‘ఉడాన్ 2.0’తో రూ.60,000 కోట్ల బూస్ట్
ABN , Publish Date - Sep 23 , 2026 | 04:44 AM
దేశంలో ప్రాంతీయ విమానయానాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రారంభించిన ‘ఉడాన్ 2.0’ పథకంపై కేంద్ర ప్రభుత్వం చాలా ఆశలు పెట్టుకుంది. ఈ పథకం ద్వారా...
ఏపీ, తెలంగాణ సహా 21 రాష్ట్రాలతో విమాన శాఖ, ఏఏఐ ఎంఓయూలు
ప్రస్తుత గిరాకీ దృష్ట్యా దేశంలో కనీసం ఐదు ఎయిర్‌లైన్స్ అవసరం..
కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు
న్యూఢిల్లీ: దేశంలో ప్రాంతీయ విమానయానాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రారంభించిన ‘ఉడాన్ 2.0’ పథకంపై కేంద్ర ప్రభుత్వం చాలా ఆశలు పెట్టుకుంది. ఈ పథకం ద్వారా విమానయాన రంగంలోకి రూ.60,000 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులే రూ.30,000 కోట్ల వరకు ఉంటాయన్నారు. మిగతా మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు, విమానయాన సంస్థల ద్వారా రావచ్చన్నారు. ఉడాన్ 2.0 పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలతో జరిగిన అవగాహన ఒప్పందాల (ఎంఓయూ) కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఈ పథకం కింద ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విమాన శాఖ, భారతీయ విమానాశ్రయాల నిర్వహణ సంస్థ (ఏఏఐ)తో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి.
స్పైస్‌జెట్‌పై డీజీసీఏ పర్యవేక్షణ : ఆర్థిక కష్టాల్లో ఉన్న స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ నిర్వహణ, ఆర్థిక పరిస్థితులను పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్టు రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఇప్పటికే ఆ సంస్థకు అత్యవసర పరపతి హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్) కింద రూ.150 కోట్లు సమకూర్చినట్టు తెలిపారు. ప్రస్తుత గిరాకీ దృష్ట్యా మన దేశంలో ఒక్కొక్కటీ 100 విమానాలతో కూడిన ఐదు విమానయాన సంస్థల అవసరం ఉందని రామ్మోహన్ నాయుడు చెప్పారు.
ఎయిర్‌పోర్టు ఆపరేటర్లకు ఎయిర్‌లైన్స్‌లో వాటాపై త్వరలో నిర్ణయం: విమానాశ్రయాల నిర్వహణ సంస్థలు ఎయిర్‌లైన్స్‌లో వాటా కలిగి ఉండడంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు. అన్ని విషయాలను పరిశీలించాకే ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతానికైతే ఎయిర్‌పోర్టుల ఆపరేటర్లు దేశీయ విమానయాన సేవల సంస్థల్లో వాటా కలిగి ఉండడంపై ఎలాంటి నిషేధం లేదన్నారు.
పండుగ సీజన్‌లో సముచిత చార్జీలు
పండుగ సీజన్‌లోనూ విమానయాన సంస్థల చార్జీలు సముచితంగా ఉండాలని రామ్మోహన్ నాయుడు కోరారు. అలాగని చార్జీలపై గరిష్ఠ పరిమితి విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. పండుగలు, ఇతర రద్దీ సమయాల్లో విమాన చార్జీలను పెంచేస్తున్న నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే చార్జీల పెంపుపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు విమానయాన సంస్థలతో చర్చిస్తూనే ఉందన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఎయిర్‌లైన్స్‌ల ఇంధన వ్యయాలూ భారీగా పెరిగిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ
ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా