Share News

మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:27 AM

దేశీ మార్కెట్లో మళ్లీ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)ల సందడి మొదలు కానుంది. డిసెంబరు చివరి నాటికి 29 కంపెనీలు మొత్తం...

మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి

రూ.42,000 కోట్ల సమీకరణకు 29 కంపెనీల సన్నాహాలు

డిసెంబరులో వరుసగా కొత్త పబ్లిక్‌ ఇష్యూలు

న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో మళ్లీ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)ల సందడి మొదలు కానుంది. డిసెంబరు చివరి నాటికి 29 కంపెనీలు మొత్తం రూ.42,000 కోట్ల సమీకరణకు సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒడుదొడుకులు తగ్గడం, దేశీయంగా ఇన్వెస్టర్లలో విశ్వాసం మెరుగుపడడంతో పబ్లిక్‌ ఇష్యూలకు కంపెనీలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ముఖ్యం గా మార్కెట్‌ సెంటిమెంట్‌ మెరుగుపడడాన్ని నిధుల సమీకరణకు సానుకూలంగా చూస్తున్నాయి.

కార్ల్స్‌బర్గ్‌ రూ.6,650 కోట్ల ఇష్యూ: ఆల్కహాలిక్‌ బెవరేజెస్‌ వ్యాపారంలోని ఈ సంస్థ రూ.6,650 కోట్ల్లు సమీకరించే లక్ష్యంతో ఉంది. డిసెంబరులోపే ఈ ఐపీఓ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే, అవాడా ఎలక్ట్రోల రూ.6,000 కోట్లు, కల్ట్‌ఫిట్‌ రూ.4,000 కోట్ల సమీకరణ సన్నాహాలతో ఉన్నాయి. కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా నిర్వహణలోని స్వతంత్ర మైక్రోఫిన్‌తో పాటు ఎన్‌క్యూబ్‌ ఎథికల్స్‌ చెరో రూ.3,000 కోట్లు సమీకరించనున్నాయి.ఆ తర్వాత విశ్వరాజ్‌ ఎన్విరాన్‌మెంట్‌ రూ.2,250 కోట్లు, మైల్‌స్టోన్‌ గేర్స్‌ రూ.1,100 కోట్లు, పారామోటార్‌ డిజిటల్‌ టెక్‌ రూ.1,000 కోట్ల ఇష్యూతో రానున్నాయి.


సానుకూల పరిస్థితులు: అమెరికా, ఇజ్రాయెల్‌లో ఎన్నికల అనంతరం అంతర్జాతీయంగా పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు చోటుచేసుకుంది. భారత ఈక్విటీ మార్కెట్లో విరామం లేకుండా పెద్ద ఎత్తున అమ్మకాలు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకున్నారు. అప్పటి వరకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత కంపెనీల వెంటపడగా.. వాటి లాభదాయకతపై సందేహాలు నెలకొనడంతో, ఆకర్షణీయంగా ఉన్న భారత్‌ మార్కెట్‌ వైపు మళ్లారు. ఎఫ్‌పీఐలు ఈ నెలలో ఇప్పటికే రూ.1.15 లక్షల కోట్ల మేర ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్లు జరిపారు.

ఈ వారం 3 పబ్లిక్‌ ఇష్యూలు

ఈ వారం రూ.3,300 కోట్ల సమీకరణ లక్ష్యంతో మూడు కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలు ప్రారంభం కానున్నాయి. వైద్య పరికరాల తయారీలోని ఇంటెగ్రిస్‌ మెడ్‌టెక్‌ ఐపీవో ఈ నెల 27న మొదలై డిసెంబరు 1న ముగియనుంది. రూ.3,000 కోట్లను సమీకరించాలన్నది కంపెనీ లక్ష్యం. ఫుడ్‌లింక్‌ ఎఫ్‌ అండ్‌ బీ ఐపీఓ సైతం 26న మొదలై 30న ముగియనుంది. ఎస్‌ఎంఈ విభాగంలో రూ.93.66 కోట్ల సమీకరణతో శ్రీ సిద్ధి వినాయక్‌ గ్రీన్‌టెక్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓ నవంబరు 25న మొదలు కానుంది. ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై ఇది లిస్ట్‌ కానుంది. ఇక మహానది కోల్‌ఫీల్డ్స్‌ ఐపీఓ సోమవారం ముగియనుండగా (23న) ఈ నెల 27న బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈలో లిస్ట్‌ కానుంది.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్‌ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్

భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్

Updated Date - Nov 23 , 2026 | 03:28 AM