Share News

మార్కెట్లో ‘మెలోడీ’ మాయ

ABN , Publish Date - May 22 , 2026 | 05:37 AM

స్టాక్‌ మార్కెట్లో వెర్రి వెంగళప్పలు పెరిగిపోతున్నారు. బుధ, గురువారాల్లో పార్లే ఇండస్ట్రీస్‌ షేర్లలో చోటు చేసుకున్న ర్యాలీనే ఇందుకు ఉదాహరణ. ప్రధాని మోదీ తన ఇటలీ పర్యటనలో...

మార్కెట్లో ‘మెలోడీ’ మాయ

పార్లే ఇండస్ట్రీస్‌ షేర్లపై వేలంవెర్రి

ముంబై: స్టాక్‌ మార్కెట్లో వెర్రి వెంగళప్పలు పెరిగిపోతున్నారు. బుధ, గురువారాల్లో పార్లే ఇండస్ట్రీస్‌ షేర్లలో చోటు చేసుకున్న ర్యాలీనే ఇందుకు ఉదాహరణ. ప్రధాని మోదీ తన ఇటలీ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీకి ‘మెలోడీ’ చాక్లెట్ల ప్యాక్‌ను బహుమతిగా ఇచ్చారు. దీంతో అనేక మంది ఇన్వెస్టర్లు రియల్టీ,ఇన్‌ఫ్రా రంగాల్లో కార్యకలాపాలు సాగించే పార్లే ఇండస్ట్రీస్‌ కంపెనీనే ఈ చాక్లెట్లను తయారు చేస్తోందనే వార్తలతో ఆ కంపెనీ షేర్లను వేలంవెర్రిగా కొనేశారు. దీంతో ఫేస్‌వాల్యూ రూ.10 కంటే తక్కువ ధరలో ట్రేడవుతున్న పార్లే ఇండస్ట్రీస్‌ షేర్లు గురువారం బీఎ్‌సఈలో ఏకంగా 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌ను తాకి 4.95 శాతం లాభంతో రూ.5.51 వద్ద ముగిశాయి. నిజానికి ఈ మెలోడీ చాక్లెట్లను పార్లే ఆగ్రో ప్రొడక్ట్స్‌ అనే ఒక అన్‌లిస్టెడ్‌ కంపెనీ తయారు చేస్తోంది. ఈ కంపెనీ పోర్టుఫోలియోలో మెలోడీ చాక్లెట్లతో పాటు పార్లే-జీ, మొనాకో, క్రాక్‌జాక్‌, హైడ్‌ అండ్‌ సీక్‌, కచ్చా మ్యాంగో బైట్‌ సహా మరికొన్ని ఉత్పత్తులు ఉన్నాయి. రిటైల్‌ మదుపరులు ఈ విషయం తెలుసుకోకుండా పార్లే ఇండస్ట్రీస్‌ ఈ చాక్లెట్ల తయారీదారు అనే వార్తలతో సదరు కంపెనీ షేర్ల కోసం ఎగబడ్డారు. దీంతో బీఎ్‌సఈలో గురువారం ఒక్కరోజే ఈ కౌంటర్లో దాదాపు 6.48 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. మొత్తం మీద పెన్నీ స్టాక్‌గా మారుతున్న పార్లే ఇండస్ట్రీస్‌ షేర్లలో ఇరుక్కుపోయిన అనేక మంది రిటైల్‌ ఇన్వెస్టర్లకు వాటిని వదిలించుకునేందుకు చక్కటి అవకాశం ఏర్పడింది. ఎగబడి పార్లే ఇండస్ట్రీస్‌ షేర్లు కొన్న మదుపరులు మాత్రం వెర్రి వెంగళప్పలుగా మిగిలారు.

ఇవి కూడా చదవండి...

దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ

కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్‌ సభ్యులు.. ఏసీ ఆగ్రహం

Read Latest AP News And Telugu News

Updated Date - May 22 , 2026 | 05:49 AM