Indian Pharma Exports: ఫార్మా ఎగుమతులు రూ.1.84 లక్షల కోట్లు
ABN , Publish Date - Jan 19 , 2026 | 02:51 AM
Indian Pharma Exports Touch Rupees 1 Lakh 84 Thousand Crore
కీలక మార్కెట్లుగా నైజీరియా, బ్రెజిల్
న్యూఢిల్లీ: సుంకాల పోటు ఉన్నా భారత ఫార్మా ఎగుమతులు జోరందుకున్నాయి. ప్రస్తు త ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి ఎనిమిది నెలల్లోనే ఈ ఎగుమతులు 2,048 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1.84 లక్షల కోట్లు) చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది ఆరున్నర శాతం ఎక్కువని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు చెప్పాయి. నైజీరియా, బ్రెజిల్ దేశాలకు ఎగుమతులు మరింత వేగం పుంజుకున్నాయి. గత ఏడాది ఏప్రిల్-నవంబరు మధ్య కాలంలో మన దేశం నుంచి నైజీరియా 17.9 కోట్ల డాలర్లు, బ్రెజిల్ 10 కోట్ల డాలర్ల విలువైన ఔషధాలను దిగుమతి చేసుకున్నాయి. ప్రస్తుతం మన దేశ ఫార్మా ఎగుమతుల్లో నైజీరియా వాటా 14 శాతానికి చేరింది.
అమెరికాదే పెద్ద వాటా
ట్రంప్ సుంకాల భయం ఉన్నప్పటికీ ఆ ప్రభావం అమెరికాకు జరిగే మన ఫార్మా ఎగుమతులపై ఏమాత్రం పడలేదు. దీంతో గత ఏడాది ఏప్రిల్-నవంబరు మధ్య కాలంలో మన మొత్తం ఫార్మా ఎగుమతుల్లో 31 శాతం వాటాతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం అభివృద్ధి చెందిన ఫ్రాన్స్, నెదర్లాండ్, కెనడా, జర్మనీ, దక్షిణాఫ్రికా వంటి దేశాలూ భారత్ నుంచి పెద్ద మొత్తంలో ఔషధాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో నెదర్లాండ్‌కు భారత ఫార్మా ఎగుమతులు, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 5.8 కోట్ల డాలర్లు పెరిగినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ వృద్ధి రేటు ఇలానే కొనసాగితే గత ఆర్థిక సంవత్సరం నమోదైన 3,047 కోట్ల డాలర్లతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మన ఫార్మా ఎగుమతులు 9 నుంచి 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అంచనా.
ఈ వార్తలు కూడా చదవండి..
అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
మేడారంలో కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
For More TG News And Telugu News