Share News

ఈ ఏడాది ప్రీమియం వసూళ్లలో 20 శాతం వృద్ధి టార్గెట్‌

ABN , Publish Date - May 02 , 2026 | 02:45 AM

మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎల్‌ఐఎల్‌) మంచి పనితీరు కనబరిచింది. ఈ కాలానికి గాను కంపెనీ స్థూల ప్రీమియం...

ఈ ఏడాది ప్రీమియం వసూళ్లలో 20 శాతం వృద్ధి టార్గెట్‌

2025-26లో రూ.5,000 కోట్లుగా నమోదు

శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ కాస్పరస్‌ క్రోమ్‌హౌట్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎల్‌ఐఎల్‌) మంచి పనితీరు కనబరిచింది. ఈ కాలానికి గాను కంపెనీ స్థూల ప్రీమియం వసూళ్లు రూ.5,000 కోట్లు మించాయి. కంపెనీ చరిత్రలో ప్రీమియం వసూళ్లు రూ.5,000 కోట్లు దాటడం ఇదే మొదటిసారని సంస్థ ఎండీ, సీఈఓ కాస్పరస్‌ క్రోమ్‌హౌట్‌ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో ప్రీమియం వసూళ్లలో 20 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాలు, ఇప్పటి వరకు బీమా కవరేజీ లేని వారిని లక్ష్యంగా పెట్టుకుని శ్రీరామ్‌ లైఫ్‌ పనిచేస్తోందని చెప్పారు. గత మూడేళ్లుగా బీమా పరిశ్రమ ప్రీమియం వసూళ్లు సగటున 15 శాతం చొప్పున పెరిగితే శ్రీరామ్‌ లైఫ్‌ ప్రీమియం వసూళ్లు మాత్రం 30 శాతం చొప్పున పెరిగినట్టు వెల్లడించారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వాటా రూ.1,086 కోట్లు: గత ఆర్థిక సంవత్సరం కంపెనీ వసూలు చేసిన మొత్తం ప్రీమియంలో రూ.1,085.80 కోట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచే సమకూరింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి రూ.493.60 కోట్లు సమకూరగా, తెలంగాణ నుంచి రూ.592.50 కోట్లు సమకూరాయి. ప్రస్తుతం శ్రీరామ్‌ లైఫ్‌కు తెలుగు రాష్ట్రాల్లో 109 శాఖలు ఉన్నాయి. మరే ప్రైవేట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని శాఖలు లేవని కాస్పరస్‌ చెప్పారు. ఏపీ, తెలంగాణల్లోని డ్వాక్రా గ్రూపు మహిళలకు కూడా జీవిత బీమా, టర్మ్‌ పాలసీలు అందించాలని ఎస్‌ఎల్‌ఐఎల్‌ భావిస్తోంది. ఇందుకోసం త్వరలోనే రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తామని ఆయన చెప్పారు.

కొత్తగా 4 పాలసీలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు కొత్త పాలసీలు తీసుకురావాలని ఎస్‌ఎల్‌ఐఎల్‌ భావిస్తోంది. వ్యక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమ పాలసీలు ఉంటాయని కాస్పరస్‌ చెప్పారు. ప్రభుత్వ విధానాలతో పాటు పాలసీల ప్రీమియం తగ్గితే తప్ప 2047 నాటికి ప్రభుత్వ లక్ష్యమైన ‘అందరికీ బీమా కవరేజీ’ లక్ష్యం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

నేను సీఎం కావాలన్నా.. కుర్చీ ఖాళీగా లేదు

జీవితంలో ఓడి... పదిలో గెలిచిన వర్షిత..

Read Latest Telangana News and National News

Updated Date - May 02 , 2026 | 02:45 AM