Share News

పునఃప్రారంభమైన అమర్‌నాథ్ వార్షిక యాత్ర..

ABN , Publish Date - Jul 25 , 2026 | 08:39 AM

భారీ వర్షాల కారణంగా ఆరు రోజుల పాటు నిలిచిపోయిన అమర్‌నాథ్ వార్షిక యాత్ర ఇవాళ (శనివారం) పునఃప్రారంభమైంది. జమ్మూ నుంచి 6 వేల మందికి పైగా యాత్రికులతో కొత్త బృందం కశ్మీర్ లోయలోని బల్తాల్ బేస్ క్యాంప్‌కు బయలుదేరింది.

పునఃప్రారంభమైన అమర్‌నాథ్ వార్షిక యాత్ర..
Amarnath Yatra 2026

జమ్మూకశ్మీర్: భారీ వర్షాల కారణంగా ఆరు రోజుల పాటు నిలిచిపోయిన అమర్‌నాథ్ వార్షిక యాత్ర ఇవాళ (శనివారం) పునఃప్రారంభమైంది. జమ్మూ నుంచి 6 వేల మందికి పైగా యాత్రికులతో కొత్త బృందం కశ్మీర్ లోయలోని బల్తాల్ బేస్ క్యాంప్‌కు బయలుదేరింది. అధికారుల నివేదిక ప్రకారం యాత్రికుల్లో 1,470 మంది మహిళలు, 25 మంది పిల్లలు, 54 మంది సాధువులతో సహా మొత్తం 6,269 మందితో కూడిన 18వ బృందం యాత్ర ప్రారంభించింది.


శనివారం తెల్లవారుజామున సుమారు 2:40 గంటలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ 223 వాహనాల కాన్వాయ్‌లో బల్తాల్ బేస్ క్యాంప్‌కు యాత్రికులు బయలుదేరారు. అయితే, పహల్గామ్ మార్గానికి మాత్రం ఎలాంటి కాన్వాయ్‌ను పంపలేదని తెలుస్తోంది. కశ్మీర్ లోయ అంతటా ఎడతెరిపి లేని వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పహల్గామ్, బల్తాల్ మార్గాల నుంచి జులై 19న యాత్రను నిలిపివేశారు. కాగా, ఈ వార్షిక యాత్రను జులై 2న భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. ఆగస్టు 28తో ముగియనున్న అమర్‌నాథ్ యాత్ర 57 రోజుల పాటు కొనసాగనుంది. ఇప్పటివరకు ఈ యాత్రలో 3.7 లక్షలకు పైగా భక్తులు పవిత్ర గుహ ఆలయాన్ని దర్శించుకున్నారు.


మరోవైపు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జులై 19 నుంచి మాతా వైష్ణో దేవి యాత్రనూ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైనప్పటికీ.. వైష్ణో దేవి యాత్ర మాత్రం ఇంకా పునఃప్రారంభం కాలేదు.


ఈ వార్తలు కూడా చదవండి

వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం

సోనమ్ వాంగ్‌చుక్‌‌పై విమర్శలు.. ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్..

Updated Date - Jul 25 , 2026 | 09:23 AM