Share News

టాటా గ్రూపులో ముసలం

ABN , Publish Date - Sep 18 , 2026 | 01:50 AM

దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్‌లో ముసలం ముదురుతోంది. గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌, దాని ప్రమోటర్లైన టాటా ట్రస్ట్‌ల మధ్య ఏడాదికి పైగా కొనసాగుతున్న విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. గురువారం ముంబైలోని టాటా సన్స్‌ ప్రధాన కార్యాలయం (బాంబే హౌస్‌)లో దాదాపు 3 గంటల పాటు సమావేశమైన కంపెనీ బోర్డు సభ్యులు తీసుకున్న అనూహ్య నిర్ణయాలే ఇందుకు కారణం.

టాటా గ్రూపులో ముసలం
CHANDRASHEKHARAN

  • చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లు చైర్మన్‌గా నియమించిన టాటా సన్స్‌ బోర్డు

  • కంపెనీ షేర్ల లిస్టింగ్‌కు సైతం ఆమోదం

  • ఆ తీర్మానం చెల్లదంటున్న టాటా ట్రస్ట్‌లు

  • కోర్టును ఆశ్రయించనున్న నోయల్‌ టాటా!?

ముంబై: దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్‌లో ముసలం ముదురుతోంది. గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌, దాని ప్రమోటర్లైన టాటా ట్రస్ట్‌ల మధ్య ఏడాదికి పైగా కొనసాగుతున్న విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. గురువారం ముంబైలోని టాటా సన్స్‌ ప్రధాన కార్యాలయం (బాంబే హౌస్‌)లో దాదాపు 3 గంటల పాటు సమావేశమైన కంపెనీ బోర్డు సభ్యులు తీసుకున్న అనూహ్య నిర్ణయాలే ఇందుకు కారణం. టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా పునర్నియామకాన్ని కోరుకోవడం లేదని ఇదివరకే ప్రకటించిన నటరాజన్‌ చంద్రశేఖరన్‌కు కంపెనీ బోర్డు మరో ఐదేళ్లు సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది. చంద్రను అభ్యర్థించి, ఒప్పిం చి మరీ మూడోసారి చైర్మన్‌గా నియమించింది. అంతేకాదు, ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణం గా కంపెనీ షేర్లను మార్కెట్లో నమోదు చేయాలని కూడా బోర్డు నిర్ణయించింది. అయితే, టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌, టాటా సన్స్‌ బోర్డు సభ్యుల్లో ఒకరైన నోయల్‌ టాటా ఈ రెండు నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. బోర్డు సమావేశంలో చంద్రను చైర్మన్‌గా పునర్‌ నియమించాలన్న తీర్మానానికి వ్యతిరేకంగా నోయల్‌ ఓటు వేశారు. అయితే, మెజారిటీ (నలుగురు) సభ్యుల అనుకూల ఓటింగ్‌తో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. కానీ, ఈ తీర్మానం చట్ట విరుద్ధమని, చెల్లుబాటు కాదంటూ నోయల్‌ సారథ్యంలోని టాటా ట్రస్ట్‌లు వెం టనే ప్రకటన విడుదల చేశాయి. కాగా బోర్డు తాజా నిర్ణయాలను నోయల్‌ కోర్టులో సవాలు చేసే అవకాశముంది.


టాటా ట్రస్ట్‌లు చెబుతున్న కారణమిది..

చంద్రశేఖరన్‌ను మూడోసారిగా చైర్మన్‌గా నియమిస్తూ టాటా సన్స్‌ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నోయల్‌ నేతృత్వంలోని టాటా ట్రస్ట్‌లు వ్యతిరేకించాయి. చైర్మన్‌గా పునర్నియామకం కోరుకోవట్లేదని ఈ ఆగస్టులో చంద్ర చేసిన ప్రకటన ఆయన సొంత నిర్ణయమని, అందులో బోర్డు ప్రమేయం లేదన్నాయి. చంద్ర నిర్ణయాన్ని అంగీకరించడంతోపాటు టాటా సన్స్‌ ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ (ఏఓఏ) ప్రకారంగా కొత్త చైర్మన్‌ నియామకం కోసం ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. అంతేకాదు, చంద్ర పునర్నియామకం కోసం ఓటింగ్‌ ద్వారా జరిగిన తీర్మానం చట్టబద్ధంగా చెల్లుబాటు కాదని కూడా టాటా ట్రస్ట్‌లు వాదిస్తున్నాయి. ఎందుకంటే, టాటా ట్రస్ట్‌ల తరఫున టాటా సన్స్‌ బోర్డులో నియమించిన ఇద్దరు డైరెక్టర్లు సానుకూలంగా ఓటు వేస్తేనే తీర్మానం చెల్లుబాటు అవుతుందన్నది నోయల్‌ వాదన. టాటా ట్రస్ట్‌లు నామినేట్‌ చేసిన బోర్డు సభ్యుల్లో ఒకరైన నోయల్‌ టాటా పునర్‌ నియామకాన్ని వ్యతిరేకించగా.. మరో సభ్యుడు వేణు శ్రీనివాసన్‌ మాత్రం అనుకూలంగా ఓటు వేశారు. ఈ విషయంపై తమ వాదనను బలపరుస్తున్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ అభిప్రాయాన్ని కూడా టాటా సన్స్‌కు బోర్డుకు నోయల్‌ సమర్పించడం జరిగిందని, కానీ బోర్డు ఆ అభిప్రాయాన్ని పట్టించుకోలేదని టాటా ట్రస్ట్‌లు తమ ప్రకటనలో పేర్కొన్నాయి.


