యూఎస్‌లో 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధమైన భారతీయ కంపెనీలు
ABN , Publish Date - May 06 , 2026 | 05:06 PM
అమెరికాలో 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు భారతీయ కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో భారీ పెట్టుబడులకు భారతీయ కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయని అమెరికా రాయబారి సెర్గియో గోర్ బుధవారం తెలిపారు. టెక్నాలజీ, ఫార్మా, తయారీ రంగాల్లో పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. ఈ మేరకు ప్రతిపాదనలు వచ్చాయని అన్నారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం మరింత బలపడుతోందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు అమెరికాలోకి తిరిగి వస్తున్నాయని అన్నారు.
ఇటీవలి సెలక్ట్ యూఎస్‌ఏ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో 12 భారతీయ సంస్థలు యూఎస్‌లో 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు ఇచ్చాయి. ఈ భాగస్వామ్యాలతో అమెరికాలో అసలైన ఉద్యోగాల సృష్టి జరుగుతోందని సెర్గియో గోర్ అన్నారు. సప్లై చైన్స్ మరింత బలోపేతం అవుతాయని అన్నారు. అతి పెద్ద ప్రజాస్వామిక దేశాలు కలిసి పని చేస్తే గెలుపు అందరినీ వరిస్తుందనే విషయం మరోసారి రుజువైందని ఆయన వ్యాఖ్యానించారు. మే 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ అమెరికా వాణిజ్య శాఖ ఏర్పాటు చేసిన ఈ శిఖరాగ్ర సమావేశంలో పలు కంపెనీలు యూఎస్‌లోని ఎయిరోస్పేస్, డిఫెన్స్, ఇంధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.
ఈ సమావేశాలపై అమెరికా వాణిజ్య శాఖ (అంతర్జాతీయ వాణిజ్యం) అండర్ సెక్రటరీ విలియమ్ కిమ్మిట్ కూడా స్పందించారు. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో భారతీయ ప్రైవేటు సంస్థలు మునుపెన్నడూ చూడని స్థాయిలో పాల్గొన్నాయని అన్నారు.
ఇక రాయబారి సెర్గియో గత నెలలో భారత్‌లోని బోర్డ్ ఆఫ్ అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్‌తో కూడా సమావేశమయ్యారు. ఇరు దేశాల వాణిజ్య బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 2030 కల్లా 500 బిలియన్ డాలర్లకు చేర్చడమే తమ లక్ష్యమని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
కిరణ్ మజుందార్ వారసురాలిగా క్లేర్
జేఎల్‌ఆర్ కార్ల ధరలు రూ.75 లక్షల వరకు తగ్గింపు