వార్ - వర్రీస్ మదుపరి బెదిరెన్
ABN , Publish Date - May 12 , 2026 | 03:14 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు సోమవారం భారీగా నష్టపోయాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పంద ప్రయత్నాలు మరోమారు విఫలమవడంతో ముడి చమురు ధర...
సెన్సెక్స్ 1,313 పాయింట్లు పతనం జూమళ్లీ 24,000 దిగువకి నిఫ్టీ
రూ.6.16 లక్షల కోట్ల సంపద ఆవిరి
మార్కెట్‌కు రుచించని ప్రధాని పొదుపు మంత్రం
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు సోమవారం భారీగా నష్టపోయాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పంద ప్రయత్నాలు మరోమారు విఫలమవడంతో ముడి చమురు ధర ఒకదశలో 105 డాలర్లకు ఎగబాకడం ఇందుకు ప్రధాన కారణం. అలాగే, ఈ యుద్ధ సంక్షోభ కాలంలో విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలను కాపాడుకునేందుకు ఏడాది వరకు బంగారం కొనుగోలు చేయవద్దని, పెట్రోల్, డీజిల్, వంటనూనెల వినియోగాన్ని వీలైనంత తగ్గించాలని, విదేశీ పర్యటనలను మానుకోవాలని, ఉద్యోగులు వీలైతే ఇంటి నుంచే పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దాంతో మార్కెట్ మదుపరుల్లో దేశ ఆర్థిక పరిస్థితిపై కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ఇది ట్రేడింగ్ సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచింది. ఒకదశలో 76,000 స్థాయిని కూడా కోల్పోయిన సెన్సెక్స్.. చివరికి 1,312.91 పాయింట్ల్ల(1.70 శాతం) నష్టంతో 76,015.28 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 360.30 పాయింట్లు (1.49 శాతం) క్షీణించి 23,815.85 వద్దకు జారుకుంది. దాంతో బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.6.16 లక్షల కోట్లు తగ్గి రూ.467.30 లక్షల కోట్లకు (4.91 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. కాగా, సూచీలు నష్టపోవడం వరుసగా ఇది మూడో రోజు.
బీఎ్‌సఈలో ఫోకస్డ్ ఐటీ ఇండెక్స్ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టులు
బీఎ్‌సఈ తన ఫోకస్డ్ ఐటీ సూచీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ (ఎ్‌ఫ అండ్ ఓ) కాంట్రాక్టులను సోమవారం ప్రారంభించింది. దేశంలో ఐటీ రంగ ప్రామాణిక సూచీపై ఆఫర్ చేస్తున్న ఏకైక డెరివేటివ్ కాంట్రాక్టులను ఆఫర్ చేస్తున్న ఏకైక ఎక్స్ఛేంజ్ బీఎ్‌సఈనే. దేశంలోని 14 అగ్రగామి ఐటీ కంపెనీలు ఈ సూచీలో భాగంగా ఉన్నాయి.
పర్యాటకం, ఆతిథ్యం, ఎయిర్‌లైన్ షేర్లూ డౌన్ : విదేశీ పర్యటనలను మానుకోవాలని, డెస్టినేషన్ వెడ్డింగ్‌లు వద్దని సైతం ప్రధాని పిలువునివ్వడంతో పర్యాటకం, ఆతిథ్య రంగంతో పాటు ఎయిర్‌లైన్ షేర్లూ నష్టాలు చవిచూశాయి. థామస్ కుక్ ఇండియా షేరు 3.88 శాతం, యాత్రా ఆన్‌లైన్ 5.41 శాతం, ఈజీ ట్రిప్ ప్లానర్స్ షేరు 3.27 శాతం, ఇక్సిగో పోర్టల్ ఆపరేటర్ లే ట్రావెన్యూస్ టెక్నాలజీ స్టాక్ 2.94 శాతం నష్టపోయాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ షేరు 4.94 శాతం, స్పైస్‌జెట్ 4.72 శాతం తగ్గాయి. ఇక ఐటీసీ హోటల్స్ 3.19 శాతం, తాజ్ హోటళ్ల నిర్వహణ సంస్థ ఐహెచ్‌సీఎల్ 1.83 శాతం, లెమన్ ట్రీ హోటల్స్ 3.28 శాతం నష్టపోయాయి.
ఈవీ స్టాక్స్ రయ్ రయ్..
పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని, విద్యుత్ వాహనాలను ఎంచుకోవాలని ప్రధాని కోరిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) కంపెనీల షేర్లు దూసుకెళ్లాయి. ఏథర్ ఎనర్జీ 6.02 శాతం, జేబీఎం ఆటో 4.75 శాతం, ఓలా ఎలక్ట్రిక్ 2.47 శాతం, ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్ 2.16 శాతం బలపడ్డాయి.
రూపీ క్రాష్
ఆల్‌టైం కనిష్ఠ స్థాయికి పతనం
ఒక్కరోజులో 79 పైసలు క్షీణత రూ.95.28 చేరిక
భారత కరెన్సీ మరింత బలహీనపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 79 పైసలు క్షీణించి సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయి రూ.95.28 వద్ద ముగిసింది. శాంతి ఒప్పందానికి సంబంధించి ఇరాన్ ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడం, తత్ఫలితంగా ముడి చమురు ధరలు మళ్లీ ఎగబాకడం ఇందుకు ప్రధాన కారణమయ్యాయి. మన ఈక్విటీ మార్కెట్లో నష్టాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, ప్రధాని పొదుపు మంత్రంతో దేశ ఆర్థిక పరిస్థితిపై పెరిగిన ఆందోళనలు కూడా రూపాయిపై ఒత్తిడి పెంచాయని ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం
అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత