Share News

బీమా మోసాలతో జర జాగ్రత్త

ABN , Publish Date - Sep 20 , 2026 | 04:41 AM

ఈ రోజుల్లో జీవిత బీమా పాలసీలను కొనడం, వాటిని నిర్వహించుకోవడం చాలా సులభంగా మారిపోయింది. ఎప్పుడూ చేతిలో ఉండే మొబైల్‌ ఫోన్‌ ద్వారా బీమా పాలసీలను ఎప్పుడంటే అప్పుడు...

బీమా మోసాలతో జర జాగ్రత్త

ఈ రోజుల్లో జీవిత బీమా పాలసీలను కొనడం, వాటిని నిర్వహించుకోవడం చాలా సులభంగా మారిపోయింది. ఎప్పుడూ చేతిలో ఉండే మొబైల్‌ ఫోన్‌ ద్వారా బీమా పాలసీలను ఎప్పుడంటే అప్పుడు కొనొచ్చు. పాలసీల ప్రీమియంలను చెల్లించవచ్చు. అలాగే తమ వివరాల్లో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే చేయవచ్చు. అయితే ఇలాంటి డిజిటల్‌ సౌలభ్యమే సైబర్‌ మోసగాళ్లకు అవకాశాలను కల్పిస్తోంది. ఈ మోసగాళ్లు నకిలీ కాల్స్‌, మెసేజ్‌లు, వెబ్‌సైట్లు, చెల్లింపుల లింక్‌లు వంటి వాటిని వినియోగిస్తూ పాలసీదారులను బుట్టలో వేసుకుంటారు. ఇలాంటి మోసగాళ్ల వలలో చిక్కితే పాలసీదారులు తమ డబ్బును కోల్పోయే ప్రమాదం ఏర్పడవచ్చు. మీ మొబైల్‌ ఫోన్‌కు వారు పంపే వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ), పాస్‌వర్డ్‌లు, బ్యాంకు ఖాతాల వివరాలు లేదా పాలసీకి సంబంధించిన వివరాలను వారితో పంచుకుంటే ఆర్థికంగా మరింతగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ మోసగాళ్లు ఏం చేస్తారంటే..

పాలసీ పునరుద్ధరణ, బోనస్‌ పేరుతో..

కేటుగాళ్లు పాలసీదారులకు ఫోన్‌ చేసి మీ పాత లేదా యాక్టివ్‌గా లేని పాలసీకి బోనస్‌ లేదా ఇతర ప్రయోజనం వచ్చినట్టు చెప్పవచ్చు. ఆ సొమ్మును విడుదల చేయడానికి లేదా పాలసీని పునరుద్ధరించడానికి కొంత సొమ్ము చెల్లించమని అడగవచ్చు. ఫోన్‌ చేసే వారు పాలసీకి సంబంధించిన కొన్ని ప్రాథమిక వివరాలను చె ప్పి నమ్మించే ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ వారు వెంటనే కొంత మొత్తం చెల్లించాలని పదేపదే ఒత్తిడి చేస్తే మాత్రం అనుమానించాల్సిందే. గుడ్డిగా వారు చెప్పినంత సొమ్ము చెల్లిస్తే అంతే సంగతి. అప్రమత్తంగా వ్యవహరించి మీ బీమా సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ లేదా కస్టమర్‌ సర్వీసు నంబరును సంప్రదించి మీ పాలసీకి సంబంధించి ఏమైనా చెల్లింపులు చేయాల్సి ఉన్నదేమో చూసుకోవాలి.

నకిలీ కాల్స్‌ చేస్తూ..

నియంత్రణ సంస్థలు లేదా ప్రభుత్వ అధికారులమంటూ మోసగాళ్లు చెప్పి పాలసీదారుడి బీమా రికార్డులను వెరిఫికేషన్‌ చేయాల్సి ఉందని, లేదా తమకు కొంత డబ్బు రావాల్సి ఉందంటూ ఫోన్‌ కాల్స్‌ చేయవచ్చు. అయితే వారు చెప్పుకునే హోదాను బట్టి ఇలాంటి కాల్స్‌ను పాలసీదారులు నమ్మే అవకాశం ఉండవచ్చు. కాలర్‌ ఐడీ, ఫోన్‌ నంబరు లేదా వారు పంపే పత్రాలను చూసి గుడ్డిగా నమ్మొద్దు. ఎవరైనా తాము నియంత్రణ సంస్థకు చెందిన అధికారిని అని చె ప్పినట్టయితే కాస్త ఆలోచించాల్సిందే. వారితో ఏదైనా సమాచారాన్ని పంచుకునే ముందు లేదా చెల్లింపులు చేసే ముందు ఆ నియంత్రణ సంస్థ అధికారిక మార్గాల ద్వారా ధ్రువీకరించుకోవాలి.


బీమా కంపెనీ అధికారులమంటూ..

