Share News

రూ.6.31 లక్షల కోట్ల సంపద ఆవిరి

ABN , Publish Date - Jun 09 , 2026 | 02:52 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ సోమవారం భారీగా నష్టపోయింది. సెన్సెక్స్‌ ఒక దశలో 924.4 పాయింట్లు పతనమై 73,318.94 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి...

రూ.6.31 లక్షల కోట్ల సంపద ఆవిరి

  • సెన్సెక్స్‌ 719 పాయింట్లు పతనం

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ సోమవారం భారీగా నష్టపోయింది. సెన్సెక్స్‌ ఒక దశలో 924.4 పాయింట్లు పతనమై 73,318.94 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 719.08 పాయింట్ల నష్టంతో 73,524.26 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 243.70 పాయింట్లు కోల్పోయి 23,123 వద్ద ముగిసింది. ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.6.31 లక్షల కోట్ల మేర తగ్గి రూ.455.28 లక్షల కోట్లకు (4.76 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాటు ముడిచమురు ధరలు మళ్లీ పెరిగిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తమై భారీగా అమ్మకాలకు పాల్పడటం ఇందుకు ప్రధాన కారణం. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న భయాలు, రూపాయి క్షీణత కూడా మన మార్కెట్‌పై ఒత్తిడి పెంచాయి.

  • ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 43 పైసలు పతనమై రూ.95.61 వద్ద ముగిసింది. ముడి చమురు ధరల పెరుగుదల, డాలర్‌ బలోపేతం ఇందుకు ప్రధాన కారణమయ్యాయి.

  • అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడి చమురు బ్యారల్‌ ధర ఒక దశలో 3.94 శాతం పెరిగి 96.76 డాలర్లకు ఎగబాకింది.

  • ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌ (గతంలో నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌)లో 3 శాతం వరకు వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించనున్నట్లు కేంద్రం సోమవారం ప్రకటించింది. షేరు కనీస ధరను రూ.303గా నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి..

భారత్ వద్ద 190 అణ్వాయుధాలు.. పాకిస్థాన్ దగ్గర ఎన్ని ఉన్నాయంటే..

ఇరాన్‌ను తక్షణమే వీడండి.. భారతీయులకు సూచన.

Updated Date - Jun 09 , 2026 | 02:52 AM