పండగకు మిఠాయి ప్రియం
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:36 AM
దసరా, దీపావళికి స్వీట్లు కొని బంధుమిత్రులకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. పంచదార, బెల్లం, పాల ధరల దూకుడుతో మిఠాయిల ధరలు భారీగా పెరిగిపోయాయి
30శాతం వరకు పెరిగిన స్వీట్ల ధరలు , చుక్కలనంటిన చక్కెర ధరలే కారణం
న్యూఢిల్లీ: దసరా, దీపావళికి స్వీట్లు కొని బంధుమిత్రులకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. పంచదార, బెల్లం, పాల ధరల దూకుడుతో మిఠాయిల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ పెరుగుదల ఎంత లేదన్నా 30 శాతం వరకు ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రెండు నెలల క్రితం వరకు కిలో రూ.550-రూ.560 మధ్య పలికిన ధూద్ పేడా ధర ప్రస్తుతం రూ.750-రూ.780 మధ్యన పలుకుతోంది. స్వీట్ల తయారీలో చక్కెర, బెల్లం, పాలు ప్రధాన ముడి పదార్ధాలు. ఇటీవల ఈ మూడింటి ధర చుక్కలనంటాయి. రెండు మూడు నెలల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో కేజీ చక్కెర ధర రూ.40 నుంచి రూ.45 మధ్యన ఉండేది. ఇప్పుడది రూ.65 నుంచి రూ.70 మధ్య పలుకుతోంది.
కిలో మంచి బెల్లం ధర రెండు మూడు నెలల క్రితం రూ.70 నుంచి రూ.80 మధ్యన ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.90-100 మధ్య ఉంది. పాల ధర గత నాలుగు నెలల్లో 16 శాతం వరకు పెరిగిందని స్వీటు షాపుల యజమానులు చెబుతున్నారు. పెరిగిన ఈ భారం తట్టుకోవాలంటే తామూ 30 శాతం వరకు ధరలు పెంచక తప్పలేదని చెప్పారు. మరోవైపు ఆశించిన స్థాయిలో రుతుపవనాలు లేకపోవటం, ఎల్‌నినో పరిస్థితులు తీవ్రమవుతుండటంతో మున్ముందు మిఠాయిల ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని వారంటున్నారు.

త్వరలో బిస్కట్లు, కూల్‌డ్రింక్స్ సైతం
చక్కెర ధర ప్రభావం బిస్కెట్లు, కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీలపైనా పడింది. దీంతో బిస్కెట్ల కంపెనీలు కూడా ధరలు 2 నుంచి 4 శాతం పెంచడం లేదా ప్యాకేజీ పరిమాణం తగ్గించడం చేయవచ్చని భావిస్తున్నారు. కూల్ డ్రింక్స్ కంపెనీలు మాత్రం చలికాలం ధరలు పెంచితే అమ్మకాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భావిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద పెరిగిన చక్కెర, బెల్లం, పాల ధరలతో ఈ పండగ సీజన్‌లో స్వీట్ల ధర మరింత చేదెక్కనుంది.
ఇవి కూడా చదవండి
తెలంగాణలో మరోసారి 'సర్' గడువు పొడిగింపు
శాసనసభ కాదు.. దుశ్శాసనసభ. రేవంత్ సర్కారుపై కేటీఆర్ ధ్వజం!