మెటాలో కలకలం.. వర్క్ ఫ్రం హోం ఇచ్చి.. తరువాత లేఆఫ్స్..
ABN , Publish Date - May 20 , 2026 | 11:26 AM
మెటాలో మరోసారి లేఆఫ్స్ కలకలం రేగింది. ఈసారి దాదాపు 8 వేల మంది లేఆఫ్స్‌కు గురైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: మొదట ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. ఆ తరువాత సైలెంట్‌గా తొలగింపు.. లేఆఫ్స్ కోసం ఈసారి టెక్ దిగ్గజం మెటా ఇదే వ్యూహాన్ని అమలు చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈసారి దాదాపు 8 వేల మంది మెటా ఉద్యోగులపై వేటుపడినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ఉద్యోగులకు ఎప్పటిలాగే తెల్లవారుజామున ఈ లేఆఫ్స్ నోటీసులు అందాయి. మొదటగా సింగపూర్ ఉద్యోగులకు ఈమెయిల్స్ వెళ్లాయి. ఆ తరువాత యూఎస్, బ్రిటన్ ఉద్యోగులకు కూడా ఈ షాకింగ్ వార్త చేరింది. తాజా విడతలో జాబ్స్ కోల్పోయిన వారి సంఖ్య మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం వరకూ ఉంటుందని సమాచారం. మిగిలిన వారిని ఏఐ ఆధారిత విభాగాలకు బదిలీచేశారు. తాజా లేఆఫ్స్‌కు మునుపు మెటాలో ప్రపంచవ్యాప్తంగా 78 వేల మంది ఉద్యోగులు ఉండేవారు.
లేఆఫ్స్‌కు సంబంధించి సంస్థ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ గేల్ ఉద్యోగులకు ఒక అంతర్గత మెమోను పంపించారు. వేల సంఖ్యలో జాబ్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టినట్టు చెప్పారు. మరో 7 వేల మందిని ఏఐ నేటివ్ విభాగాలకు బదలీ చేసినట్టు చెప్పారు. తక్కువ మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి సంస్థ చేరుకుందని కూడా అన్నారు. ఈసారి లేఆఫ్స్ ప్రభావం ఇంజనీరింగ్, ప్రాడక్ట్ విభాగాలపై ఎక్కువగా పడింది. ఈ ఏడాది మరిన్ని లేఆఫ్స్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏఐ కేంద్రంగా సంస్థలో మార్పులు తీసుకొస్తున్నట్టు మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవలే ప్రకటించారు. ఈ ఏడాది ఏఐపై తాము 145 బిలియన్ డాలర్ల వరకూ పెట్టుబడి పెట్టబోతున్నట్టు చెప్పారు.
లేఆఫ్స్ తప్పవని మెటా గతనెలలోనే ప్రకటించింది. దీంతో, ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతిందన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఇదిచాలదన్నట్టు ఏఐ శిక్షణ కోసం సంస్థలో వినియోగిస్తున్న ఒక కొత్త సాధనంపై కూడా ఉద్యోగుల్లో అసంతృప్తులు వెల్లువెత్తాయి. ఉద్యోగుల కీబోర్డు టైపింగ్, మౌస్ కదలికలను సేకరించి ఏఐకి శిక్షణ ఇచ్చే ఈ టూల్‌కు వ్యతిరేకంగా వెయ్యికి పైగా ఉద్యోగులు ఒక అంతర్గత పిటిషన్‌పై సంతకాలు చేశారు. మరోవైపు, ఈసారి లేఆఫ్స్‌పై వ్యతిరేకతను తగ్గించేందుకు ముందుగా తమను వర్క్ ఫ్రం హోం పేరిట ఆఫీసుల నుంచి పంపించి ఆపై తొలగింపులకు దిగినట్టు కొందరు ఉద్యోగులు భావిస్తున్నారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తలనూ చదవండి:
అంచనాకు అందని రీతిలో బంగారం, వెండి ధరల్లో మార్పులు
భారత కార్పొరేట్ దిగ్గజాలకు షాక్.. టాప్ 100 నుంచి అవుట్