Share News

క్రూడ్‌ సల సల.. షేర్లు విల విల

ABN , Publish Date - Mar 10 , 2026 | 02:19 AM

పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలపై ముడి చమురు సలసలా కాగుతోంది. ఆ సెగతో భారత్‌ సహా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. క్రూడాయిల్‌ పీపా ధర దాదాపు...

క్రూడ్‌ సల సల..  షేర్లు విల విల

సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 2,494 పాయింట్లు డౌన్‌

చివరికి 1,353 పాయింట్ల నష్టంతో ముగింపు

  • ఒక దశలో 23,700 దిగువ స్థాయికి జారిన నిఫ్టీ

  • 422 పాయింట్ల నష్టంతో 24,028 వద్ద క్లోజింగ్‌

  • ఒక్కరోజులో రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి

  • 6 సెషన్లలో రూ.27.47 లక్షల కోట్లు యుద్ధార్పణం

  • సరికొత్త ఆల్‌టైం కనిష్ఠానికి రూపాయి పతనం

ముంబై: పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలపై ముడి చమురు సలసలా కాగుతోంది. ఆ సెగతో భారత్‌ సహా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. క్రూడాయిల్‌ పీపా ధర దాదాపు 120 డాలర్లకు ఎగబాకడంతో దేశీయ ఈక్విటీ సూచీలు మరో భారీ పతనాన్ని చవిచూశాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ సోమవారం ఒక దశలో 2,494.35 పాయింట్లు (3.16 శాతం) క్షీణించి 76,424.55 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం నుంచి సూచీ కాస్త తేరుకుని చివరకు 1,352.74 పాయింట్ల (1.71 శాతం) నష్టంతో 77,566.16 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 752.65 పాయింట్ల (3.07 శాతం) పతనంతో 23,697.80 వద్దకు జారుకుంది. చివరికి 422.40 పాయింట్ల (1.73 శాతం) నష్టంతో 24,028.05 వద్ద స్థిరపడింది. అమ్మకాల హోరులో ఈక్విటీ మదుపరుల సంపద ఒక్క రోజులోనే రూ.8.58 లక్షల కోట్ల మేర తరిగిపోయింది. దాంతో బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ (క్యాపిటలైజేషన్‌) రూ.441.10 లక్షల కోట్ల(4.78 లక్షల కోట్ల డాలర్లు)కు పడిపోయింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గడిచిన ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.27.47 లక్షల కోట్ల మార్కెట్‌ సంపద ఆవిరైంది. వార్‌ ఎఫెక్ట్‌తో గత వారం సెన్సెక్స్‌ 2,368.29 పాయింట్లు (2.91 శాతం), నిఫ్టీ 728.2 పాయింట్లు (2.89 శాతం) నష్టపోయాయి. మరిన్ని ముఖ్యాంశాలు..

  • సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 25 నష్టపోగా.. అలా్ట్రటెక్‌ సిమెంట్‌ 5.09 శాతం క్షీణించి సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది. మారుతి సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా స్టాక్స్‌ 4 శాతం పైగా పడ్డాయి. మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మాత్రం 1.37 శాతం లాభపడింది. ఐటీ రంగానికి చెందిన ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు కూడా స్వల్పంగా పెరిగాయి.

  • బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీ 2.11 శాతం, మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ ఇండెక్స్‌ 2.08 శాతం నష్టపోయాయి. బీఎ్‌సఈలోని రంగాల వారీ సూచీలన్నీ నేలచూపులు చూశాయి. మిడ్‌-స్మాల్‌ ప్రైవేట్‌ బ్యాంక్స్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 4.50 శాతం, పీఎ్‌సయూ బ్యాంక్‌ 3.92 శాతం, ఆటో 3.89 శాతం, సర్వీసెస్‌ 3.37 శాతం, బ్యాంకెక్స్‌ 3.16 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 3.11 శాతం, ప్రైవేట్‌ బ్యాంక్స్‌ సూచీ 2.89 శాతం క్షీణించాయి.

  • బీఎ్‌సఈలో 4,536 కంపెనీల షేర్లు ట్రేడవగా.. 3,484 నష్టపోయాయి. 875 సంస్థల స్టాక్స్‌ సరికొత్త ఏడాది కనిష్ఠానికి జారుకోగా.. 9 లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.


  • విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) నికరంగా రూ.6,345.57 కోట్ల విక్రయాలు జరుపగా.. ఎల్‌ఐసీ వంటి దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐ) రూ.9,013.80 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.

000-Business.jpg

రూపాయే..

భారత కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక దశలో 53 పైసలు క్షీణించి రూ.92.35 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డు కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 39 పైసల నష్టంతో రూ.92.21 వద్ద స్థిరపడింది. ఇది ఆల్‌టైం రికార్డు కనిష్ఠ ముగింపు కూడా. ముడిచమురు ధర 100 డాలర్ల పైకి ఎగబాకిన నేపథ్యంలో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్‌ పెరగడం, ఈక్విటీ మార్కెట్లో నష్టాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ మన రూపాయిపై ఒత్తిడి పెంచాయని ఫారెక్స్‌ వర్గాలు తెలిపాయి. క్రూడ్‌ మరింత ఎగబాకితే డాలర్‌-రూపీ ఎక్స్ఛేంజ్‌ రేటు రూ.93 దాటవచ్చని వారు భావిస్తున్నారు.

బంగారం, వెండి దిగొచ్చే..

విలువైన లోహాల ధరలు మరింత తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రూ.3,400 తగ్గి రూ.2,68,300కు దిగివచ్చింది. 10 గ్రాముల మేలి మి (24 క్యారెట్లు) బంగారం ధర కూడా రూ.200 తగ్గి రూ.1,64,300గా నమోదైంది. అంతర్జాతీయంగా వీటి ధరలు తగ్గడమే ఇందుకు కారణం. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాము లు) ఒక దశలో 1.26 శాతం తగ్గి 5,105.89 డాలర్లకు జారగా.. సిల్వర్‌ 0.53 శాతం తగ్గుదలతో 83.92 డాలర్లకు పడిపోయింది.

ఆందోళన వద్దుసెబీ చీఫ్‌

అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, దేశీయ ఆర్థిక మూలాలు పటిష్ఠంగా ఉన్నాయని, మార్కెట్‌ మదుపరులు ఆందోళన చెందనక్కర్లేదని సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా స్టాక్‌ మార్కెట్లు భారీ ఊగిసలాటలకు లోనవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సెన్సెక్స్‌ నిఫ్టీ

క్రితం ముగింపు 78,918.90 24,450.45

ప్రారంభం 77,056.75 23,868.05

కనిష్ఠం 76,424.55 23,697.80

గరిష్ఠం 77,711.35 24,078.15

ముగింపు 77,566.16 24,028.05

ఇవి కూడా చదవండి:

ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ

పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్

Updated Date - Mar 10 , 2026 | 02:19 AM