జియో రూ.37,700 కోట్ల ఐపీఓ
ABN , Publish Date - Jun 20 , 2026 | 05:17 AM
రిలయన్స్ ఇండస్ట్రీ్‌సకు చెందిన టెలికాం, డిజిటల్ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కు రాబోతోంది. కంపెనీ బోర్డు నుంచి ఆమోదం లభించిన...
దేశంలో ఇదే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ!
బోర్డు ఆమోదం అనంతరం సెబీకి పత్రాలు సమర్పించిన సంస్థ
27 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల జారీ
రూ.13 లక్షల కోట్లకు కంపెనీ విలువ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీ్‌సకు చెందిన టెలికాం, డిజిటల్ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కు రాబోతోంది. కంపెనీ బోర్డు నుంచి ఆమోదం లభించిన అనంతరం ఐపీఓకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాల (డీఆర్‌హెచ్‌పీ)ను శుక్రవారం సమర్పించింది. ఐపీఓలో భాగంగా కంపెనీ 27 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు డీఆర్‌హెచ్‌పీలో జియో వెల్లడించింది. ప్రస్తుత వాటాదారులు కూడా తమ వాటా నుంచి కొన్ని షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) పద్ధతిన విక్రయించనున్నారు. మొత్తంగా ఐపీఓ ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్ 400 కోట్ల డాలర్ల (దాదాపు రూ.37,700 కోట్లు) వరకు సమీకరించే అవకాశం ఉందని సమాచారం. అంటే, దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద కానుంది. బుధవారం నాడు సెబీకి ఐపీఓ పత్రాలు సమర్పించిన ఎన్‌ఎ్‌సఈ.. రూ.30,000 కోట్ల వరకు సేకరించనున్నట్లు తెలిపింది.
ఐపీఓలో భాగంగా జియో ప్లాట్‌ఫామ్ మార్కెట్ విలువను దాదాపు 13,700 కోట్ల డాలర్ల (రూ.12.95 లక్షల కోట్లు) స్థాయిలో లెక్కించే అవకాశాలున్నాయి. అంటే, రిలయన్స్ జియో తర్వాత రెండో అతిపెద్ద టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.11.63 లక్షల కోట్ల కంటే అధికం. కాగా, ఐపీఓలో తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా సమకూరే నిధులను కంపెనీకున్న రూ.27,500 కోట్ల రుణాలను తిరిగి చెల్లించటంతో పాటు ఇతర వ్యాపార నిర్వహణ అవసరాలకు ఉపయోగించుకోనున్నట్లు జియో ప్లాట్‌ఫామ్స్ వెల్లడించింది. ఐపీఓ కోసం కంపెనీ 19 మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలను నియమించుకుంది. కాగా, ఎన్‌ఎ్‌సఈ తన ఐపీఓ కోసం అత్యధికంగా 20 మర్చంట్ బ్యాంకర్లను నియమించుకుంది.
జియో ప్లాట్‌ఫామ్స్ 2020లో మెటాకు 9.99 శాతం వాటా విక్రయం ద్వారా రూ.43,574 కోట్లు, గూగుల్‌కు 7.73 శాతం వాటా విక్రయం ద్వారా రూ.33,737 కోట్లు సమీకరించింది. అలాగే, కేకేఆర్, టీపీజీ, జనరల్ అట్లాంటిక్, ముబదాల, ఏడీఐఏ, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, క్వాల్‌కామ్ సహా పలు అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలకు మొత్తం 15.2 శాతం వాటా విక్రయం ద్వారా రూ.74,745 కోట్లు సేకరించింది. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 66.43 శాతం వాటా కలిగి ఉంది.
ఇవి కూడా చదవండి...
హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి
వాన్‌పిక్ ఆస్తుల వ్యవహారం.. హైకోర్టులో ఈడీ పిటిషన్ డిస్మిస్
Read Latest Telangana News And Telugu News