కంపెనీల లాభాలకు గండి
ABN , Publish Date - Mar 06 , 2026 | 05:27 AM
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు భారత కార్పొరేట్ రంగాన్నీ భయపెడుతున్నాయి. ఈ యుద్ధం కొద్ది వారాలకు మించి కొనసాగితే భారత కంపెనీల ఆదాయాలు, లాభాలకూ...
ముఖం చాటేస్తున్న ఎఫ్‌పీఐలు
ద్రవ్యోల్బణానికీ చమురు మంట
పశ్చిమాసియా యుద్ధంపై
కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్
ముంబై: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు భారత కార్పొరేట్ రంగాన్నీ భయపెడుతున్నాయి. ఈ యుద్ధం కొద్ది వారాలకు మించి కొనసాగితే భారత కంపెనీల ఆదాయాలు, లాభాలకూ గండి పడుతుందని దేశీయ బ్రోకరేజీ సంస్థ కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ హెచ్చరించింది. పెరుగుతున్న ముడిచమురు, గ్యాస్ ధరలు దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు స్టాక్ మార్కెట్లనీ అతలాకుతలం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిణామాలతో మదుపరులు ముఖ్యంగా విదేశీ పోర్టుఫోలియో మదుపరులు (ఎఫ్‌పీఐ) ఇప్పటికే భారత స్టాక్ మార్కెట్‌కు ముఖం చాటేస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ యుద్ధంతో ఇంధన దిగుమతులకు అడ్డంకులు ఏర్పడి భారత స్థూల ఆర్థిక స్థిరత్వం, ముఖ్యంగా కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) అదుపు తప్పే ప్రమాదం ఉందన్న భయాలే ఇందుకు కారణమని కోటక్ పేర్కొంది.
చమురు సెగే ప్రధాన సమస్య: పశ్చిమాసియా తాజా పరిణామాలతో చమురు దిగుమతుల బిల్లు పెరిగి దేశంలో ద్రవ్యోల్బణం కోరలు చాచే ప్రమాదం ఉందని కోటక్ హెచ్చరించింది. అదే జరిగితే ముడి పదార్ధాల ఖర్చులు పెరిగి కంపెనీల ఆదాయాలు, లాభాలకు గండి తప్పదని స్పష్టం చేసింది. అయితే అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉన్నా స్వల్ప,మధ్యకాలికంగా చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్‌ను స్థానిక పెట్టుబడులు, ఆకర్షణీయంగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు కొంత వరకు ఆదుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.
మాదీ అదే మాట: ఇరాన్ వారం రోజులకు మించి హోర్ముజ్ జలసంధిని మూసివేస్తే చమురు, గ్యాస్ సరఫరాలతో పాటు ఎరువులు, ప్రధాన ముడి పదార్ధాల దిగుమతులు సహా నిర్మాణ రంగ వస్తువులు, వజ్రాల వంటి ఎగుమతులకూ ముప్పు తప్పదని జీటీఆర్‌ఐ హెచ్చరించింది. చమురు సరఫరాలకు ఆటంకం ఏర్పడితే వాటి ధరలు పెరిగి ఆ ప్రభావం ఇతర రంగాలకూ విస్తరించి ద్రవ్యోల్బణం కోరలు చాచే ప్రమాదం ఉందని క్రిసిల్ హెచ్చరించింది.
మళ్లీ రష్యా చమురు: తాజా పరిణామాల నేపథ్యంలో భారత రిఫైనరీలు మళ్లీ రష్యా చమురు దిగుమతులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తూర్పు ఆసియా దేశాల వైపు ప్రయాణిస్తున్న మూడు రష్యా ఆయిల్ ట్యాంకర్లు ఆకస్మికంగా భారత రేవులకు చేరడం ఈ వార్తలను మరింత బలపరుస్తోంది. ఈ మూడు నౌకల్లో 14 లక్షల బ్యారళ్ల చమురు ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా ఒత్తిడి ఎలా ఉన్నా ప్రస్తుతం రష్యా చమురు తప్ప ప్రభుత్వానికి మరో మార్గం కనిపించడం లేదు.
ఫార్మాపై రూ.5,000 కోట్ల భారం!
పశ్చిమాసియా తాజా పరిణామాలు దేశీయ ఫార్మా కంపెనీలనూ భయపెడుతున్నాయి. హోర్ముజ్ జలసంధి మూసివేతతో గల్ఫ్ (జీసీసీ) దేశాలతో పాటు ఆ పరిసర దేశాలకు జరిగే ఫార్మా ఎగుమతులు, అక్కడి నుంచి వచ్చే కొన్ని ముడి పదార్ధాల దిగుమతులు ఆగిపోయాయి. దీంతో దేశీయ ఫార్మా కంపెనీలు ఈ నెలలో రూ.2,500 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల వరకు నష్టపోయే ప్రమాదం ఉందని భారత ఫార్మాస్యూటికల్ ఎగుమతుల ప్రోత్సాహక కౌన్సిల్ (ఫార్మెక్సిల్) చైర్మన్ నమిత్ జోషి చెప్పారు. ఒక్కో కంటైనర్‌కు రవాణా చార్జీల కిందే 4,000 డాలర్ల నుంచి 8,000 డాలర్ల వరకు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ప్రభుత్వం రవాణ చార్జీల్లో కొంత సబ్సిడీగా అందించాలని కోరారు.
ఇవి కూడా చదవండి...
లేట్ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన
అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
Read Latest AP News And Telugu News