మార్కెట్‌కు చమురు పోటు
ABN , Publish Date - Apr 29 , 2026 | 05:38 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు మళ్లీ నష్టపోయాయి. సెన్సెక్స్ 77,000, నిఫ్టీ 24,000 స్థాయిలను చేజార్చుకున్నాయి. ముడిచమురు ధరలు 110 డాలర్ల పైకి ఎగబాకడం...
సెన్సెక్స్ 416 పాయింట్లు డౌన్
మళ్లీ 24,000 దిగువకు నిఫ్టీ
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు మళ్లీ నష్టపోయాయి. సెన్సెక్స్ 77,000, నిఫ్టీ 24,000 స్థాయిలను చేజార్చుకున్నాయి. ముడిచమురు ధరలు 110 డాలర్ల పైకి ఎగబాకడం, విదేశీ సంస్థాగత పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణ, అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో అనిశ్చితి మదుపరుల సెంటిమెంట్‌ను కుంగదీశాయి. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, వాహన రంగ షేర్లలో అమ్మకాలు పెంచడంతో సూచీలు నేలచూపులు చూడాల్సి వచ్చింది. మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 562.57 పాయింట్లు పతనమై 76,741.91 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 416.72 పాయింట్ల నష్టం తో 76,886.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 97 పాయింట్లు కోల్పోయి 23,995.70 వద్ద ముగిసింది. దాంతో ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.98,000 కోట్లు తగ్గి రూ.466.93 లక్షల కోట్లకు (4.94 లక్షల కోట్ల డాలర్లు) జారుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు పీపా ధర ఒక దశలో 2.97 శాతం పెరిగి 111.4 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.
బ్యాంకింగ్ షేర్లు విలవిల
మొండి బకాయిలకు సంబంధించి ఆర్‌బీఐ నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో ఇకపై బ్యాంకులు వీటి కోసం అధిక కేటాయింపులు చేప ట్టాల్సి ఉంటుంది. ఇది బ్యాంకుల మార్జిన్లకు గండికొట్టవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ రంగ షేర్లలో అమ్మకాలు పెంచారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లపై ఇది అధిక ప్రభావం చూపింది. బీఎ్‌సఈలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.07 శాతం నష్టపోగా.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్‌బీ స్టాక్స్ 2 శాతానికి పైగా క్షీణించాయి. ఇండియన్ బ్యాంక్, ఎస్‌బీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ షేర్లు ఒక శాతానికి పైగా నష్టపోయాయి.
ఇవి కూడా చదవండి..
గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..