Share News

జియో కొత్త ఆఫర్‌.. పాత కంప్యూటర్‌ ఇకపై కొత్త దానిలా..

ABN , Publish Date - Sep 03 , 2026 | 07:02 PM

పాత ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ను కొత్త హార్డ్‌వేర్‌ కొనకుండానే క్లౌడ్‌ పీసీగా మార్చుకునే సేవను జియో తీసుకొచ్చింది. ‘జియోపీసీ’తో తక్కువ ఖర్చుతో పాత కంప్యూటర్‌ను మరింత కాలం ఉపయోగించుకోవచ్చు.

జియో కొత్త ఆఫర్‌.. పాత కంప్యూటర్‌ ఇకపై కొత్త దానిలా..
JioPC Launch

ఇంటర్నెట్ డెస్క్: పాత ల్యాప్‌టాప్‌ లేదా డెస్క్‌టాప్‌ తోనే క్లౌడ్‌ పీసీని ఉపయోగించుకునే సదుపాయాన్ని రిలయన్స్‌ జియో తీసుకొచ్చింది. ‘జియోపీసీ (JioPC)’ పేరుతో సబ్‌స్క్రిప్షన్‌ సేవను ప్రారంభించింది. దీని ద్వారా కొత్త హార్డ్‌వేర్‌ కొనకుండానే పాత ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌, టీవీని కూడా క్లౌడ్‌ ఆధారిత కంప్యూటర్‌గా ఉపయోగించుకోవచ్చు. ఈ సేవ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులో ఉంది.


జియోపీసీ ఎలా పనిచేస్తుంది?

సాధారణ కంప్యూటర్‌లోనే ప్రాసెసింగ్‌, స్టోరేజ్‌ వంటి పనులు జరుగుతాయి. అయితే జియోపీసీలో ఎక్కువ కంప్యూటింగ్‌ పనులు జియో క్లౌడ్‌లో జరుగుతాయి. మన దగ్గర ఉన్న ల్యాప్‌టాప్‌ లేదా డెస్క్‌టాప్‌ కేవలం క్లౌడ్‌ పీసీని ఉపయోగించుకునే పరికరంగా పనిచేస్తుంది. దీంతో పాత కంప్యూటర్‌లో ర్యామ్‌, స్టోరేజ్‌ వంటి హార్డ్‌వేర్‌ను మార్చాల్సిన అవసరం ఉండదు. గతంలో జియోపీసీ సేవ కేవలం జియోహోమ్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఏ టెలికాం లేదా బ్రాడ్‌బ్యాండ్‌ సంస్థకు చెందిన ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్న వారైనా జియోపీసీని వినియోగించుకోవచ్చు.


జియోపీసీ ప్రస్తుతం రెండు ప్లాన్‌లను అందిస్తోంది.

  • జియోపీసీ స్టాండర్డ్‌:

  • 8GB RAM

  • 500GB క్లౌడ్‌ స్టోరేజ్‌

  • 2 నెలలకు రూ.1,000

  • 5 నెలలకు రూ.2,000

  • 10+2 నెలలకు రూ.4,000


జియోపీసీ అల్ట్రా:

  • 16GB RAM

  • 1TB క్లౌడ్‌ స్టోరేజ్‌

  • 2 నెలలకు రూ.1,200

  • 5 నెలలకు రూ.2,500

  • 10+2 నెలలకు రూ.5,000

జియో ప్రకారం జియోపీసీని ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలోనే సెటప్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం కంప్యూటర్‌లో కొత్త హార్డ్‌వేర్‌ అమర్చాల్సిన అవసరం లేదు. అలాగే ప్రస్తుతం ఉన్న డేటాను మరో పరికరానికి మార్చాల్సిన పని కూడా ఉండదు.

టీవీని కూడా పీసీగా ఉపయోగించొచ్చు

జియోపీసీని ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌లకే పరిమితం చేయలేదు. సపోర్ట్‌ చేసే వెబ్‌ బ్రౌజర్‌ ద్వారా ఈ సేవను ఉపయోగించుకోవచ్చు. కీబోర్డ్‌, మౌస్‌తో పాటు జియో సెట్‌టాప్‌ బాక్స్‌ సాయంతో టీవీలోనూ జియోపీసీని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అంటే టీవీని కూడా ఒక సాధారణ కంప్యూటర్‌లా ఉపయోగించుకోవచ్చు.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

నిద్రలో చెమటలు పడుతున్నాయా? కారణం ఇదే కావచ్చు!

గ్యాస్‌, గుండెపోటు మధ్య తేడా ఏంటి? ఈ విషయాలు తెలుసుకోండి

Updated Date - Sep 03 , 2026 | 07:02 PM