ఆచితూచి అడుగేయండి..!
ABN , Publish Date - May 18 , 2026 | 03:20 AM
భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉంది. మళ్లీ అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలవటం, ప్రపంచ చమురు, ఆర్థిక సంక్షోభాల భయాలు మార్కెట్లను...
భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉంది. మళ్లీ అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలవటం, ప్రపంచ చమురు, ఆర్థిక సంక్షోభాల భయాలు మార్కెట్లను వెన్నాడుతున్నాయి. జెరోమ్ పావెల్ తర్వాత ద్రవ్య విధానంలో అత్యంత కఠినంగా ఉండే కెవిన్ వార్ష్ యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తుండటం కూడా ప్రపంచ మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరించటం మంచిది. ప్రస్తుతం ఫార్మా, హెల్త్‌కేర్, ఆటో రంగాల షేర్లు మాత్రమే కాస్త మూమెంటమ్ ప్రదర్శిస్తున్నాయి.
స్టాక్ రికమండేషన్స్
కోల్ ఇండియా: జీవితకాల గరిష్ఠం తర్వాత 35 శాతం మేర పతనమైన ఈ కౌంటర్‌లో మంచి దిద్దుబాటు నమోదైంది. ఫిబ్రవరి నుంచి 22 శాతం మేర రాబడిని అందించాయి. కోల్ గ్యాసిఫికేషన్ నేపథ్యంలో ఈ షేరుపై ఆసక్తి పెరిగింది. గత శుక్రవారం రూ.462 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.460 శ్రేణిలో ఎంటరై రూ.510 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.450 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
బజాజ్ ఫైనాన్స్: జీవితకాల గరిష్ఠం తర్వాత ఈ షేరులో 30 శాతం దిద్దుబాటు జరిగింది. కీలకమైన రూ.780 స్థాయి వద్ద మద్దతు తీసుకుని మళ్లీ అప్‌ట్రెండ్ బాట పట్టాయి. నిఫ్టీతో పోల్చితే మెరుగ్గా కనిపిస్తోంది. నెలరోజుల్లోనే 18 శాతం రాబడిని అందించింది. మార్కెట్ ఒడుదొడుకుల నేపథ్యంలో గత వారం ఆటుపోట్లకు లోనైంది. గత శుక్రవారం రూ.910 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.900 శ్రేణిలో ప్రవేశించి రూ.990 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.885 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
గుజరాత్ గ్యాస్: కొన్నేళ్లుగా డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ షేరు మళ్లీ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. స్వల్పకాల మూవింగ్ యావరేజెస్ పైనే షేరు కదలాడుతోంది. త్వరలో ఆర్థిక ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ కౌంటర్‌పై ఆసక్తి నెలకొంది. గత శుక్రవారం రూ.369 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.360 శ్రేణిలో ప్రవేశించి రూ.430 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.350 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
పవర్‌గ్రిడ్: జీవిత కాల గరిష్ఠం నుంచి 30 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ షేరు కీలకమైన రూ.250 మద్దతు స్థాయి నుంచి మళ్లీ పుంజుకున్నాయి. గత వారం కొంత కరెక్షన్‌కు లోనైనా 200 రోజుల మూవింగ్ యావరేజీ వద్ద మద్దతు దొరికే అవకాశం ఉంది. గత శుక్రవారం రూ.305 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మూమెంటమ్ ఇన్వెస్టర్లు రూ.300 శ్రేణిలో ప్రవేశించి రూ.335 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చ. అయితే రూ.296 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
టైటాన్: రెండేళ్ల (2024) నుంచి ఆటుపోట్లకు లోనైన ఈ షేరులో ఆరోగ్యకరమైన కరెక్షన్ నమోదైంది. సుదీర్ఘ బేస్‌ను బ్రేకౌట్ చేసిన తర్వాత మూమెంటమ్ ప్రదర్శిస్తున్నాయి. ప్రస్తుతం బంగారం, వెండిపై ఆంక్షలతో ఈ కౌంటర్‌పై ఆసక్తి పెరిగింది. గత శుక్రవారం రూ.4,169 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.4,100 శ్రేణిలో ప్రవేశించి రూ.4,600 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.4,050 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఈ వార్తలనూ చదవండి:
ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్ కంపెనీగా టీసీఎస్
బంగారంలో పెట్టుబడులకు గోల్డ్ ఈటీఎఫ్, ఈజీఆర్‌లు