చమురు చల్లారే.. బుల్ చెలరేగే
ABN , Publish Date - May 07 , 2026 | 06:26 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు బుధవారం భారీగా లాభపడ్డాయి. ఇరాన్‌తో శాంతి చర్చలు త్వరలోనే కొలిక్కి రానున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం,...
సెన్సెక్స్ 940 పాయింట్లు అప్
24,300 ఎగువ స్థాయికి నిఫ్టీ
రూ.6 లక్షల కోట్ల సంపద వృద్ధి
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు బుధవారం భారీగా లాభపడ్డాయి. ఇరాన్‌తో శాంతి చర్చలు త్వరలోనే కొలిక్కి రానున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, దాంతో ముడిచమురు ధర 100 డాలర్ల దిగువకు జారడం ఇందుకు దోహదపడింది. అంతర్జాతీయ మార్కెట్ల ర్యాలీ, రూపాయి బలోపేతం కూడా కలిసివచ్చింది. సెన్సెక్స్ ఒక దశలో 1,005 పాయింట్ల వరకు ఎగబాకి 78,000 మైలురాయిని తాకింది. చివరికి సూచీ 940.73 పాయింట్ల (1.22 శాతం) లాభంతో 77,958.52 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 298.15 పాయింట్ల (1.24 శాతం) వృద్ధితో 24,330.95 వద్ద ముగిసింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.5.99 లక్షల కోట్లు పెరిగి రూ.472.80 లక్షల కోట్లకు (4.97 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది.
రూపీ 69 పైసలు జంప్
ఆల్‌టైం కనిష్ఠ స్థాయికి జారుకున్న భారత కరెన్సీ విలువ బుధవారం గణనీయంగా పెరిగింది. డాలర్‌తో రూపాయి మారకం రేటు 69 పైసల లాభంతో రూ.94.49 వద్ద ముగిసింది. చమురు చల్లారడం ఇందుకు తోడ్పడిందని ఫారెక్స్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ పీపా ధర ఒకదశలో 10.5 శాతం తగ్గి 98 డాలర్లకు దిగివచ్చింది. కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో రూపాయిపై ఒత్తిడి కొనసాగనుందని, ఈ ఏడాది చివరి నాటికి డాలర్-రూపీ ఎక్స్ఛేంజ్ రేటు రూ.95 స్థాయిలోనే కదలాడవచ్చని బీఎంఐ రిపోర్టు పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
ట్రంప్ వల్లే నా సంసార జీవితంలో ఇబ్బందులు: బరాక్ ఒబామా