కస్టమర్లకు షాక్.. ప్లాట్‌ఫామ్ ఫీజు భారీగా పెంచేసిన జొమాటో
ABN , Publish Date - Mar 20 , 2026 | 06:01 PM
జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజును భారీగా పెంచేసింది. ప్రతీ ఆర్డర్‌పై రూ.2.40 పెంచింది. 12.50 రూపాయలు ఉన్న ప్లాట్‌ఫామ్ ఫీజును 14.90 రూపాయలు చేసింది.
న్యూఢిల్లీ, మార్చి 20: ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ప్లాట్‌ఫామ్ ఫీజును భారీగా పెంచేసింది. ప్రతీ ఆర్డర్‌పై రూ.2.40 పెంచింది. 12.50 రూపాయలు ఉన్న ప్లాట్‌ఫామ్ ఫీజును 14.90 రూపాయలు చేసింది. ఈ పెంపు నిర్ణయం ఈ రోజు (శుక్రవారం) నుంచే అమల్లోకి వచ్చింది. జొమాటో ఏటా ప్లాట్ ఫామ్ ఫీజును పెంచుతూ వెళుతోంది. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో కూడా జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. 10 రూపాయలు ఉన్న ప్లాట్‌ఫామ్ ఫీజును 12.50 రూపాయలు చేసింది.
ఫుడ్ కాస్ట్ పెరిగిన ఈ సమయంలో కస్టమర్లకు జొమాటో నిర్ణయం పెను భారంగా మారనుంది. జొమాటో గోల్డ్ సభ్యులకు డెలివరీ ఛార్జీలు ఉచితం అయినప్పటికీ, వారు కూడా ఈ ప్లాట్‌ఫామ్ ఫీజును తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. మరీ ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు హోటళ్లు మూతపడ్డాయి. కొన్ని హోటళ్లు ధరలను పెంచేశాయి. పెరిగిన ధరలతో ఫుడ్ కాస్ట్ 100 రూపాయలు ఉంటే.. డెలివరీ ఫీజు, ప్లాట్‌ఫామ్ ఫీజు, జీఎస్టీతో కలిపి బిల్లు 150 రూపాయల నుంచి 170 రూపాయలు కానుంది.
ఫుడ్ డెలివరీ రంగంలోకి ర్యాపిడో..
జొమాటో, స్విగ్గీలకు పోటీగా ర్యాపిడో ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించింది. ‘ఓన్లీ‘ పేరిట ఓ కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కొద్దిరోజుల క్రితం బెంగళూరులో ప్రయోగాత్మకంగా ఓన్లీ సేవలు ప్రారంభం అయ్యాయి. ఓన్లీ యాప్‌లో ఎలాంటి కమీషన్స్ ఉండవని కంపెనీ తెలిపింది. కస్టమర్ కేవలం ఫుడ్ కోసం మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, అదనంగా ప్లాట్‌ఫామ్ ఫీ.. ఇతర ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
మొజ్తాబా ఖమేనీ వీడియో విడుదల చేసిన ఇరాన్ ప్రభుత్వ మీడియా
వంట, క్లీనింగ్ పనుల్లో భర్తలు కూడా పాలుపంచుకోవాల్సిందే: సుప్రీంకోర్టు