టాటాకు చంద్ర వీడ్కోలు
ABN , Publish Date - Aug 13 , 2026 | 05:22 AM
దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్‌లో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి నటరాజన్ చంద్రశేఖరన్ (చంద్ర) వీడ్కోలు పలికారు....
టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోనున్న ఎన్ చంద్రశేఖరన్
2027 ఫిబ్రవరితో ముగియనున్న పదవీకాలం జూ పునర్నియామకం కోరుకోవడం లేదని ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్‌లో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి నటరాజన్ చంద్రశేఖరన్ (చంద్ర) వీడ్కోలు పలికారు. 2027 ఫిబ్రవరి 20తో ముగియనున్న ప్రస్తుత పదవీకాలం తర్వాత పునర్నియామకాన్ని కోరుకోవట్లేదని ఆయన బుధవారం ప్రకటించారు. టాటా సన్స్ చైర్మన్‌గా ఆయనకు ఇది రెండో టర్మ్. మూడోసారీ తననే కొనసాగించాలనే విషయంపై టాటా సన్స్ బోర్డు సభ్యులు, టాటా ట్రస్ట్‌ల మధ్య బేధాభిప్రాయాలు నెలకొనడంతో పాటు నోయల్ టాటాతో విబేధాల కారణంగా టాటా ట్రస్ట్‌ల బోర్డు సభ్యులు కూడా ఒక్కరొక్కరుగా తప్పుకుంటున్న నేపథ్యంలో చంద్ర ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అంతేకాదు, ఈ నెల 18న నిర్వహించనున్న టాటా సన్స్ వార్షిక వాటాదారుల సమావేశం (ఏజీఎం)లో చంద్ర పునర్నియామకంపై ఓటింగ్ జరగాల్సి ఉంది. అందులో ఏకగ్రీవ మద్దతు లభించే అవకాశాలు లేకపోవడంతో గౌరవప్రదంగా తప్పుకోవడం మేలని భావించే చంద్ర ఈ ప్రకటన చేసి ఉంటారని విశ్లేషకులు పేర్కొన్నారు. టీసీఎస్, టాటా మోటార్స్, ఎయిరిండియా సహా టాటా గ్రూప్‌లోని 30 కీలక కంపెనీల ప్రమోటరే టాటా సన్స్. ఈ సంస్థలో టాటా ట్రస్ట్‌లు మొత్తం 66ు వాటా కలిగి ఉన్నాయి. అంటే, టాటా గ్రూప్‌పై అంతిమ పట్టు ఈ ట్రస్టులదే.
అసలేం జరిగింది?
చంద్ర పదవీకాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని కంపెనీలో మెజారిటీ వాటా (51.54 శాతం) వాటా కలిగిన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ ఏకగ్రీవంగా ప్రతిపాదించాయి. టాటా సన్స్ నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ ఆ ప్రతిపాదనను ఆమోదించడంతో పాటు కంపెనీ బోర్డుకు కూడా సిఫారసు చేసింది. ఈ ఫిబ్రవరి 24న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో చంద్ర పునర్నియామక ప్రతిపాదనను కమిటీ ప్రవేశపెట్టింది. కానీ, బోర్డు సభ్యుల్లో ఒకరైన టాటా ట్రస్ట్‌ల చైర్మన్ నోయల్ టాటా మద్దతివ్వక పోవడంతో ఈ ప్రతిపాదన నిలిచిపోయింది. తన పునర్నియామకానికి ఏకగ్రీవ మద్దతు లభించకపోవడంతో, నిర్ణయాన్ని వాయిదా వేయాలని తాను కోరినట్లు చంద్ర అప్పట్లోనే ప్రకటించారు.
‘‘బోర్డు సమావేశం అనంతరం 6 నెలలు గడిచినా తన పునర్నియామకంపై ఎలాంటి తీర్మానం జరగలేదు. టాటా సన్స్ పర్యవేక్షణలోని పలు వ్యూహాత్మక ప్రాజెక్టులు కీలక దశల్లో ఉన్న తరుణంలో కంపెనీ నాయకత్వంపై స్పష్టత చాలా ముఖ్యం. ఈ పరిస్థితుల్లో నేను కీలక నిర్ణయం తీసుకున్నాను. నా ప్రస్తుత పదవీకాలం ముగిశాక పునర్నియామకం కోరుకోవడం లేదని టాటా సన్స్ బోర్డుకు తెలియజేశా. నాయకత్వ పరివర్తనం సాఫీగా సాగేందుకు భవిష్యత్ చైర్మన్‌ను త్వరలో ఎన్నుకోవాలని బోర్డును కోరినట్లు’’ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో 63 ఏళ్ల చంద్ర పేర్కొన్నారు.
రతన్ టాటాకు సన్నిహితుడు
157 ఏళ్ల చరిత్ర కలిగిన టాటా గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి పార్శీయేతర వ్యక్తి చంద్ర. స్వర్గీయ రతన్ టాటాకు విశ్వాసపాత్రుడు. గ్రూప్ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలతో 2016లో సైరస్ మిస్త్రీని చైర్మన్ పదవి నుంచి అర్థంతరంగా తప్పించిన రతన్ టాటా.. అనంతరం గ్రూప్ పగ్గాలను చంద్రకు అప్పగించారు.
టాటా గ్రూప్‌లో 40 ఏళ్ల ప్రస్థానం: టాటా గ్రూప్‌నకు చంద్ర 40 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. 1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎ్‌స)లో ట్రైనీ ప్రోగ్రామర్‌గా చేరిన ఆయన.. 2009 అక్టోబరులో కంపెనీ సీఈఓ, ఎండీగా బాధ్యతలు చేపట్టారు. 2017 జనవరిలో టాటా గ్రూప్ చైర్మన్‌గా నియమితులయ్యారు.
