టెక్ వ్యూ 24,000 వద్ద బలహీనత
ABN , Publish Date - Jun 01 , 2026 | 02:25 AM
నిఫ్టీ గత వారం ఆరంభంలో ప్రధాన మద్దతు స్థాయిలైన 24,000 స్థాయిని తాకినప్పటికి అక్కడ నిలదొక్కుకోలేకపోయింది. చివరి మూడు ట్రేడింగ్ సెషన్లలో రియాక్షన్‌ను కనబరుస్తూ చివరకు...
నిఫ్టీ గత వారం ఆరంభంలో ప్రధాన మద్దతు స్థాయిలైన 24,000 స్థాయిని తాకినప్పటికి అక్కడ నిలదొక్కుకోలేకపోయింది. చివరి మూడు ట్రేడింగ్ సెషన్లలో రియాక్షన్‌ను కనబరుస్తూ చివరకు 177 పాయింట్ల నష్టంతో 23,550 పాయింట్ల వద్ద క్లోజైంది. శుక్రవారం గరిష్ఠ స్థాయిల వద్ద బలహీనతను సూచించింది. నిఫ్టీ మరోసారి 24,000 వద్ద నిలదొక్కుకోవటంలో విఫలమైంది. గడచిన ఎనిమిది వారాలుగా సూచీ ఈ స్థాయిల వద్ద గట్టి పరీక్షను ఎదుర్కొనటంతో పాటు కన్సాలిడేషన్‌ను చవిచూస్తోంది. ప్రస్తుతం 24,000 స్థాయి బలమైన స్వల్పకాల నిరోధ స్థాయిగా మారింది. అంతర్జాతీయ ట్రెండ్స్‌తో పాటు ప్రస్తుత 23,550 స్థాయిల వద్ద టెక్నికల్‌గా స్వల్ప రీబౌండ్‌కు అవకాశం ఉండటంతో సోమవారం మార్కెట్ అప్రమత్త ట్రెండ్‌తో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. టెక్నికల్‌గా చూస్తే గరిష్ఠ స్థాయిల వద్ద మార్కెట్ కొద్ది రోజులు నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ గత శుక్రవారం 835 పాయింట్ల బలమైన కరెక్షన్‌ను చవి చూడటంతో అప్‌ట్రెండ్‌కు స్వల్పకాలిక విరామం ఇచ్చినట్లు కనిపిస్తోంది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా బలమైన కరెక్షన్‌ను చవి చూసింది.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీ సానుకూలత కోసం ప్రస్తుత నిరోధ స్థాయిలైన 24,000 వద్ద నిలదొక్కుకోవాలి. మూడు వారాలుగా ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకోలేక విఫలమవుతూ వస్తోంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్ కోసం ఇక్కడ నిలదొక్కుకోవాల్సి ఉంటుంది.
బేరిష్ స్థాయిలు: ఒకవేళ బలహీతను కనబరిస్తే 23,450 వద్ద మైనర్ మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ నిలదొక్కుకోలేక పోతే బలహీనతను సూచిస్తుంది. తదుపరి ప్రధాన మద్దతు స్థాయి 23,250 దిగువన ఉంటాయి. తదుపరి మద్దతు స్థాయి 23,000. ఇది గతంలో ఏర్పడిన బాటమ్ స్థాయి. రక్షణ, సత్వర అప్‌ట్రెండ్ అవకాశం కోసం ఇక్కడ కచ్చితంగా నిలదొక్కుకోవాలి. ఇక్కడ మరింత బలహీనతను సూచిస్తే స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 183 పాయింట్ల (0.67 శాతం) స్వల్ప లాభంతో 54,240 వద్ద క్లోజైంది. పాజిటివ్ ట్రెండ్ కోసం మైనర్ నిరోధ స్థాయిలైన 54,800 ఎగువన నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. తదుపరి స్వల్పకాలిక నిరోధ స్థాయి 55,500. ఒకవేళ ఏదేనీ బలహీనతను సూచిస్తే ప్రస్తుత మద్దతు స్థాయిలైన 54,000 దిగువన నిలదొక్కుకోవాలి. బలహీనతను కనబరిస్తే 53,000 వద్ద మద్దతు స్థాయిలుంటాయి.
పాటర్న్: నిఫ్టీ గత వారం 50 రోజుల చలన సగటు దిగువకు చేరి అప్రమత్తతను సూచిస్తోంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్ కోసం కొద్ది రోజులు 24,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన నిరోధ ట్రెండ్‌లైన్’’ వద్ద నిలదొక్కుకోవాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్ రివర్సల్స్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 23,750, 23,900
మద్దతు : 23,450, 23,300
వి. సుందర్ రాజా
ఇవి కూడా చదవండి..
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి.. ఖండించిన ఖర్గే