పెట్టుబడుల్లో ‘ఆమె’దే నిర్ణయం
ABN , Publish Date - Mar 15 , 2026 | 05:37 AM
ఆర్థిక నిర్వహణలో భారతీయ మహిళల ఆలోచన ధోరణి క్రమంగా మారుతోంది. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం గణనీయంగా పెరిగింది. ‘విన్వెస్టర్ పల్స్ 2025-26’ పేరుతో డీఎస్‌పీ మ్యూచువల్ ఫండ్...
56% మంది సొంతంగా ఇన్వె్‌స్టమెంట్స్
డీఎస్‌పీ విన్వెస్టర్ పల్స్ నివేదిక వెల్లడి
ఆర్థిక నిర్వహణలో భారతీయ మహిళల ఆలోచన ధోరణి క్రమంగా మారుతోంది. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం గణనీయంగా పెరిగింది. ‘విన్వెస్టర్ పల్స్ 2025-26’ పేరుతో డీఎస్‌పీ మ్యూచువల్ ఫండ్ నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాపంగా 13 ప్రధాన నగరాల్లో మహిళా పెట్టుబడిదారులపై సర్వే నిర్వహించగా.. దాదాపు 56 శాతం మంది మహిళలు తమ పెట్టుబడి నిర్ణయాలను ఎవరిపైనా ఆధారపడకుండా స్వయంగా తీసుకుంటున్నారని తెలిపింది. 2022లో ఇది మహిళల్లో 44 శాతం, పురుషుల్లో 68 శాతంగా ఉంది. కాగా కేవలం మూడేళ్లలో ఈ స్థాయి వృద్ధి నమోదు కావడం దేశ ఆర్థిక ముఖచిత్రంలో వస్తున్న నిర్మాణాత్మక మార్పునకు నిదర్శనమని వెల్లడించింది. అయితే మహిళా పెట్టుబడిదారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతున్నప్పటికీ ప్రణాళికబద్దమైన పెట్టుబడుల విషయంలో కొంత లోటు కన్పిస్తున్నట్లు నివేదికలో తెలిపింది.
స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలతోనే..
సుమారు 84 శాతం మంది ఇన్వెస్టర్లు తాము స్వయంగా పెట్టుబడులు పెట్టగలమని నమ్మకం వ్యక్తం చేస్తున్నప్పటికీ కేవలం 33 శాతం మహిళలకు మాత్రమే స్పష్టమైన ఆర్థిక లక్ష్యం, దానిని చేరుకోవడానికి అవసరమైన పెట్టుబడి ప్రణాళికలు ఉన్నట్లు తేలింది. మహిళ ఆర్థిక లక్ష్యాల్లోనూ మార్పులు వస్తున్నాయి. సుమారు 50 శాతం మంది ‘దీర్ఘకాలిక పెట్టుబడి’గా మూడేళ్ల లోపు కాలాన్ని భావిస్తుండగా.. కేవలం 28 శాతం మంది మాత్రమే ఐదేళ్లకు మించిన కాలాన్ని నిజమైన దీర్ఘకాలిక పెట్టుబడిగా విశ్వసిస్తున్నారు. డబ్బును మనుగడకు అవసరమైన వనరుగా కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛకు చిహ్నంగా భావించే వారి సంఖ్య 27 శాతం నుంచి 35 శాతానికి పెరిగింది.
ఇవి కూడా చదవండి...
గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ
కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే