Share News

3 రోజుల్లో రూ.9.18 లక్షల కోట్లు

ABN , Publish Date - Mar 19 , 2026 | 02:24 AM

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో భారత ఈక్విటీ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్‌ ఒకదశలో 929.38 పా యింట్లు ఎగబాకి 77,000కు చేరింది. చివరికి 633.29 పాయింట్ల లాభంతో...

3 రోజుల్లో రూ.9.18 లక్షల కోట్లు

  • స్టాక్‌ మార్కెట్‌ సంపదలో భారీ వృద్ధి

  • మరో 633 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో భారత ఈక్విటీ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్‌ ఒకదశలో 929.38 పా యింట్లు ఎగబాకి 77,000కు చేరింది. చివరికి 633.29 పాయింట్ల లాభంతో 76,704.13 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 196.65 పాయింట్ల వృద్ధితో 23,777.80 వద్ద ముగిసింది. ఐటీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనుగోళ్లు ఇందుకు ప్రధానంగా దోహదపడ్డాయి. బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.5.7 లక్షల కోట్లు పెరిగి రూ.439 లక్షల కోట్లకు (4.75 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. మూడు రోజుల మార్కెట్‌ ర్యాలీలో ఇన్వెస్టర్ల సంపద రూ.9.18 లక్షల కోట్లు పెరిగింది. మరిన్ని విషయాలు..

  • బీఎస్ఈ మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీ 2.39ు, స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌ ఇండెక్స్‌ 1.59ు వృద్ధి చెందాయి. రంగాలవారీ సూచీల్లో మెటల్‌ మినహా అన్నీ లాభపడ్డాయి.

  • మార్కెట్లు మళ్లీ లాభాల్లో పయనిస్తున్నప్పటికీ విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ మాత్రం నిరవధికంగా కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎ్‌ఫఐఐ) మరో రూ.2,714.35 కోట్ల నికర విక్రయాలు జరిపారు. కాగా, దేశీయ సంస్థలు (డీఐఐ) మరో రూ.3,253.03 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.

క్రూడ్‌ భగ్గు.. 108 డాలర్ల పైకి: ఇజ్రాయెల్‌ బుధవారం జరిపిన బాంబు దాడులతో ఇరాన్‌కు చెందిన సౌత్‌ పార్స్‌ సహజ వాయువు క్షేత్రం ధ్వంసమైంది. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని.. ఖతార్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని గ్యాస్‌, ఆయిల్‌ క్షేత్రాలపై దాడులు చేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. దాంతో ఇంధన సరఫరాకు అవరోధాలు మరింత పెరగవచ్చన్న ఆందోళనలతో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర ఒకదశలో 4.82ు పెరిగి 108.40 డాలర్లకు చేరుకుంది.

వెండి రూ.6,000 డౌన్‌: విలువైన లోహాల ధరలు గణనీయంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ఏకంగా రూ.6,000 తగ్గి రూ.2,56,500కు జారుకుంది. 10 గ్రాముల మేలిమి బంగారం రూ.1,000 తగ్గుదలతో రూ.1,60,300కు దిగివచ్చింది.


రూపీ కొత్త కనిష్ఠం

మన కరెన్సీ సరికొత్త జీవనకాల కనిష్ఠానికి జారుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బుధవారం 49 పైసలు క్షీణించి రూ.92.89 వద్ద ముగిసింది. డాలర్‌ బలపడుతుండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణతోపాటు ముడి చమురు మంట, పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత పెరుగుతుండటం రూపాయిపై ఒత్తిడి పెంచాయని ఫారెక్స్‌ వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు గరిష్ఠ స్థాయిల్లోనే కొనసాగితే, డాలర్‌తో రూపాయి మారకం రేటు ఈ ఏడాదిలో రూ.95కు చేరుకోవచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంటోంది.

ఇవి కూడా చదవండి..

జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు

సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..

Updated Date - Mar 19 , 2026 | 02:24 AM