ఎస్బీఐ లాభం రూ.23,038 కోట్లు
ABN , Publish Date - Nov 04 , 2026 | 03:48 AM
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) వార్షిక ప్రాతిపదికన 14శాతం వృద్ధితో రూ.23,038 కోట్ల స్టాండ్ఎలోన్ నికర లాభాన్ని ప్రకటించింది.
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) వార్షిక ప్రాతిపదికన 14శాతం వృద్ధితో రూ.23,038 కోట్ల స్టాండ్ఎలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ.20,160 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సమీక్షా కాలంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.1,34,979 కోట్ల నుంచి రూ.1,43,796 కోట్లకు పెరిగిందని బ్యాంక్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఇదే కాలంలో ఆర్జించిన వడ్డీ రూ.1,19,654 కోట్ల నుంచి రూ.1,32,019 కోట్లకు చేరిందన్నారు. కీలక నికర వడ్డీ ఆదాయం 14.69శాతం పెరిగి రూ.49,143 కోట్లకు చేరింది. సెప్టెంబరు చివరినాటికి స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 1.39 శాతానికి తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం లో ఇవి 1.73 శాతంగా ఉన్నాయి. అలాగే నికర ఎన్పీఏలు 0.42శాతం నుంచి 0.36 శాతానికి తగ్గాయి. ఫలితంగా మొండి పద్దుల కోసం కేటాయింపులు రూ.4,132 కోట్ల నుంచి రూ.2,759 కోట్లకు తగ్గాయి.
కన్సాలిడేటెడ్ లాభంలో 20శాతం వృద్ధి: ఏకీకృత ప్రాతిపదికన.. ఎస్బీఐ గ్రూప్ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి 20శాతం వృద్ధితో రూ.25,361 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో ఆర్జించిన లాభం రూ.21,137 కోట్లుగా ఉంది. మ్యూచువల్ ఫండ్ విభాగం, ఎన్ఎస్ఈలో పబ్లిక్ ఇష్యూ ద్వారా వాటా విక్రయంతో వచ్చిన లాభాలు ఇందుకు దోహదపడ్డాయి. మొత్తం ఆదాయం రూ.1,75,898 కోట్ల నుంచి రూ.1,87,756 కోట్లకు పెరిగింది.
రిటైల్ రుణాల వృద్ధి లక్ష్యం 14-15శాతం: దేశీయ నికర వడ్డీ మార్జిన్లు (ఎన్ఐఎం) 0.11శాతం పెరిగి 3.11 శాతానికి చేరినందుకు ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా బ్యాంకు దీనిని 3శాతం పైనే ఉంచుతుందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రుణ, డిపాజిట్ వృద్ధి లక్ష్యాలను వరుసగా 14-15 శాతం, 10-11 శాతంగా కొనసాగిస్తున్నట్టు చెప్పారు. కాగా సూపర్ ఎల్నినో ప్రభావం ఆస్తుల నాణ్యతపై కనిపించలేదని, గ్రామీణ వినియోగంపై భవిష్యత్తులో దాని ప్రభావాన్ని గమనించాల్సి ఉంటుందన్నారు. కాగా ఆర్బీఐ ఎఫ్సీఎన్ఆర్(బీ) రాయితీ స్వాప్ సదుపాయం కింద బ్యాంకు 1,090 కోట్ల డాలర్లు సమీకరించగా.. పథకంలోని లివరేజ్ సదుపాయం కింద 883 కోట్ల డాలర్లు ప్రవాస డిపాజిటర్లకు రుణాలుగా ఇచ్చింది. ఇక సెప్టెంబరు త్రైమాసికంలో దేశీయంగా రిటైల్ రుణాలు 14.54 శాతం వృద్ధి చెందగా.. ఇందులో గృహ రుణాల్లో 11.94 శాతం, దేశీయ కార్పొరేట్ రుణాల్లో 16.12 శాతం వృద్ధి నమోదైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రూ.2,320 కోట్లతో తెలంగాణ ప్లాంట్ విస్తరణ
రిలయన్స్ జోరు.. 7 వారాల గరిష్ఠానికి సెన్సెక్స్