అప్పీల్‌కు చెల్లించిన ప్రీ డిపాజిట్ వెనక్కు వస్తుందా..?
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:28 AM
జీఎస్‌టీ ఆర్డర్ మీద అప్పీల్ దాఖలు చేయాలంటే.. నిర్ణీత గడువు లోపు దాఖలు చేయటంతో పాటు ప్రీ డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుదన్న విషయం...
జీఎస్‌టీ ఆర్డర్ మీద అప్పీల్ దాఖలు చేయాలంటే.. నిర్ణీత గడువు లోపు దాఖలు చేయటంతో పాటు ప్రీ డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుదన్న విషయం తెలిసిందే. అంటే ఆర్డర్‌లో తాను ఆమోదించే అంశాలకు సంబంధించిన పన్ను, వడ్డీ, పెనాల్టీ మొత్తంగా చెల్లించి, తాను విభేదించే అంశాల్లో కేవలం పన్ను మీద 10 శాతం చెల్లించాలి. అయితే ఈ ప్రీ డిపాజిట్‌కు సంబంధించి చాలా సందేహాలు వ్యాపారస్తుల్లో ఉన్నాయి. ఉదాహరణకు, మొదటి అప్పీల్‌లో డిమాండ్ తగ్గితే ట్రైబ్యునల్ వద్ద ఎంత కట్టాలి? అప్పీల్‌లో తీర్పు అనుకూలంగా వస్తే కట్టిన డబ్బు ఎలా తిరిగి వస్తుంది? ఆర్డర్‌లో రిఫండ్ ఇవ్వాలని రాయకపోతే ఏమవుతుంది? డిపార్ట్‌మెంట్ మళ్లీ అప్పీల్‌కు వెళితే రిఫండ్ ఆగుతుందా? వడ్డీ ఏ తేదీ నుంచి వస్తుంది? ఇలాంటి విషయాల్లో రకరకాల అభిప్రాయాలు ఉండటంతో కొంత గందరగోళంతో పాటు వివాదాలు కూడా పెరిగాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇటీవల స్పష్టమైన వివరణను ఇచ్చింది. ఆ వివరాలు..
అడ్మిటెడ్ అమౌంట్: ముందుగా.. ఆమోదించే మొత్తం (అడ్మిటెడ్ అమౌంట్) అంటే ఏమిటి, వివాదంలో ఉన్న పన్ను (ట్యాక్స్ ఇన్ డిస్ప్యూట్) అంటే ఏమిటనే విషయంలో కూడా స్పష్టతనిచ్చారు. ఆర్డర్‌లో వ్యాపారి తాను చెల్లించాల్సినదే అని ఒప్పుకుని, అప్పీల్‌లో సవాల్ చేయని భాగమే ఆమోదించే మొత్తం. ఇందులో పన్ను, వడ్డీ, పెనాల్టీ, ఫీజు, జరిమానా ఏదైనా ఉండొచ్చు. ఇది అప్పీ ల్ దాఖలు చేసే ముందే పూర్తిగా చెల్లించాలి. మిగిలిన మొత్తం.. అంటే అప్పీల్‌లో సవాల్ చేసే భాగమే. వివాదంలో ఉన్న పన్ను.. దీని మీదనే 10ు లెక్కిస్తారు. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే.. ఏది ఆమోదిస్తున్నాడు. ఏది విభేదిస్తున్నాడనేది పూర్తిగా ఆ వ్యాపారి నిర్ణయమే. పన్నును ఒప్పుకున్నంత మాత్రాన సంబంధిత పెనాల్టీ, వడ్డీ కచ్చితంగా ఒప్పుకోవాలనే నియమం ఏమీ లేదు. ఈ నిర్ణయాన్ని అప్పీల్ దాఖలు చేసేటప్పుడే అప్పీల్ ఫారమ్‌లో విడివిడిగా చూపించాలి. ఇదే పద్ధతి ట్రైబ్యునల్ వద్ద దాఖలు చేసే అప్పీల్‌కు కూడా వర్తిస్తుంది. దీనిని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం.
