మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు.. నెస్లే ఇండియా స్పందన ఏంటంటే..
ABN , Publish Date - Jun 13 , 2026 | 02:52 PM
మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలపై నెస్లే ఇండియా సంస్థ స్పందించింది. అవన్నీ నిరాధార ఆరోపణలని స్పష్టం చేసింది.
మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలపై నెస్లే ఇండియా సంస్థ స్పందించింది. అవన్నీ నిరాధార ఆరోపణలని స్పష్టం చేసింది. మ్యాగీ ప్యాకెట్‌లో పురుగులు కనిపించాయని ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరల్ కావడంతో ఈ అంశంపై చర్చ మొదలైంది. భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) ఈ ఫిర్యాదుపై దృష్టి సారించి, సంస్థ నుంచి వివరణ కోరింది (Maggi infestation claim).
తమ ఉత్పత్తులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన ఫైలింగ్‌లో నెస్లే స్పష్టం చేసింది. మ్యాగీ నూడుల్స్‌పై ఆరోపణలు ఒక ధ్రువీకరించని సోషల్ మీడియా ఖాతా నుంచి వచ్చాయని నెస్లే ఇండియా స్పష్టం చేసింది. ఫిర్యాదు చేసిన వ్యక్తిని సంప్రదించి నమూనా పంపించాలని పలుమార్లు కోరినా ఎలాంటి స్పందనా రాలేదని తెలిపింది. దీంతో అసలు ఉత్పత్తి నమూనాను పరిశీలించే అవకాశం లభించలేదని పేర్కొంది (Nestle India Maggi noodles).
ఆరోపణలు వచ్చిన బ్యాచ్‌కు సంబంధించిన రిఫరెన్స్ నమూనాలను నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్‌కు పంపించినట్టు నెస్లే వెల్లడించింది (Maggi quality test). ఆ పరీక్షల్లో ఎలాంటి పురుగులు లేదా ఇతర కలుషిత పదార్థాల ఆనవాళ్లు కనిపించలేదని, ఉత్పత్తి నాణ్యతా ప్రమాణాలకు పూర్తి అనుగుణంగా ఉందని రిపోర్ట్ వచ్చినట్టు కంపెనీ పేర్కొంది. వినియోగదారుల భద్రత, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని కంపెనీ మరోసారి స్పష్టం చేసింది.
ఇవీ చదవండి:
అస్సాంలో కూలిన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం.. పైలట్ మృతి.!
వరుస విజయాలతో దేశ రక్షణ రంగంలో డీఆర్‌డీఓ సరికొత్త చరిత్ర