Share News

8 వేల మంది తొలగింపు.. మెటా అధినేత కీలక ప్రకటన

ABN , Publish Date - May 21 , 2026 | 01:03 PM

ఈ ఏడాదిలో లేఆఫ్స్ ఇక ఉండబోవని మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. ఇటీవల 8 వేల మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురైన నేపథ్యంలో మిగిలిన వారిని ఉద్దేశిస్తూ ఒక మెమోను పంపించారు.

8 వేల మంది తొలగింపు.. మెటా అధినేత కీలక ప్రకటన
Meta Chief Says No More Layoffs

ఇంటర్నెట్ డెస్క్: మెటాలో 8 వేల మంది ఉద్యోగుల తొలగింపు కలకలానికి దారి తీసింది. మరోసారి లేఆఫ్స్ ఉంటాయన్న వార్తలతో మిగిలిన ఉద్యోగులు బెంబేలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఏడాది కంపెనీ వ్యాప్తంగా ఎలాంటి భారీ స్థాయి లేఆఫ్స్ ఉండవని చెప్పారు. లేఆఫ్స్ నిర్ణయం తనపైనా ప్రభావం చూపించిందని అన్నారు. కంపెనీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన వారికి వీడ్కోలు పలకడం ఆవేదన కలిగించిందని చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుకెళ్లేందుకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టు చెప్పారు.

కృత్రిమే మేధ ప్రపంచాన్ని మార్చేస్తోందని కూడా మెటా అధినేత అంగీకరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెటా లాంటి విజయవంతమైన సంస్థ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు ఉద్యోగులకు అంతర్గత మెమోను పంపించారు.


మెటాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మంది ఈసారి ఉద్వాసనకు గురయ్యారు. మరో 7 వేల మందిని ఇతర విభాగాలకు బదిలీ చేశారు. అంతేకాకుండా, సంస్థలో 6 వేల ఉద్యోగఖాళీల భర్తీని కూడా మెటా వాయిదా వేసినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఏఐకి తొలిప్రాధాన్యం ఇచ్చేలా సంస్థను పునర్ వ్యవస్థీకరిస్తామని జుకర్‌బర్గ్ గతంలోనే ప్రకటించారు. ఈ ఏడాది ఏఐపై 145 బిలియన్ డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్టు కూడా ఇటీవల తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడూ అదే ట్రెండ్

ఎఫ్‌ఎంసీజీకి చమురు గండం

Updated Date - May 21 , 2026 | 01:14 PM