కూకట్‌పల్లిలో ఎలక్ట్రిక్ సామాన్ల వ్యాపారం చేసే ఒక వ్యాపారికి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)కి సంబంధించి రూ.10 లక్షల పన్నుతో పాటు వడ్డీ, పెనాల్టీ విధిస్తూ ఆర్డర్ వచ్చిందనుకుందాం. అందులో రూ.2 లక్షల పన్ను నిజంగానే తాను పొరపాటున తీసుకున్న క్రెడిట్‌కు సంబంధించినదని ఆమోదిస్తూ, మిగిలిన రూ.8 లక్షల మీద అప్పీల్ చేస్తున్నాడనుకుందాం (మొదటి అప్పీల్). అప్పుడు ఆ రూ.2 లక్షలు పూర్తిగా చెల్లించి.. రూ.8 లక్షల్లో 10% అంటే రూ.80,000 ప్రీ డిపాజిట్‌గా చెల్లించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, రూ.2 లక్షల క్రెడిట్ పొరపాటుగా తీసుకున్నట్లు ఒప్పుకున్నా..పెనాల్టీ, వడ్డీ కచ్చితంగా ఒప్పుకోవాలనే నియ మం లేదు. ఒకవేళ ఆ వ్యాపారి ఆ రూ.2 లక్షల మీద విధించిన పెనాల్టీ, వడ్డీని కూడా ఆమోదిస్తే ఆ మొత్తాన్ని కూడా చెల్లించాలి. తదుపరి విచారణ తర్వాత అప్పిల్లేట్ అథారిటీ ఆ రూ.8 లక్షల్లో రూ.3 లక్షలు తొలగించి.. రూ.5 లక్షల డిమాండ్‌ను సమర్ధించిదనుకుందాం. ఆ రూ.5 లక్షల మీద వ్యాపారి.. ట్రైబ్యునల్‌కు (రెండో అప్పీల్) వెళ్లాలనుకుంటే రూ.5 లక్షల్లో 10ు అంటే రూ.50,000 అదనంగా కడితే సరిపోతుంది.
ఇంతకు ముందు కట్టిన రూ.80,000 అలాగే ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. అంటే రెండు దశల్లో కలిపి మొత్తం రూ.1.30 లక్షలు ప్రీ డిపాజిట్‌గా ఉంటుంది. ఒకవేళ రూ.5 లక్షల్లో కూడా కొంత భాగాన్ని వ్యాపారి ఆమోదిస్తే, ఆ భాగాన్ని పూర్తిగా చెల్లించి, మిగిలిన దాని మీద 10ు కడితే సరిపోతుంది.
రిఫండ్ వస్తుందా..: మరొక ముఖ్యమైన సందే హం రిఫండ్‌కు సంబంధించినది. అప్పీల్‌లో వ్యాపారికి అనుకూలంగా తీర్పు వస్తే కట్టిన ప్రీ డిపాజిట్ తిరిగి రావాలి కదా. అయితే ఆర్డర్‌లో ప్రీ డిపాజిట్ తిరిగి ఇవ్వాలని ప్రత్యేకంగా రాయకపోతే రిఫండ్ వస్తుందా లేదా అనే సందేహం కొందరిలో ఉంది. దీనిపై కూడా స్పష్టతనిచ్చారు. ఆర్డర్‌లో రిఫండ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఆర్డర్ ఫలితంగా ప్రీ డిపాజిట్ తిరిగి ఇవ్వాల్సి వస్తే, ఆర్డర్ కాపీ అందిన తర్వాత వ్యాపారి జీఎ్‌సటీ పోర్టల్ లో రిఫండ్ దరఖాస్తులో ఆర్డర్ ప్రకారం (ఆన్ అకౌంట్ ఆఫ్ ఆర్డర్) అనే విభాగాన్ని ఎంచుకుంటే సరిపోతుంది.
