పండగకు ముందు కామదహనం కార్యక్రమం నిర్వహిస్తారు. ఇంతకీ కామదహనం అంటే ఏమిటీ? హోలీ పౌర్ణమి ముందు ఈ కామదహనం ఎందుకు చేస్తారంటే..?

కామదహనం ఎందుకు నిర్వహిస్తారంటే..?

హోలీ పండగకు ముందు కామదహనం కార్యక్రమం నిర్వహిస్తారు. ఇంతకీ కామదహనం అంటే ఏమిటీ? హోలీ పౌర్ణమి ముందు ఈ కామదహనం ఎందుకు చేస్తారంటే..? మార్చి 3వ తేదీ మంగళవారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి. ఈ రోజు ముందు రోజు రాత్రి అంటే.. ఈ రోజు సోమవారం రాత్రి కామదహనం నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పౌర్ణమి తిథిలో ఈ కామదహన కార్యక్రమాన్ని చేపడతారు.


దుష్ట శక్తులపై మంచి..

హిరణ్య కశ్యపుడుకి నారాయణుడు అంటే పరమ ద్వేషం. హిరణ్య కశ్యపుడి కుమారుడు ప్రహ్లాదుడు. అతడు నిత్యం హరినామస్మరణ చేస్తుంటాడు. తన కుమారుడితో హరినామసర్మణ మాన్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేయడమే కాకుండా.. అతడిని తీవ్ర హింసలకు గురి చేస్తాడు. హరినామస్మరణను మాత్రం ప్రహ్లాదుడు వీడడు. హిరణ్య కశ్యపుడికి హోలీకా అనే సోదరి ఉంటుంది. ఆమెకు అగ్నిలో దహనం కాకుండా ఉండే వరం ఉంటుంది.


ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిప్రవేశం చేయాలంటూ సోదరి హోలీకను హిరణ్య కశ్యపుడు ఆదేశిస్తాడు. ఆమె అలానే చేస్తుంది. ఆ సమయంలో సైతం ప్రహ్లాదుడు హరినామస్మరణను వదిలి పెట్టడు. అతడి భక్తి ముందు అగ్ని సైతం నిలువలేక పోతుంది. విష్ణు భక్తునికి హాని తలపెట్టిన హోలీకా ఆ అగ్నికి ఆహుతి అవుతుంది. దుష్టశక్తులపై విజయం సాధించినందుకు ప్రతీకగా కామదహనం పేరిట హోలీకా దిష్టిబొమ్మను దహనం చేస్తారు. అంటే.. దుష్ట శక్తులపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ కామదహనం కార్యక్రమం నిర్వహిస్తారు.


మరో కథనం..

కామదహనంపై శివపురాణంలో మరో కథనం ఉంది. తారకాసురుడి ఆగడాలు మితిమీరడంతో.. శివపార్వతుల మధ్య ప్రేమ చిగురింప చేసే బాధ్యతను మన్మధునికి దేవతలు అప్పగిస్తారు. తపస్సు చేసుకుంటున్న పరమ శివుడిపై మన్మధుడు తన చెరుకు విల్లుతో పూలబాణాలు విసురుతాడు. దాంతో తనకు సేవలు చేస్తున్న పార్వతిని చూసి శివుడు మన్మధ తాపానికి గురవుతాడు. దీంతో కుమారసంభవం జరుగుతుంది. అంతలోనే మహాశివుడు తేరుకుని తన తపస్సుకు భగ్నం చేసిన మన్మధుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మూడో కన్ను తెరుస్తాడు. ఆ వెంటనే మన్మధుడు భస్మమవుతాడు. క్షణికమైన కోరికలను వీడి జ్ఞానమార్గంలో ప్రయాణించాలని సూచించేందుకు ప్రతీకగా హోలీ పండగ ముందు రోజు రాత్రి కామదహన ఉత్సవాన్ని నిర్వహిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రగ్రహణం.. హోలీ పండగ ఎప్పుడు..?

రేపే సంపూర్ణ చంద్రగ్రహణం.. ఆకాశంలో ‘బ్లడ్‌మూన్’ కనువిందు..

For More Devotional News And Telugu News

Updated Date - Mar 02 , 2026 | 04:45 PM