Share News

క్రూడ్‌ చల్లారే.. బుల్‌ చెలరేగే

ABN , Publish Date - Mar 11 , 2026 | 06:15 AM

ఇరాన్‌తో యుద్ధం త్వరలోనే ముగియనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ముడి చమురు మళ్లీ 90 డాలర్ల స్థాయికి దిగొచ్చింది. క్రూడ్‌ ధరల సెగ తగ్గడంతో...

క్రూడ్‌ చల్లారే..  బుల్‌ చెలరేగే

సెన్సెక్స్‌ 640 పాయింట్లు అప్‌

24,250 ఎగువ స్థాయికి నిఫ్టీ

  • రూ.6 లక్షల కోట్ల సంపద వృద్ధి

  • కాస్త పుంజుకున్న రూపాయి

ముంబై: ఇరాన్‌తో యుద్ధం త్వరలోనే ముగియనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ముడి చమురు మళ్లీ 90 డాలర్ల స్థాయికి దిగొచ్చింది. క్రూడ్‌ ధరల సెగ తగ్గడంతో భారత్‌ సహా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లకు ఊరట లభించింది. మదుపరులు కొనుగోళ్లు పెంచడంతో ప్రామాణిక సూచీలు భారీ గా ఎగబాకాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మంగళవారం ఒక దశలో 960.09 పాయింట్లు పెరిగి 78,526.25 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 639.82 పాయింట్ల (0.82 శాతం) లాభంతో 78,205.98 వద్ద ముగిసింది. నిఫ్టీ 233.55 పాయింట్ల (0.97 శాతం) వృద్ధితో 24,261.60 వద్ద క్లోజైంది. ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులో రూ.5.94 లక్షల కోట్లు పెరిగి రూ.447.04 లక్షల కోట్లకు (4.86 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 24 రాణించాయి. ఇండిగో షేరు 3.46 శాతం వృద్ధితో సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఎం అండ్‌ ఎం షేరు 3.30 శాతం పెరిగింది. ఎటర్నల్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మాత్రం ఒక శాతానికి పైగా నష్టపోయాయి.

  • భారత కరెన్సీ కాస్త పుంజుకుంది. ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 36 పైసలు పెరిగి రూ.91.85 వద్ద ముగిసింది. ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడం ఇందుకు దోహదపడింది.

ఎల్‌ఐసీ ఈక్విటీ పెట్టుబడుల విలువ రూ.70,000 కోట్లు తగ్గే..

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల విలువ ఏకంగా రూ.70,105 కోట్లు తగ్గింది. ఏస్‌ ఈక్విటీ డేటా ప్రకారం.. యుద్ధం ప్రారంభానికి ముందు రోజు (ఫిబ్రవరి 27) ఎల్‌ఐసీ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో మొత్తం విలువ రూ.14.88 లక్షల కోట్లుగా ఉండగా.. ఈ నెల 9 నాటికి రూ.14.17 లక్షల కోట్లకు తగ్గింది. ఎల్‌ఐసీ పెట్టుబడులు కలిగిన బ్యాంకింగ్‌ రంగ స్టాక్స్‌తో పాటు ఎల్‌ అండ్‌ టీ షేరు భారీగా నష్టపోవడం ఇందుకు ప్రధాన కారణం. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎల్‌ఐసీ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో విలువ రూ.1.08 లక్షల కోట్ల (7.1 శాతం) మేర తగ్గింది.


సిల్వర్‌ రూ.11 వేలు పెరిగే..

వరుసగా మూడు రోజులు తగ్గుతూ వచ్చిన విలువైన లోహాల ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి మంగళవారం రూ.10,975 (4.09 శాతం) పెరిగి రూ.2,79,275 పలికింది. అలాగే, 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల రేటు రూ.400 పెరుగుదలతో రూ.1,64,700కు చేరుకుంది. క్రూడ్‌ ధరలు తగ్గి డాలర్‌ కాస్త బలహీనపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండికి మళ్లీ డిమాండ్‌ పెరగడం ఇందుకు కారణమైంది. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) సిల్వర్‌ 1.6 శాతం పెరిగి 88.33 డాలర్లు, గోల్డ్‌ దాదాపు ఒక శాతం పెరుగుదలతో 5,172 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి.

ఇవి కూడా చదవండి..

నష్టాల నుంచి ఉపశమనం.. కోలుకుంటున్న దేశీయ సూచీలు..

ఇరాన్ యుద్ధం.. పెట్రోల్, గ్యాస్, ఎరువుల నిల్వలు సరిపోతాయా..

Updated Date - Mar 11 , 2026 | 06:15 AM