అప్పీల్ చేస్తే రిఫండ్ ఆగుతుందా..: అలాగే అప్పిల్లేట్ అథారిటీ.. వ్యాపారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుపై డిపార్ట్‌మెంట్ కూడా ట్రైబ్యునల్‌కు అప్పీల్ చేసే అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు డిపార్ట్‌మెంట్ అప్పీల్ తేలే వరకు రిఫండ్ ఆగుతుందా? అంటే ఆగదు. డిపార్ట్‌మెంట్ అప్పీల్ చేయాలని అనుకుంటున్నా లేదా అప్పటికే అప్పీల్ దాఖలు చేసినా, వ్యాపారి రిఫండ్‌కు దరఖాస్తు చేస్తే ప్రీ డిపాజిట్ తిరిగి ఇవ్వాల్సిందే. ఒకే సందర్భంలో మాత్రం రిఫండ్ ఆగుతుంది. వ్యాపారికి అనుకూలంగా వచ్చిన ఆర్డర్‌ను ట్రైబ్యునల్ గానీ, కోర్టు గానీ నిలిపివేస్తే అంటే స్టే ఇస్తే మాత్రమే. పై ఉదాహరణలో వ్యాపారికి అప్పిల్లేట్ అథారిటీ వద్ద పూర్తిగా అనుకూలంగా ఆర్డర్ వచ్చి, దానిపై డిపార్ట్‌మెంట్ ట్రైబ్యునల్‌కు వెళ్లినా, ఎలాంటి స్టే లేనంత వరకు ఆ వ్యాపారి తాను కట్టిన రూ.80,000 రిఫండ్ పొందవచ్చు.
వడ్డీ చెల్లింపు ఎలా..: ఇక వడ్డీ విషయానికి వస్తే, ప్రీ డిపాజిట్ తిరిగి ఇచ్చేటప్పుడు ఆ మొత్తం కట్టిన తేదీ నుంచి నిబంధనల ప్రకారం వడ్డీ కూడా చెల్లిస్తారు. మరి రెండు దశల్లో వేర్వేరు తేదీల్లో కడితే వడ్డీ ఏ తేదీ నుంచి లెక్కించాలి? ప్రతి చెల్లింపును విడిగా చూడాలి. అంటే ఏ మొత్తం ఏ తేదీన కట్టారో ఆ తేదీ నుంచే ఆ మొత్తానికి వడ్డీ లెక్కిస్తారు. పై ఉదాహరణలో వ్యాపారి మొదటి అప్పీల్ కోసం రూ.80,000.. 2025 జనవరిలో, ట్రైబ్యునల్ అప్పీల్ కోసం 2026 జూన్‌లో రూ.50,000 కట్టాడనుకుందాం. ట్రైబ్యునల్‌లో పూర్తిగా అనుకూలంగా తీర్పు వస్తే.. 2025 జనవరి నుంచి రూ.80,000కు, రూ.50,000కు 2026 జూన్ నుంచి వడ్డీ లెక్కిస్తారు. అంటే రూ.1.30 లక్షలకు ఒకే తేదీ కాకుండా ఏ చెల్లింపు ఎప్పుడు జరిగిందో దాని ప్రకారం వడ్డీ వస్తుంది.
స్థూలంగా చెప్పాలంటే, అప్పీల్‌కు వెళ్లే ముందు ఆర్డర్‌లో ఏ భాగాన్ని ఆమోదిస్తున్నారు, ఏ భాగాన్ని విభేదిస్తున్నారనేది బాగా ఆలోచించి అప్పీల్ ఫారమ్‌లో సరిగ్గా చూపించటం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రీ డిపాజిట్ ఎంత అనేది దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకసారి వ్యాపారికి అనుకూలంగా తీర్పు వస్తే, ఆర్డర్‌లో ప్రత్యేకంగా రాయకపోయినా, డిపార్ట్‌మెంట్ అప్పీల్‌కు వెళ్లినా (స్టే లేనంత వరకు) రిఫండ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వడ్డీ చెల్లింపు తేదీ నుంచి వస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ వివరణతో వ్యాపారస్తులకు స్పష్టత రావటమే కాకుండా అనవసర వివాదాలు తగ్గుతాయి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే, 10ు ప్రీ డిపాజిట్ అనేది కేవలం పన్ను మీద మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ అప్పీల్ చేసే దానిలో పన్ను లేకుంటే పెనాల్టీ మీద వర్తిస్తుంది. అది కూడా లేకుంటే అంటే కేవలం వడ్డీ మాత్రమే ఉంటే ఎలాంటి ప్రీ డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదు.
రాంబాబు గొండాల
గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
ఈ వార్తలనూ చదవండి:
డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక
భారత్ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక