క్రిప్టోపై ఇప్పటికీ అప్రమత్తంగానే ఉన్నాం: ఆర్బీఐ గవర్నర్
ABN , Publish Date - Oct 03 , 2026 | 07:20 PM
క్రిప్టోకరెన్సీల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికీ అప్రమత్తంగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. అయితే క్రిప్టోకరెన్సీలకు ఆధారంగా ఉన్న సాంకేతికతలను ఉపయోగించుకోవడాన్ని మాత్రం ఆర్బీఐ వ్యతిరేకించడం లేదని చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: క్రిప్టోకరెన్సీల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికీ అప్రమత్తంగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. అయితే క్రిప్టోకరెన్సీలకు ఆధారంగా ఉన్న సాంకేతికతలను ఉపయోగించుకోవడాన్ని మాత్రం ఆర్బీఐ వ్యతిరేకించడం లేదని చెప్పారు. ముఖ్యంగా 'డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ', 'టోకెనైజేషన్' వంటి సాంకేతికతలకు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు (RBI crypto policy).
న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్ కాన్‌క్లేవ్‌లో సంజయ్ మల్హోత్రా మాట్లాడారు. క్రిప్టోకరెన్సీల వల్ల దేశ ద్రవ్య వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా ద్రవ్య విధానం, అంతర్జాతీయంగా నగదు ప్రవాహం వంటి అంశాలపై క్రిప్టోకరెన్సీలు ప్రభావం చూపవచ్చని ఆర్బీఐ ఆందోళన చెందుతోందని వివరించారు. భారత్‌లో దేశీయ డిజిటల్ చెల్లింపులు ఇప్పటికే వేగంగా, తక్కువ ఖర్చుతో జరుగుతున్నాయని చెప్పారు.
దేశంలో ఒకరి నుంచి మరొకరికి డబ్బు పంపేందుకు క్రిప్టోకరెన్సీల అవసరం పెద్దగా కనిపించడం లేదని మల్హోత్రా అభిప్రాయపడ్డారు. అసలు సవాలు అంతర్జాతీయ సరిహద్దులు దాటి డబ్బు పంపడంలో ఉందని తెలిపారు. సరిహద్దులు దాటి జరిగే చెల్లింపుల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర బ్యాంకు డిజిటల్ కరెన్సీలు (CBDC) వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించవచ్చని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు (Sanjay Malhotra cryptocurrency).
ప్రైవేటు క్రిప్టోకరెన్సీలే అంతర్జాతీయ చెల్లింపుల సమస్యకు ఏకైక పరిష్కారం కాదని అన్నారు (Blockchain technology India). అయితే క్రిప్టోకరెన్సీలను, వాటి వెనుక ఉన్న సాంకేతికతను ఒకేలా చూడకూడదని మల్హోత్రా స్పష్టం చేశారు. క్రిప్టో ఆస్తులకు ఉపయోగించే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ, టోకెనైజేషన్ వంటి వాటిని మరింత అభివృద్ధి చేయడాన్ని భారత్ ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఈ సాంకేతికతల్లో కొన్ని ఇప్పటికే కేంద్ర బ్యాంకులో, అలాగే ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. లీటర్‌కు రూ.5, రూ.3 పెంచిన నయారా ఎనర్జీ
కొడుకును మార్చాలనుకుంది.. చివరకు తానే మారిపోయింది.. ఈ చైనా మహిళ కథేంటంటే..