Share News

ఈసారి 7 శాతం వృద్ధి

ABN , Publish Date - Nov 12 , 2026 | 06:04 AM

ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలకు భారత ఆర్థిక వ్యవస్థపై నమ్మకం పెరుగుతోంది. కొన్ని ఇబ్బందులు ఉన్నా భారత జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం(2026-27) లో ఏడు శాతం...

ఈసారి 7 శాతం వృద్ధి

అంచనాలు పెంచిన మూడీస్‌

న్యూఢిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలకు భారత ఆర్థిక వ్యవస్థపై నమ్మకం పెరుగుతోంది. కొన్ని ఇబ్బందులు ఉన్నా భారత జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం(2026-27) లో ఏడు శాతం మేర పెరిగే అవకాశం ఉందని ‘మూడీస్‌ రేటింగ్స్‌’ బుధవారం విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది. ఇదే సంస్థ గతంలో భారత జీడీపీ వృద్ధి రేటును 6.5 శాతంగా అంచనా వేసింది. ఐఎంఎఫ్‌, ఏడీబీ, ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ సంస్థలు కూడా ఇటీవల తమ నివేదికల్లో ఈ ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థ ఏడు శాతం వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉందని తెలిపాయి. ఆర్‌బీఐ, ఓఈసీడీలు మాత్రం వృద్ధి రేటు 7.1 శాతం వరకు ఉండే అవకాశం ఉందని తెలిపాయి.

కలిసొచ్చే అంశాలు: జోరందుకున్న వినియోగం, గాడిన పడుతున్న ప్రైవేటు పెట్టుబడులు, పటిష్ఠంగా ఉన్న స్థూల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వృద్ధి అంచనాలను పెంచుతున్నట్టు మూడీస్‌ తెలిపింది.

రిస్కులూ ఉన్నాయి: భారత ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ కొన్ని ముప్పులు పొంచి ఉన్నట్టు మూడీస్‌ తెలిపింది. ముఖ్యంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లు మరింత పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. దీంతో ప్రైవేటు పెట్టుబడుల జోరుకు బ్రేక్‌ పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఎల్‌నినో దెబ్బతో వరుణుడు కరుణించకపోవడం భారత ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్న మరో ముప్పు అని తెలిపింది. దీంతో వ్యవసాయ ఉత్పత్తి నీరసించి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌, వినియోగం తగ్గే ప్రమాదం ఉందని అంచనా వేసింది.

క్యూ2లో 7.8 శాతం: ఎస్‌బీఐ రీసెర్చ్‌

ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో (క్యూ2) జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతానికి చేరుకోవచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్‌ ఈమధ్యనే అంచనాలు విడుదల చేసింది. జోరు మీద ఉన్న తయారీ, సేవల రంగాలు, పెరిగిన కంపెనీల లాభాలు, బ్యాంకుల రుణ వితరణ ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్

3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్

For More AP News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 06:05 AM