Share News

టాటా ట్రస్ట్స్ వ్యూహాత్మక అడుగు.. ఐపీఓ ఆపడానికే ఈ బిగ్ ప్లాన్?

ABN , Publish Date - Sep 28 , 2026 | 08:51 PM

టాటా గ్రూప్‌లోని టాటా సన్స్ ఐపీఓకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రైవేట్ కంపెనీగానే కొనసాగడం కోసం టాటా ట్రస్ట్స్ ఒక వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన తెచ్చింది.

టాటా ట్రస్ట్స్ వ్యూహాత్మక అడుగు.. ఐపీఓ ఆపడానికే ఈ బిగ్ ప్లాన్?
Tata Trusts Propose TESS, TCE Merger With Tata Sons to Exit NBFC, CIC Status

ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 28: టాటా సన్స్ ప్రిన్సిపల్ హోల్డింగ్ కంపెనీగా తన హోదాను కొనసాగిస్తూనే, ఆర్‌బీఐ (RBI) నిబంధనల ప్రకారం ఎన్‌బీఎఫ్‌సీ (NBFC) కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (CIC) వర్గీకరణల నుంచి బయటపడేందుకు 'టాటా ట్రస్ట్స్' (Tata Trusts) వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన తెచ్చింది.

విలీన ప్రతిపాదన (Merger Proposal)

టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (TSPL) లో 66శాతం వాటా ఉన్న టాటా ట్రస్ట్స్, తమ అనుబంధ సంస్థలైన టాటా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ సొల్యూషన్స్ (TESS), టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ (TCE)లను టాటా సన్స్‌తో విలీనం చేయాలని ప్రతిపాదించాయి.

ఆదాయ స్వరూపంలో మార్పు (Financial Restructuring)

మార్చి 31, 2026 నాటికి విలీనం ద్వారా ఏర్పడే సంస్థ ఆపరేటింగ్ రాబడి రూ.1,05,043 కోట్లకు చేరుకుంటుంది. ఆర్థిక ఆస్తుల నుంచి వచ్చే రాబడి (రూ.40,072 కోట్లు) కంటే ఆపరేటింగ్ రాబడి 64.3శాతం మేర అధికంగా ఉంటుంది. దీనివల్ల టాటా సన్స్ నాన్-ఫైనాన్షియల్ ఆపరేటింగ్ కంపెనీగా మారి, ఎన్‌బీఎఫ్‌సీ వర్గీకరణ పరిధి నుంచి బయటపడుతుంది.

CIC వర్గీకరణ ముగింపు, రిజిస్ట్రేషన్ సరండర్

గ్రూప్ కంపెనీలలో పెట్టుబడులు మొత్తం నికర ఆస్తులలో 90శాతం కంటే తక్కువకు పడిపోతాయి. ఫలితంగా ఇది CIC నిబంధనలకు దూరమవుతుంది. ఆర్‌బీఐ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను సరండర్ చేయాల్సి ఉంటుంది.

అన్-లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీగా కొనసాగింపు

టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయకుండా, ఒక అన్-లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీగా (Unlisted Private Company) నిలుపుకోవాలనే దొరాబ్జీ టాటా ట్రస్ట్, రతన్ టాటా ట్రస్ట్‌ల లక్ష్యానికి (జూలై 2025 తీర్మానాలు) ఈ ప్రతిపాదన అనుగుణంగా ఉంది.

తదుపరి చర్యలు

ఈ విలీన ప్రక్రియకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) అవసరం. దీనికోసం టాటా సన్స్ బోర్డు, టాటా ట్రస్ట్స్ ఆర్‌బీఐని సంప్రదించనున్నాయి.


టాటా గ్రూప్ ఐపీఓ నుంచి తప్పించుకోవడానికి పడుతున్న తాపత్రయం వెనుక ప్రధాన కారణాలు?

నియంత్రణ, గోప్యత

పబ్లిక్ నిఘా పెరుగుతుంది: ఐపీఓకి వెళ్తే ప్రతి త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలను వెల్లడించాల్సి వస్తుంది. పబ్లిక్, ఇన్వెస్టర్లు, విశ్లేషకుల (Analysts) ఒత్తిడి పెరుగుతుంది.

నిర్ణయాధికారం దెబ్బతింటుంది: టాటా సన్స్ అనేది టాటా గ్రూప్ మొత్తానికి మాతృ సంస్థ (Holding Company). దీనిలో నిర్ణయాలు స్వచ్ఛంద సంస్థలైన 'టాటా ట్రస్ట్స్' నియంత్రణలో ఉంటాయి. ఐపీఓకి వెళ్తే బయటి ఇన్వెస్టర్లు, బోర్డు డైరెక్టర్ల ప్రమేయం పెరిగి, గ్రూప్‌పై ట్రస్ట్స్ పూర్తి ఆధిపత్యం తగ్గిపోయే ప్రమాదం ఉంది.

ఆర్‌బీఐ రూల్ వల్ల వచ్చిన ఇబ్బంది

అప్పర్‌ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీ నిబంధన: 2021లో ఆర్‌బీఐ తెచ్చిన నిబంధన ప్రకారం సత్వర అభివృద్ధి చెందుతున్న 'అప్పర్ లేయర్' NBFCలు తప్పనిసరిగా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవ్వాలి (IPOకి వెళ్లాలి).

టాటా సన్స్ కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (CIC)గా ఉండటం వల్ల ఈ నిబంధన కిందకు వచ్చింది. కానీ టాటా గ్రూప్ మాత్రం దీన్ని సాధారణ ఫైనాన్షియల్ కంపెనీగా కాకుండా, కేవలం గ్రూప్ కంపెనీల హోల్డింగ్ సంస్థగా మాత్రమే పరిగణిస్తుంది.


ఈ వార్తలనూ చదవండి:

ట్రంప్‌తో ఆంత్రోపిక్ సీఈఓ భేటీ.. ఏఐ సేఫ్టీపై చర్చ

పాన్ కార్డులో పేరు తప్పు పడిందా..? మొబైల్‌లోనే మార్చుకోండిలా..

Updated Date - Sep 28 , 2026 | 09:08 PM