Share News

మాఘ పౌర్ణమి.. భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు

ABN , Publish Date - Feb 01 , 2026 | 08:48 AM

మాఘ పౌర్ణమి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి సముద్ర, నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు.. వాటిలో స్నానం ఆచరించి దేవాలయాలకు తరలి వెళ్తున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని పాయకరావు పేట, ఎలమంచిలి నియోజకవర్గాల్లోని తీర ప్రాంతాల్లో భక్తులు పవిత్ర పుణ్య స్నానాలు చేస్తున్నారు.

మాఘ పౌర్ణమి.. భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు

హైదరాబాద్/ అమరావతి, ఫిబ్రవరి 01: మాఘ పౌర్ణమి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి సముద్ర, నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు.. వాటిలో స్నానం ఆచరించి సమీపంలోని దేవాలయాలకు తరలి వెళ్తున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని పాయకరావు పేట, ఎలమంచిలి నియోజకవర్గాల్లోని తీర ప్రాంతాల్లో భక్తులు పవిత్ర పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఇక పోలవరం, పెంటకోట, రాంబిల్లి ప్రాంతాల్లో భక్తులతో సముద్ర తీర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. అనంతరం కొండపై కొలువుదీరిన రాధామాధవస్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, ఆర్టీసీ, రెవెన్యూ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


ఇక భద్రాచలంలోని రామాలయంలో నేడు సహస్ర కలశాభిషేకం వేడుకను నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ రోజు సాయంత్రం భద్రాచలంలో గోదావరి ఘాట్ వద్ద నదీకి హారతి కార్యక్రమం చేపట్టనున్నారు. మరో వైపు పార్వతీ దేవికి ఇష్టమైన రోజ.. ఈ మాఘ పౌర్ణమి. ఈ రోజున పలు దేవాలయాల్లో సామూహికంగా శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణం చేస్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయాల్లో అఖండ దీపారాధన వెలిగించే కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడికి ఇష్టమైన మాసం.. మాఘమాసం. దీంతో నదులు, సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలు ఈ రోజు ఉదయమే వాటిలో పుణ్య స్నానం ఆచరించి.. అనంతరం సూర్య నమస్కారాలు చేస్తున్నారు.

Updated Date - Feb 01 , 2026 | 11:33 AM