Share News

Makara Sankranti 2026: ఇంతకీ సంక్రాంతి జనవరి 14 లేదా 15నా.. ఎప్పుడు జరుపుకోవాలి?

ABN , Publish Date - Jan 12 , 2026 | 04:29 PM

కొన్ని సంప్రదాయ పంచాంగాలు సూర్యోదయం ఆధారంగా నియమాలను అనుసరిస్తాయి. సూర్యుడు సాయంత్రం చాలా ఆలస్యంగా లేదా సూర్యాస్తమయం తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

Makara Sankranti 2026: ఇంతకీ సంక్రాంతి జనవరి 14 లేదా 15నా.. ఎప్పుడు జరుపుకోవాలి?

మకర సంక్రాంతి.. ఏడాదిలో వచ్చే తొలి పండగే కాదు. అతి పెద్ద పండగల్లో ఇది కూడా ఒకటి. ఈ ఏడాది ఈ మకర సంక్రాంతి పండగ జనవరి 14 లేదా 15వ తేదీన జరుపుకోవాలా? అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. అదీకాక చాంద్రమానం ప్రకారం ఏడాదిలో దాదాపు అన్ని పండగలు జరుపుకుంటాం. కానీ సౌరమానం ఆధారంగా సంక్రాంతిని జరుపుకుంటాం. ఇంకా చెప్పాలంటే.. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర ఘడియలనే మకర సంక్రాంతిగా అంతా పరిగణిస్తారు. ఈ ఏడాది అంటే.. 2026, జనవరి 14వ తేదీన పవిత్ర స్నానాలు, దానధర్మాలు, సూర్య ఆరాధన చేయాలని పండితులు క్లియర్ కట్‌గా స్పష్టం చేస్తున్నారు.


గందరగోళం ఎందుకంటే..?

కొన్ని సంప్రదాయ పంచాంగాలు సూర్యోదయం ఆధారంగా నియమాలను అనుసరిస్తాయి. సూర్యుడు సాయంత్రం చాలా ఆలస్యంగా లేదా సూర్యాస్తమయం తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో పండగ మరుసటి రోజు జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది జనవరి 14వ తేదీ మధ్యాహ్నమే ఈ మార్పు జరుగుతుంది. దాంతో ఈ పండగ బుధవారం అంటే.. జనవరి 14వ తేదీనే జరుపుకోనున్నారు.

దీని ప్రకారం 2026లో మకర సంక్రాంతి వేడుకలకు జనవరి 14వ తేదీగా నిర్ణయించారు. ఈ రోజు మధ్యాహ్నం 3.13 గంటలకు సంక్రాంతి ముహూర్తం వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రోజే పండగ జరుపుకోవాలి. అంటే జనవరి 15వ తేదీ కాదన్నది సుస్పష్టం.


ఈ సమయంలో భక్తులు..

  • నదులు లేదా ఇంట్లో పవిత్ర స్నానం ఆచరించాలి.

  • సూర్యుడికి నీరు (అర్ఘ్యం) అర్పించాలి.

  • సూర్యుడిని ఆరాధించాలి.

  • ఆహారం, దుస్తులు, నువ్వులు, బెల్లం దానం చేయాలి.


దక్షిణాయణం నుంచి ఉత్తరాయణం వైపు..

ఈ మకర సంక్రాంతి వేళ.. సూర్యుడు దక్షిణాయణం (సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణం) ముగించుకుని.. ఉత్తరాయణం దిశగా ప్రారంభాన్ని సూచిస్తుంది. సూర్య భగవానుడి ప్రయాణ మార్పు ఆశ, కాంతి, సానుకూల శక్తిని తెస్తుందని అంతా ప్రగాఢంగా విశ్వసిస్తారు.


దేశవ్యాప్తంగా ఇదే సంప్రదాయం..

  • ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు సూర్యుడిని పూజిస్తారు.

  • పేదవారికి వస్త్రాలు దానం చేస్తారు.

  • నువ్వుల లడ్డు, స్వీట్లు, పిండి వంటలు ఇంటి వద్ద చేసుకుని తింటారు.


పండగ అర్థం ఒకటే కానీ.. వేడుకల అర్థం ప్రాంతాల వారీగా మారిపోతుంది.

  • గుజరాత్, రాజస్థాన్: ఆకాశంలో గాలిపటాలు ఎగురవేస్తారు.

  • తమిళనాడు: పొంగల్‌గా ఈ పండగను జరుపుకుంటారు. ఇది అనేక రోజుల పంట పండగా వారు భావిస్తారు.

  • అసోం: మాఘ్ బిహుగా జరుపుకుంటారు.

  • పశ్చిమ బెంగాల్: పౌష్ పర్బన్ అని ఈ పండగను పిలుస్తారు.

అయితే ఈ పండగ పేర్లు, ఆచారాలు భిన్నంగా ఉన్నప్పటికీ అన్ని వేడుకలు పంట శ్రేయస్సుతోపాటు కృతజ్ఞతతో ముడిపడి ఉంటాయి. ఈ పండగ.. ప్రతి ఏడాది ఒకే సమయంలో వస్తుంది.

Updated Date - Jan 12 , 2026 | 05:36 PM