Share News

యుద్ధానికి బ్రేక్‌.. మార్కెట్‌కు జోష్‌

ABN , Publish Date - Apr 09 , 2026 | 04:16 AM

పశ్చిమాసియాలో యుద్ధ సైరన్‌ ఆగింది.. దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ బాజా మోగింది. యుద్ధాన్ని రెండు వారాలపాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా-ఇరాన్‌ ప్రకటించడం, దీంతో ముడి చమురు ధర భారీగా తగ్గడంతో...

యుద్ధానికి బ్రేక్‌..  మార్కెట్‌కు జోష్‌

సెన్సెక్స్‌ 2,946 పాయింట్లు అప్‌

ఒకదశలో 24,000 స్థాయికినిఫ్టీ

గత 11 నెలల్లో ఇదే అతిపెద్ద ర్యాలీ

రూ.16.25 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద

ముంబై: పశ్చిమాసియాలో యుద్ధ సైరన్‌ ఆగింది.. దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ బాజా మోగింది. యుద్ధాన్ని రెండు వారాలపాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా-ఇరాన్‌ ప్రకటించడం, దీంతో ముడి చమురు ధర భారీగా తగ్గడంతో భారత్‌ సహా ప్రపంచ స్టాక్‌ మార్కెట్‌ వర్గాల్లో ఉత్సాహం ఉరకలేసింది. ద్రవ్యోల్బణం మళ్లీ పెరగవచ్చన్న ఆందోళనల నేపథ్యంలోనూ ఆర్‌బీఐ రెపో రేటును పెంచకపోవడం, రూపాయి బలోపేతం వంటి అంశాలు మన మార్కెట్లో ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ను మరింత మెరుగుపరిచింది. ఇన్వెస్టర్లు ఇంధనం, విమానయానం, బ్యాంకింగ్‌ సహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లను పోటెత్తించడంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు రివ్వున ఎగిశాయి.

బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒక దశలో 3,018.96 పాయింట్లు (4 శాతం) పెరిగి 77,635.54 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 2,946.32 పాయింట్ల (3.95 శాతం) వృద్ధితో 77,562.90 వద్ద స్థిరపడింది. సూచీ లాభపడటం వరుసగా ఇది ఐదో రోజు. ఒక దశలో 900 పాయింట్లకు పైగా పెరిగి 24,000 స్థాయిని తాకిన నిఫ్టీ.. చివరకు 873.70 పాయింట్ల (3.78 శాతం) లాభంతో 23,997.35 వద్ద ముగిసింది. గత 11 నెలల్లో సూచీలకు ఇదే అతిపెద్ద ఒక్కరోజు లాభం. ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ ఒక్క రోజులో రూ.16.25 లక్షల కోట్లు పెరిగి రూ.445.51 లక్షల కోట్లకు (4.81 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది.


  • సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 27 రాణించాయి. దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌ ఇండిగో షేరు 8.16 శాతం ఎగిసి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. పశ్చిమాసియాలో భారీ విలువైన ప్రాజెక్టులను చేపడుతున్న ఎల్‌ అండ్‌ టీ స్టాక్‌ 7.64 శాతం పుంజుకుంది. టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌ నష్టపోయాయి.

  • బీఎ్‌సఈలోని మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ ఇండెక్స్‌ 4.93 శాతం, స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీ 4.01 శాతం బలపడ్డాయి. రంగాలవారీ సూచీలన్నీ లాభపడ్డాయి. రియల్టీ అత్యధికంగా 6.76 శాతం వృద్ధి చెందగా.. ఆటో 6.55 శాతం పెరిగింది. పీఎస్‌యూ బ్యాంక్‌, బ్యాంకెక్స్‌, ప్రైవేట్‌ బ్యాంక్స్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సూచీలు 5.79 శాతం వరకు పెరిగాయి.

  • మార్కెట్‌ ర్యాలీలోనూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) అమ్మకాలు కొనసాగాయి. వారు మరో రూ.2,811.97 కోట్ల నికర విక్రయాలు జరపగా.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) మాత్రం రూ.4,168.17 కోట్ల నికర కొనుగోళ్లు చేపట్టారు.

గోల్డ్‌, సిల్వర్‌ హైజంప్‌

విలువైన లోహాల ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర రూ.3,200 పెరిగి రూ.1,56,400కు చేరుకుంది. కిలో వెండి రూ.11,000 ఎగబాకి రూ.2.51 లక్షలు పలికింది. పశ్చిమాసియా యుద్ధానికి తాత్కాలిక విరామం నేపథ్యంలో అంతర్జాతీయ విపణిలో వీటి ధరలు గణనీయంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఒక దశలో 2 శాతానికి పైగా పెరిగి 4,800 డాలర్ల ఎగువ స్థాయిలో ట్రేడవగా.. సిల్వర్‌ 77 డాలర్ల పైకి చేరుకుంది.

99-Business.jpg

రూపాయి నవ్వింది..

పశ్చిమాసియాలో యుద్ధం, ముడి చమురు సెగల ప్రభావంతో గడిచిన కొన్ని వారాల్లో భారీగా క్షీణిస్తూ వచ్చిన భారత కరెన్సీ విలువ.. మళ్లీ కాస్త పుంజుకుంది. ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక్క రోజే 52 పైసలు పెరిగి రూ.92.54 వద్ద ముగిసింది. రెండు వారాల యుద్ధ విరమణ, క్రూడ్‌ ధరలు భారీగా తగ్గడం, ఆర్‌బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించడం, ఈక్విటీ మార్కెట్లో భారీ లాభాలు ఇందుకు దోహదపడ్డాయి. మున్ముందు సెషన్లలో రూపాయి మరింత బలపడే అవకాశాలున్నాయని ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి..

ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..

ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..

Updated Date - Apr 09 , 2026 | 04:16 AM