పాలసీదారుకు సంబంధించిన బీమా కంపెనీ ఉద్యోగినని చెప్పి కూడా మోసానికి పాల్పడవచ్చు. ప్రస్తుత పాలసీలో సమస్య ఉందని, పాలసీని సరెండర్‌ చేసి డబ్బు పొందవచ్చని లేదా ఎక్కువ రాబడినిచ్చే పాలసీని మారవ వచ్చంటూ మోసగాళ్లు చెప్పే అవకాశం ఉంది. ఈ తరుణంలో కస్టమర్‌కు ఒక లింక్‌, ఫారమ్‌ లేదా చెల్లింపునకు సంబంధించిన అభ్యర్థనను పంపవచ్చు. కొంత మంది మోసగాళ్లు మాటల్లో పెట్టి కస్టమర్‌కు సంబంధించిన పాలసీ సమాచారాన్ని లేదా ఇతర రహస్య సమాచారాన్ని కూడా కొరవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.

రుణాలు, ప్రయోజనాల మాటున..

బీమా పాలసీలకు సంబంధించిన రుణాలు, ప్రత్యేక ప్రయోజనాలు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాల పేరుతో మోసగాళ్లు పాలసీదారులను ఆకర్షించవచ్చు. వాట్సాప్‌ మెసేజ్‌లు, ఎస్‌ఎంఎ్‌సలు, సోషల్‌ మీడియా ప్రకటనలు లేదా ఈమెయిల్స్‌ ద్వారా ఇలాంటి ఆఫర్లు రావచ్చు. చట్టబద్ధమైన బీమా సంస్థ, బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ పేరు, బ్రాండింగ్‌ను వాడి నమ్మించే ప్రయత్నం చేయవచ్చు. సదరు ప్రయోజనాన్ని పొందడానికి కస్టమర్‌ ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలని, పత్రాలను పంపాలని లేదా తాము పంపే లింక్‌ను క్లిక్‌ చేయాలని కోరవచ్చు. అయితే ఇలాంటి ఆఫర్లకు స్పందించే ముందు వాస్తవాలను నిర్ధారించుకునేందుకు బీమా సంస్థను నేరుగా సంప్రదించడం మంచిది.

పాలసీదారులు ఏం చేయాలంటే..

డిజిటల్‌ బీమా మోసాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే.. ఎక్కడి నుంచో వచ్చిన మెసేజ్‌ల్లో ఉండే లింక్‌ల జోలికి వెళ్లవద్దు. వాటిని క్లిక్‌ చేయవద్దు. మీకు ఏమైనా సమాచారం కావాలనుకుంటే నేరుగా మీ బీమా సంస్థ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌లను వినియోగించుకోండి. చట్టబద్ధమైన బీమా సంస్థలు ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు లేదా బ్యాంకింగ్‌ వివరాలను కాల్‌ చేసి లేదా మెసేజ్‌ల ద్వారా కోరవని కస్టమర్లు గుర్తించాలి. బీమా పాలసీని పునరుద్ధరించడానికి లేదా ఏదైనా ప్రయోజనాన్ని విడుదల చేయడానికి లేదా రుణాన్ని ప్రాసెస్‌ చేయడానికి చెల్లింపులు చేయాలని ఎవరైనా కోరినట్లయితే మీ బీమా సంస్థను ఒకసారి సంపద్రించి చెక్‌ చేసుకోండి. ఏదైనా మెసేజ్‌ లేదా కాల్‌ అనుమానాస్పదంగా అనిపిస్తే అధికారిక కస్టమర్‌ సపోర్ట్‌ ద్వారా బీమా సంస్థ దృష్టికి తీసుకువెళ్లడం మంచిది. మోసగాళ్లు నానా మార్గాలను అనుసరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తతే శ్రీరామరక్ష.


ఫిషింగ్‌, నకిలీ వెబ్‌సైట్లు

అసలైన బీమా సంస్థలకు చెందిన వెబ్‌సైట్లు, చెల్లింపు లింక్‌ల లాగే మోసగాళ్లు రూపొందించిన నకిలీ వెబ్‌సైట్లు, చెల్లింపుల లింక్‌లు ఉండవచ్చు. లింక్‌లను పంపి ప్రీమియం చెల్లించాలని లేదా తమ పాలసీ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని లేదా వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని కోరవచ్చు. ఒకవేళ పాలసీదారులు సదరు లింక్‌ను క్లిక్‌ చేస్తే లాగిన్‌ వివరాలు, కార్డు వివరాలు, బ్యాంకు సమాచారం లేదా ఓటీపీలను సేకరించేందుకు రూపొందించిన మోసపూరిత వెబ్‌సైట్‌కు వెళ్లే అవకాశం ఉండవచ్చు. కాబట్టి ఇలాంటి లింక్‌ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

ఇవి కూడా చదవండి...

రహస్య వివాహం.. కొద్దిరోజులకే భార్యకు షాక్

బీజేపీ న్యాయ పోరాటం వల్లే దానంపై అనర్హత వేటు: కిషన్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 04:41 AM