మొహనూర్ నుంచి బాంబే హౌస్ వరకు: తమిళనాడు, నమక్కల్ జిల్లాలోని మొహనూర్ గ్రామంలో 1963 జూన్ 2న జన్మించిన చంద్రశేఖరన్.. దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత కోయంబత్తూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీఐటీ) నుంచి అప్లైడ్ సైన్సె్‌సలో బ్యాచిలర్స్ డిగ్రీ, 1986లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి నుంచి కంప్యూటర్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. 1987లో టీసీఎస్‌లో చేరి 30 ఏళ్ల పాటు సేవలందించారు. గత 9 ఏళ్లుగా టాటా సన్స్ ప్రధాన కార్యాలయమైన బాంబే హౌస్ నుంచి గ్రూప్‌నకు నాయకత్వం వహిస్తున్నారు.

నోయల్ టాటా గద్దెనెక్కాకే లుకలుకలు..
రతన్ టాటా మరణాంతరం 2024లో టాటా ట్రస్టుల చైర్మన్‌గా నోయల్ టాటా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నుంచే టాటా ట్రస్ట్ బోర్డు సభ్యుల మధ్య అంతర్గత విబేధాలు మొదలయ్యాయి. అలాగే, ఎయిరిండియా, టాటా డిజిటల్ వంటి గ్రూప్ కొత్త కంపెనీల భారీ నష్టాలపై నోయల్ టాటా ఆందోళన వ్యక్తం చేయడం, టాటా సన్స్ లిస్టింగ్‌కూ ఆయన విముఖంగా ఉండటం, చంద్రశేఖరన్‌ను మూడో టర్మ్ చైర్మన్‌గా నియమించాలన్న ప్రతిపాదనకు మద్దతు తెలపకపోవడం వంటి అంశాలు టాటా ట్రస్ట్‌లు, టాటా సన్స్ బోర్డుల మధ్య అంతరాన్ని పెంచాయి. మూడోసారి చైర్మన్‌గా నియమించే ముందు చంద్ర నుంచి నోయల్ కొన్ని హామీలను కోరినట్లు తెలిసింది. గ్రూప్ ఐదేళ్ల వ్యాపార ప్రణాళికలపై మరింత స్పష్టత, కొత్త వ్యాపారాల నష్టాల కట్టడి, టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయకుండానే కంపెనీలో 18 శాతం వాటా కలిగిన షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌నకు ఎగ్జిట్ కల్పించడం అందులో ముఖ్యమైనవి. అయితే, ఎయిరిండియాతో పాటు టాటా డిజిటల్, టాటా ఎలకా్ట్రనిక్స్ ఆర్థిక పనితీరు, వాటి భవిష్యత్ పెట్టుబడి అవసరాలపై ఈ మే నెలలోనే సమగ్ర సమీక్ష జరిగింది.
ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్, టాటా ఎలకా్ట్రనిక్స్ సారథి రణధీర్ ఠాకూర్, టాటా డిజిటల్ చీఫ్ సాజిత్ శివనందన్ కంపెనీల పనితీరుపై నోయల్ టాటా సహా ఇతర బోర్డు సభ్యులకు ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ విషయంలో నోయల్ కాస్త మెత్తబడినప్పటికీ, టాటా సన్స్ లిస్టింగ్‌కు ససేమిరా అంటున్నారు. అయితే, టాటా సన్స్‌ను ఎప్పటికీ లిస్ట్ చేయబోమని హామీ ఇచ్చేందుకు చంద్ర సుముఖంగా లేరని తెలిసింది. పైగా, ఆరు నెలలైనా తన పునర్నియామకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ఆయన తప్పుకుంటున్నట్లు సమాచారం. ఈ వారంలోనే టాటా ట్రస్ట్ బోర్డు సభ్యత్వం నుంచి రక్షణ శాఖ మాజీ కార్యదర్శి విజయ్ సింగ్, అంతక్రితం మెహుల్ మిస్త్రీ తప్పుకున్నారు. వీరిద్దరు కూడా రతన్ టాటాకు సన్నిహితులుగా పేరుంది.
సరికొత్త శిఖరాలకు గ్రూప్ పనితీరు
చంద్ర నాయకత్వంలో టాటా గ్రూప్‌నకు చెందిన 26 లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 3.3 రెట్లు పెరిగి 9.3 లక్షల కోట్ల నుంచి రూ.24.4 లక్షల కోట్లకు చేరుకుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.6.72 లక్షల కోట్లుగా నమోదైన గ్రూప్ ఆదాయం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.16.2 లక్షల కోట్లకు చేరుకుంది. గ్రూప్ నికర లాభం 5 రెట్లకు పైగా ఎగబాకి రూ.1.71 లక్షల కోట్లకు చేరింది. 2025-26లో టాటా సన్స్ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 9 శాతం వృద్ధితో రూ.42,367 కోట్లకు చేరగా.. నికర ఆదాయం 22 శాతం పెరిగి రూ.31,961 కోట్లుగా నమోదైంది.
పద్మ భూషణుడు
2022లో భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ అందుకున్నారు.
యూకే-భారత మధ్య వ్యాపార సంబంధాలను పెంచేందుకు తనవంతు కృషి చేసినందుకుగాను 2024లో బ్రిటన్ ప్రభుత్వం ‘హానరరీ నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (కేబీఈ) అవార్డుతో సత్కరించింది.
2023లో ఫ్రాన్స్‌కు చెందిన అత్యున్నత పౌర పురస్కారం ‘చెవాలియర్ డె లా లెజియన్ డేహానర్’ లభించింది.
ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News