Share News

రిలయన్స్‌కు యుద్ధం సెగ

ABN , Publish Date - Apr 25 , 2026 | 02:59 AM

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) లాభాలకు భారీ గండి పడింది. మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2025-26) నాలుగో...

రిలయన్స్‌కు యుద్ధం సెగ

రూ.2.98 లక్షల కోట్లకు ఆదాయం

క్యూ4 లాభంలో 13ు క్షీణత.. రూ. 16,971 కోట్లకు పరిమితం

  • ఓ2సీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ డల్‌..

  • టెలికాం, రిటైల్‌, జియోస్టార్‌ జిగేల్‌

  • రిలయన్స్‌ రిటైల్‌.. 20,000 స్టోర్లు

  • ఒక్కో షేరుకు రూ.6 డివిడెండ్‌

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) లాభాలకు భారీ గండి పడింది. మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2025-26) నాలుగో త్రైమాసికం (క్యూ4)లో ఆర్‌ఐఎల్‌ ఏకీకృత నికర లాభం రూ.16,971 కోట్లకు పడిపోయింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇదే కాలానికి నమోదైన రూ.19,407 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 12.55 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలోనే డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో గడించిన రూ.18,645 కోట్ల లాభం తో పోల్చినా 8 శాతం తగ్గింది. యుద్ధంతో తలెత్తిన ఇంధన సంక్షోభం, సరఫరా అవాంతరాలు, బీమా ప్రీమియం, రవాణా ఖర్చుల పెరుగుదల, ప్రభు త్వం విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను పునఃప్రవేశపెట్టడం కంపెనీ ప్రధాన వ్యాపారమైన ఆయిల్‌ అండ్‌ కెమికల్స్‌ (ఓ2సీ) విభాగ లాభాలు, మార్జిన్లపై భారీగా ప్రభావం చూపింది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఉత్పత్తి పేలవ పనితీరు మరో కారణం.

క్యూ4లో ఆర్‌ఐఎల్‌కు వ్యాపార కార్యకలాపాల ద్వారా సమకూరిన ఆదాయం వార్షిక ప్రాతిపదికన 12.86 శాతం వృద్ధితో రూ.2,98,621 కోట్లకు పెరిగింది. 2024-25లో ఇదే కాలానికి కంపెనీ రెవెన్యూ రూ.2,64,573 కోట్లుగా ఉంది. కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీ లాభం వార్షిక ప్రాతిపదికన 16 శాతం పెరుగుదలతో రూ.80,775 కోట్లకు చేరుకుంది. ఆదాయం రూ.10,75,675 కోట్లకు చేరుకుంది. కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.6 డివిడెండ్‌ చెల్లించాలని ఆర్‌ఐఎల్‌ బోర్డు ప్రతిపాదించింది. కంపెనీ వార్షిక సమావేశంలో వాటాదారులు ఈ ప్రతిపాదనను ఆమోదించాల్సి ఉంటుంది.


జియోస్టార్‌

క్యూ4లో జియోస్టార్‌ విభాగ ఆదాయం రూ.8,372 కోట్లు, నికర లాభం రూ.419 కోట్లుగా నమోదైంది. కంపెనీ టీవీ చానెళ్ల దేశవ్యాప్త వీక్షకుల సంఖ్య 81 కోట్లు దాటింది. టీవీ వినోద విభాగంంలో కంపెనీ మార్కెట్‌ వాటా 34.2 శాతానికి చేరింది. గడిచిన త్రైమాసికంలో కంపెనీ ఓటీటీ వేదికైన జియో హాట్‌స్టార్‌ దాదాపు 50 కోట్ల యాక్టివ్‌ వినియోగదారులను కలిగి ఉంది.

ఓ2సీ

వ్యాపార విభాగాల వారీగా పనితీరు..

మార్చి త్రైమాసికంలో రిలయన్స్‌ ఆయిల్‌ టు కెమికల్స్‌ వ్యాపార విభాగ ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.1.84 లక్షల కోట్లకు పెరిగింది. సమీక్షా కాలంలో ముడిచమురు ధరలు 12 శాతం మేర పెరగడం ఇందుకు దోహదపడింది. అయితే, ఈ విభాగ నిర్వహణ లాభం మాత్రం 4 శాతం తగ్గి రూ.14,520 కోట్లకు పడిపోయింది. సరుకు రవాణా వ్యయాలు భారీగా పెరగడం ఇందుకు కారణమైంది.

ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌

గడిచిన త్రైమాసికంలో ఈ విభాగ ఆదాయం 9 శాతం తగ్గి రూ.5,867 కోట్లకు పరిమితం కాగా.. ఎబిటా 18 శాతం క్షీణించి రూ.4,195 కోట్లకు జారుకుంది. కేజీ బేసిన్‌లో గ్యాస్‌ ఉత్పత్తి తగ్గడంతో పాటు ఆ గ్యాస్‌కు లభించిన ధర కూడా తగ్గడం ఇందుకు కారణం.

జియో ప్లాట్‌ఫామ్స్‌

రిలయన్స్‌ టెలికాం, డిజిటల్‌ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌ నికర లాభం క్యూ4లో 13 శాతం పెరుగుదలతో రూ.7,935 కోట్లకు పెరిగింది. ఆదాయం 12.6 శాతం పెరుగుదలతో రూ.38,259 కోట్లకు చేరుకుంది. టెలికాం సంస్థ రిలయన్స్‌ జియోకు ఒక్కో వినియోగదారు నుంచి లభించిన సగటు ఆదాయం (ఆర్పూ) మరో 3.8 శాతం పెరిగి రూ.214కు ఎగబాకింది. కంపెనీ మొత్తం కస్టమర్ల సంఖ్య 52.44 కోట్లకు పెరిగింది.

రిలయన్స్‌ రిటైల్‌

దేశంలో అతిపెద్ద రిటైల్‌ వ్యాపార సంస్థ అయిన రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) క్యూ4 లాభం 0.5 శాతం వృద్ధితో రూ.3,563 కోట్లుగా నమోదుకాగా, ఆదాయం 11.1 శాతం పెరిగి రూ.87,344 కోట్లకు ఎగబాకింది. గత మూడు నెలల్లో కంపెనీ మరో 333 కొత్త స్టోర్లను ప్రారంభించింది. దాంతో మొత్తం స్టోర్ల సంఖ్య 20,160కి పెరిగింది.

ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News

Updated Date - Apr 25 , 2026 | 02:59 AM