Share News

మరణించిన ఇన్వెస్టర్ల వారసులకు సులభతర క్లెయిమ్‌ ప్రక్రియ

ABN , Publish Date - Mar 13 , 2026 | 02:36 AM

మదుపరి మరణాంతరం సెక్యూరిటీలను అతడు/ఆమె నామినీలు లేదా చట్టబద్ధ వారసులు క్లెయిమ్‌ చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంటేషన్‌ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని...

మరణించిన ఇన్వెస్టర్ల వారసులకు సులభతర క్లెయిమ్‌ ప్రక్రియ

ప్రతిపాదించిన సెబీ

న్యూఢిల్లీ: మదుపరి మరణాంతరం సెక్యూరిటీలను అతడు/ఆమె నామినీలు లేదా చట్టబద్ధ వారసులు క్లెయిమ్‌ చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంటేషన్‌ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ ప్రతిపాదించింది. అలాగే, సులభతర డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ కోసం ఆస్తుల బదిలీ విలువ పరిమితిని కూడా పెంచాలని సూచించింది. తక్కువ విలువైన క్లెయిమ్స్‌కు పేపర్‌ వర్క్‌ను తగ్గించడంతో పాటు సత్వర సెటిల్‌మెంట్‌ కోసం స్ర్టెయిట్‌ థ్రూ ప్రాసెసింగ్‌ (ఎ్‌సటీపీ) విధానాన్ని ప్రవేశపెట్టాలని గురువారం విడుదల చేసిన చర్చా పత్రంలో సెబీ ప్రతిపాదించింది. వీటిపై వచ్చే నెల 2లోగా అభిప్రాయాలు తెలుపాలని ప్రజలను కోరింది.

సెబీ ప్రతిపాదనలివీ..

  • ప్రస్తుతం మరణించిన ఇన్వెస్టర్‌కు చెందిన రూ.5 లక్షల విలువ చేసే భౌతిక సెక్యూరిటీలు, రూ.15 లక్షల విలువైన డీమ్యాట్‌ హోల్డింగ్స్‌ను సులభతర డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ ద్వారా నామినీలు లేదా వారసులకు బదిలీ చేసుకోవచ్చు. ఈ పరిమితులను రెట్టింపు చేయాలని సెబీ ప్రతిపాదించింది. అంటే, భౌతిక సెక్యూరిటీల విలువ రూ.10 లక్షలకు, డీమ్యాట్‌ సెక్యూరిటీల విలువ పరిమితి రూ.30 లక్షలకు పెరగనుంది.

  • రూ.10,000 వరకు విలువ చేసే భౌతిక సెక్యూరిటీలు, రూ.30,000 వరకు విలువ చేసే డీమ్యాట్‌ హోల్డింగ్స్‌ బదిలీకి ఎస్‌టీపీ విధానంలో అతి తక్కువ డాక్యుమెంటేషన్‌ ద్వారా క్లెయిమ్‌కు అనుమతించాలి.

  • క్లెయిమ్‌ ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించేందుకు సెబీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలు, రిజిస్ట్రార్స్‌, డిపాజిటరీలు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు సహా సంబంధిత సంస్థలన్నీ ఏకరీతి డాక్యుమెంటేషన్‌, క్లెయిమ్‌ పరిష్కార విధానాన్ని పాటించాలని కూడా సెబీ సూచించింది. అంతేకాదు, 21 దినాల్లో క్లెయిమ్‌ను పరిష్కరించాల్సి ఉంటుంది.


ఏయే పత్రాలు సమర్పించాలి..?

నామినేషన్‌ ఉంటే: బదిలీ అభ్యర్థన పత్రం, డీమ్యాట్‌ అకౌంట్‌ తాజా క్లయింట్‌ మాస్టర్‌ లిస్ట్‌ (సీఎంఎల్‌), ధృవీకరించదగిన డెత్‌ సర్టిఫికెట్‌, అధికారిక గుర్తింపు కార్డు.

నామినేషన్‌ లేని సందర్భంలో: దివంగత ఇన్వెస్టర్‌ నామినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయని పక్షంలో ఆస్తుల బదిలీ ప్రక్రియ సంక్లిష్టమవుతుంది. వివాదాలకు తావులేకుండా అసలైన వారసులకు ఆస్తుల బదిలీ జరిగేలా ఇంటర్మీడియేటరీ సంస్థలు జాగ్రత్త పడాలి. ఇందుకోసం సెబీ క్లెయిమ్‌ విలువ ఆధారంగా సమర్పించాల్సిన పత్రాలకు సంబంధించి రిస్క్‌ బేస్డ్‌ విధానాన్ని సెబీ ప్రతిపాదించింది.

ఎస్‌టీపీ క్లెయిమ్‌ కోసం: సంతకం చేసిన బదిలీ అభ్యర్థన పత్రం, డీమ్యాట్‌ క్లయింట్‌ మాస్టర్‌ లిస్ట్‌, ధృవీకరించదగిన డెత్‌ సర్టిఫికెట్‌, అధికారిక గుర్తింపు కార్డుతో పాటు అండర్‌టేకింగ్‌ కూడా సమర్పించాల్సి ఉంటుంది.

ఎస్‌టీపీ పరిమితికి మించిన క్లెయిమ్స్‌కు: ఎస్‌టీపీ పరిమితికి మించి విలువ చేసే ఆస్తుల బదిలీకి నోటరీ ఇండెమ్నిటీ బాండ్‌, ఇతర వారసుల నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) లేదా ఫ్యామిలీ సెటిల్‌మెంట్‌ డీడ్‌ను అదనంగా సమర్పించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు.. కూతురితో కలిసి వీక్షించిన కిమ్..

Updated Date - Mar 13 , 2026 | 02:36 AM