కిరణ్ మజుందార్ వారసురాలిగా క్లేర్
ABN , Publish Date - May 06 , 2026 | 04:43 AM
ప్రముఖ బయోఫార్మా కంపెనీ బయోకాన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా తన వారసురాలిని ప్రకటించారు. తన మేనకోడలు...
మేన కోడలికి భవిష్యత్‌లో బయోకాన్ పగ్గాలు
బెంగళూరు: ప్రముఖ బయోఫార్మా కంపెనీ బయోకాన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా తన వారసురాలిని ప్రకటించారు. తన మేనకోడలు (సోదరుడు రవి మజుందార్ కూతురు) క్లేర్ మజుందార్‌కు బయోకాన్ పగ్గాలను అప్పగించనున్నట్లు ఫార్చ్యూన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. అయితే, తాను ఇప్పుడే బాధ్యతల నుంచి తప్పుకోవట్లేదని, సరైన సమయం లో క్లేర్‌కు సారథ్యం అప్పగించనున్నట్లు కిరణ్ స్పష్టం చేశా రు. బయోకాన్‌లో క్లేర్‌కు నాయకత్వ బాధ్యతల్లో తన సోదరుడు ఎరిక్ మజుందార్, భర్త థామస్ రాబర్ట్స్ తోడుగా ఉంటారని కిరణ్ పేర్కొన్నారు. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్ అయిన ఎరిక్ మజుందార్ కృత్రిమ మేధ నిపుణుడు కూడా. క్లేర్ భర్త థామస్ రాబర్ట్స్ ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు. ప్రస్తుతం మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు.
క్లేర్‌కే ఎందుకు..?
కిరణ్ మజుందార్ షాకు పిల్లలు లేరు. క్లేర్ కూడా కిరణ్ లాగానే బయోటెక్నాలజీ కంపెనీని నిర్వహిస్తున్నారు. 37 ఏళ్ల క్లేర్ మజుందార్.. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి బయోలాజికల్ ఇంజనీరింగ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. అంతేకాదు, స్టాన్‌ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి క్యాన్సర్ బయాలజీలో పీహెచ్‌డీ పొందారు. ప్రస్తుతం 160 కోట్ల డాలర్ల (రూ.15,200 కోట్లు) మార్కెట్ విలువ కలిగిన నాస్‌డాక్ లిస్టెడ్ కంపెనీ బికారా థెరప్యూటిక్స్‌కు సీఈఓగా ఉన్నారు. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఔషధాలను అభివృద్ధి చేస్తున్న క్లినికల్ స్టేజ్ బయోటెక్నాలజీ కంపెనీ ఇది. బికారాలో బయోకాన్ 10 శాతం వాటా కూడా కలిగి ఉంది. బికారా సీఈఓగా బాధ్యతలు చేపట్టకముందు క్లేర్.. థర్డ్ రాక్ వెంచర్స్‌లో సీనియర్ అసోసియేట్‌గా పనిచేశారు. రియోస్ మెడిసిన్స్‌లో బిజినెస్ డెవల్‌పమెంట్, కార్పొరేట్ స్ట్రాటజీ విభాగ అధిపతిగా బాధ్యతలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్
ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్