Share News

ఉద్రిక్తతల మధ్య ఊరట

ABN , Publish Date - Mar 25 , 2026 | 05:58 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇరాన్‌ పవర్‌ ప్లాంట్లు, ఇంధన మౌలిక వసతులపైౖ దాడులకు 5 రోజుల విరామం ప్రకటించడంతో...

ఉద్రిక్తతల మధ్య ఊరట

ఇరాన్‌ ఇంధన కేంద్రాలపై దాడులకు 5 రోజుల విరామం ప్రకటించిన ట్రంప్‌

  • భారీగా లాభపడిన స్టాక్‌ మార్కెట్‌

  • సెన్సెక్స్‌ 1,372 పాయింట్ల పెరుగుదల

  • ఇంట్రాడేలో 23,000 ఎగువకు నిఫ్టీ

  • రూ.7.57 లక్షల కోట్ల సంపద వృద్ధి

ముంబై: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇరాన్‌ పవర్‌ ప్లాంట్లు, ఇంధన మౌలిక వసతులపైౖ దాడులకు 5 రోజుల విరామం ప్రకటించడంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా భారత ప్రామాణిక ఈక్విటీ సూచీలూ మంగళవారం ర్యాలీ తీశాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 1,793 పాయింట్లు ఎగబాకింది. చివరికి సూచీ 1,372.06 పాయింట్ల (1.89 శాతం) లాభంతో 74,068.45 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 23,000 స్థాయిని దాటిన నిఫ్టీ.. 399.75 పాయింట్ల (1.78 శాతం) లాభంతో 22,912.40 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్‌ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ ఒక్క రోజులో రూ.7.57 లక్షల కోట్లు పెరిగి రూ.422.78 లక్షల కోట్లకు (4.50 లక్షల కోట్ల డాలర్లు) చేరింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌ మినహా అన్నీ రాణించాయి.

  • విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) అమ్మకాలు మాత్రం కొనసాగాయి. మరో రూ.8,009.56 కోట్ల నికర విక్రయాలు జరిపారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) మాత్రం నికరంగా రూ.5,867.15 కోట్ల కొనుగోళ్లు జరిపారు.

స్వల్పంగా పెరిగిన బంగారం

పసిడి ధర స్వల్పంగా పెరిగింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం రేటు రూ.1,200 పెరిగి రూ.1.44 లక్షలకు చేరుకోగా.. కిలో వెండి మాత్రం ఏ మార్పు లేకుండా రూ.2.30 లక్షలు పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ఒక దశలో 4,423 డాలర్లు, సిల్వర్‌ 69.86 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.


2 లిస్టింగ్‌లు.. ఫర్వాలేదు

జీఎ్‌సపీ కార్ప్‌ సైన్స్‌ లిమిటెడ్‌ తన షేర్లను మంగళవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసింది. ఐపీఓ ధర రూ.320తో పోలిస్తే, బీఎ్‌సఈలో కంపెనీ షేరు 3.84 శాతం లాభంతో రూ.332.30 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. తొలిరోజు ట్రేడింగ్‌ ముగిసేసరికి 11.28 శాతం వృద్ధితో రూ.356.10 వద్ద స్థిరపడింది. రాజ్‌మార్గ్‌ ఇన్‌ఫ్రా ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్‌ కూడా తన యూనిట్లను స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్ట్‌ చేసింది. ఇష్యూ ధర రూ.100తో పోలిస్తే, బీఎ్‌సఈలో కంపెనీ యూనిట్లు 8 శాతం ప్రీమియంతో రూ.108 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలిరోజు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 6.83 శాతం లాభంతో రూ.106.83 వద్ద ముగిశాయి.

సరికొత్త కనిష్ఠానికి రూపాయి

భారత కరెన్సీ విలువ సరికొత్త రికార్డు కనిష్ఠానికి జారుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు క్షీణించి రూ.93.76 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్‌ బలపడటంతో పాటు గరిష్ఠ స్థాయిలో కదలాడుతున్న ముడి చమురు ధరలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణ రూపాయిపై ఒత్తిడి పెంచాయని ఫారెక్స్‌ వర్గాలు తెలిపాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ పీపా ధర ఒక దశలో 1.45 శాతం తగ్గి 101.4 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.

ఇవీ చదవండి:

యుద్ధంతో ఇంధన సంక్షోభం, భారత్‌పైనా ఆ ప్రబావం ఉంది: మోదీ

క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Updated Date - Mar 25 , 2026 | 05:58 AM