వేణు శ్రీనివాసన్‌ను అడ్డుకునే ప్రయత్నం

చంద్ర పునర్‌ నియామకం కోసం జరిగిన ఓటింగ్‌తో పాటు టాటా సన్స్‌ లిస్టింగ్‌పై నిర్ణయంతో పాలుపంచుకోవద్దని వేణు శ్రీనివాసన్‌ను టాటా ట్రస్ట్‌లు బుధవారమే కోరాయి. అయితే, శ్రీనివాసన్‌ మాత్రం ట్రస్ట్‌ల నిర్దేశాలను తోసిపుచ్చి టాటా సన్స్‌ బోర్డు సమావేశంలో చంద్ర పునర్నియామకంతో పాటు లిస్టింగ్‌ను బలపరిచారు. కంపెనీ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవడం సభ్యుడిగా తన బాధ్యతని శ్రీనివాసన్‌ ట్రస్ట్‌లకు గట్టిగా జవాబిచ్చారు.

టాటా సన్స్‌ బోర్డు ముందుకు

ఎస్‌పీ గ్రూప్‌ వాటా విక్రయ ప్రతిపాదన

టాటా సన్స్‌లోని 18 శాతం వాటాలో కొంత విక్రయం ద్వారా కనీసం రూ.25,000 కోట్ల వరకు సమకూర్చుకోవాలనుకుంటున్న షాపూర్‌జీ పల్లోంజీ (ఎ్‌సపీ) గ్రూప్‌ ప్రతిపాదనను నోయల్‌ టాటా.. బోర్డుకు సమర్పించారు. తద్వారా ఎస్‌పీ గ్రూప్‌లకు నిధుల కొరత తీరనుంది. అలాగే, టాటా సన్స్‌ను తప్పనిసరిగా లిస్ట్‌ చేయాలంటున్న ఎస్‌పీ గ్రూప్‌.. తనకు అత్యవసరమైన నిధులు సమకూరితే పట్టు వీడవచ్చని టాటా ట్రస్ట్‌లు ఆశిస్తున్నాయి. ఎందుకంటే, టాటా సన్స్‌ లిస్టింగ్‌ను టాటా ట్రస్ట్‌లు వ్యతిరేకిస్తున్నాయి.


కీలకంగా మారిన ఏజీఎం

టాటా సన్స్‌ బోర్డు తాజాగా తీసుకున్న రెండు నిర్ణయాలను కంపెనీ వార్షిక సమావేశం (ఏజీఎం)లో వాటాదారులు ఆమోదించాల్సి ఉంటుంది. టాటా సన్స్‌లో 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్‌లు ఏజీఎంలో వీటిని తిరస్కరించనున్నాయి. వాస్తవానికి కంపెనీ ఏజీఎం ఈ ఆగస్టు 18న జరగాల్సింది. సమావేశ నిర్వహణకు తగినంత మంది సభ్యులు (కోరమ్‌) లేని కారణంగా వాయిదా పడింది. మహారాష్ట్ర చారిటీ కమిషనర్‌ విధించిన ఆంక్షల కారణంగా టాటా సన్స్‌లో 51 శాతానికి పైగా వాటా కలిగిన సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌ (ఎ్‌సఆర్‌టీటీ), సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ (ఎ్‌సడీటీటీ)లు ఏజీఎం నిర్వహణకు తమ తరఫున సభ్యులను నామినేట్‌ చేయలేకపోవడంతో కోరమ్‌ తగ్గింది. ఎస్‌ఆర్‌టీటీపై మహారాష్ట్ర కమిషన్‌ విధించిన ఆంక్షలు తొలిగితే ఈ డిసెంబరు 31లోగా టాటా సన్స్‌తో పాటు టాటా ట్రస్ట్‌ల ఏజీఎంలను నిర్వహించే అవకాశం ఉంది. చంద్రశేఖరన్‌ను డైరెక్టర్‌ పదవి నుంచి తొలగించాలని టాటా ట్రస్ట్‌ల ఏజీఎంలో నోయల్‌ టాటా ప్రతిపాదించవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే జరిగితే, చంద్ర గ్రూప్‌ చైర్మన్‌గా కొనసాగేందుకు వీలుండదు.

ఈ వార్తలు కూడా చదవండి

యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా డబ్బులు కట్ అయ్యాయా? ఇలా చేయండి

యూపీఐపై ‘మోదీ పన్ను

Updated Date - Sep 18 , 2026 | 01:50 AM