టాప్ 100 నుంచి అవుట్
ABN , Publish Date - May 20 , 2026 | 05:51 AM
గడిచిన ఏడాదిన్నర కాలంగా భారత స్టాక్ మార్కెట్లు క్షీణిస్తూ వస్తున్నాయి. దాంతో ప్రపంచంలోని అత్యంత విలువైన 100 లిస్టెడ్ కంపెనీల జాబితాలో భారత దిగ్గజ సంస్థలన్నీ స్థానం...
ప్రపంచంలోని అత్యంత విలువైన వంద కంపెనీల జాబితాలో స్థానం కోల్పోయిన భారత దిగ్గజాలు
స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడమే కారణం
న్యూఢిల్లీ: గడిచిన ఏడాదిన్నర కాలంగా భారత స్టాక్ మార్కెట్లు క్షీణిస్తూ వస్తున్నాయి. దాంతో ప్రపంచంలోని అత్యంత విలువైన 100 లిస్టెడ్ కంపెనీల జాబితాలో భారత దిగ్గజ సంస్థలన్నీ స్థానం కోల్పోయాయి. గడిచిన కొన్నేళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. బ్లూంబర్గ్ డేటా ప్రకారం.. 2025 ఆరంభంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 74, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 84, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 97వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది ప్రారంభం నాటికి టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బయటికొచ్చేశాయి. తాజాగా రిలయన్స్ స్థానం కూడా గల్లంతైంది. 2026 ప్రారంభంలో 73వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం 105వ స్థానానికి పరిమితమైంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 190వ స్థానానికి, టీసీఎస్ 314వ స్థానానికి జారుకున్నాయి.
టెక్ కంపెనీల భారీ ఫాల్: భారత టెక్నాలజీ కంపెనీల ర్యాంకింగ్ భారీగా క్షీణించింది. టీసీఎస్ అతిపెద్ద ఫాల్‌ను చవిచూసింది. 2025 ప్రారంభంలో 84వ స్థానంలో ఉన్న టీసీఎస్.. 2026 ఆరంభం నాటికి 171వ స్థానానికి, ప్రస్తుతం 314వ స్థానానికి పడిపోయింది. ఇన్ఫోసిస్ కూడా 2025 తొలి నాళ్లలో 198వ స్థానంలో ఉండగా.. 2026 నాటికి 330వ స్థానానికి జారుకుంది. ప్రస్తుతం 590వ స్థానానికి పడిపోయింది.
టాప్-500లోనూ తగ్గిన ఇండియా కంపెనీల సంఖ్య: మార్కెట్ విలువపరంగా ప్రపంచంలోని టాప్-500 లిస్టెడ్ కంపెనీల్లో భారత సంస్థల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. 2025 ప్రారంభం నాటికి 15 కంపెనీలుండగా.. 2026లో ఈ సంఖ్య 13కు తగ్గింది. ప్రస్తుతం 9కి పడిపోయింది.
100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో మూడే: భారత్‌లో 100 బిలియన్ డాలర్ల (10,000 కోట్ల డాలర్లు= రూ.9.65 లక్షల కోట్లు) మార్కెట్ విలువ కంపెనీలు 2026 ప్రారంభంలో ఆరు ఉండగా.. ఇప్పుడా సంఖ్య 3కు తగ్గింది. ఈ ఏడాదిలో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, టీసీఎస్ ఈ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో స్థానం కోల్పోయాయి. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ (198 బిలియన్ డాలర్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (124 బిలియన్ డాలర్లు), ఎయిర్‌టెల్ (113 బిలియన్ డాలర్లు) మాత్రమే ఇందులో ఉన్నాయి.
ఎన్‌విడియా ప్రపంచ నం.1
అమెరికాకు చెందిన ఏఐ చిప్‌ల తయారీ దిగ్గజం ఎన్‌విడియా 5.33 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఉంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ (4.7 లక్షల కోట్ల డాలర్లు), ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ (4.3 లక్షల కోట్ల డాలర్లు) వరుసగా 2, 3వ స్థానాల్లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై దాడి వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన
పాపం పాకిస్థాన్.. భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిందట..