Share News

ఉక్కు ఎగుమతులకు ఊతం

ABN , Publish Date - Jul 16 , 2026 | 03:17 AM

భారత్‌-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ద్వారాలు తెరుచుకున్నాయి. సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) పేరుతో రెండు దేశాల మధ్య గత ఏడాది జూలై 24న కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య..

ఉక్కు ఎగుమతులకు ఊతం

యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలుతో ఏటా 11 లక్షల టన్నులకు పైగా ఎక్స్‌పోర్ట్స్‌కు చాన్స్‌

ముంబై: భారత్‌-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ద్వారాలు తెరుచుకున్నాయి. సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) పేరుతో రెండు దేశాల మధ్య గత ఏడాది జూలై 24న కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎ్‌ఫటీఏ) బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఎఫ్‌టీఏతో మన దేశం నుంచి యూకేకు స్టీలు ఎగుమతులు భారీగా పెరగనున్నాయి. భారత్‌ నుంచి ఏటా 11 లక్షల టన్నులకు పైగా స్టీల్‌ను వివిధ కోటాల కింద జీరో డ్యూటీతో దిగుమతి చేసుకునేందుకు యూకే అంగీకరించింది. దీంతో ఈ ఏడాది మార్చి నుంచి యూకే అమలు చేస్తున్న స్టీల్‌ సేఫ్‌గార్డ్‌ చర్యల నుంచి భారత ఉక్కు తయారీ కంపెనీలకు పెద్ద ఊరట లభించిందని చెప్పవచ్చు. చైనా డంపింగ్‌తో అల్లాడుతున్న దేశీయ స్టీలు పరిశ్రమకు ఇది పెద్ద ఊరట.

దేశీయ తయారీకి ఊతం

ఈ ఎఫ్‌టీఏతో బ్రిటన్‌ నుంచి మన దేశానికి పెట్టుబడులు వెల్లువెత్తుతాయని భావిస్తున్నారు. అదే జరిగితే దేశంలో తయారీ రంగం పుంజుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి. ఈ ఒప్పందం ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ, పాదరక్షలు, తోలు ఉత్పత్తులు, నగల తయారీ వంటి శ్రమ సాంద్రిత రంగాలకు మరింత మేలు చేయనుంది. ప్రస్తుతం భారత్‌-యూకే ద్వైపాక్షిక వాణిజ్యం 6,000 కోట్ల డాలర్లుగా ఉంది. ఎఫ్‌టీఏతో అది 10,000 కోట్ల డాలర్లకు చేరుతుందని భారత పారిశ్రామిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

బలపడనున్న పోటీ సామర్థ్యం

ప్రస్తుతం యూకే మార్కెట్‌లో భారత కంపెనీలు చైనా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలతో గట్టిగా పోటీపడాల్సి వస్తోంది. ఈ ఎఫ్‌టీఏతో మన వస్తు, సేవల ఎగుమతుల్లో 99 శాతం జీరో డ్యూటీ లేదా స్వల్ప సుంకాల పరిధిలోకి వస్తాయి. దాంతో యూకేకు జరిగే భారత వస్తు, సేవల ఎగుమతులు చైనా,పాకిస్థాన్‌, బ్రిటన్‌, వియత్నాం వంటి దేశాల ఉత్పత్తులకు గట్టి పోటీ ఇవ్వగలుగుతాయని భావిస్తున్నారు.

చారిత్రాత్మక ఒప్పందం

భారత పారిశ్రామిక దిగ్గజాలు ఈ ఎఫ్‌టీఏను స్వాగతించాయి. భారతి ఎంటర్‌ప్రైజెస్‌ వైస్‌ చైర్మన్‌ రాజన్‌ భారతి మిట్టల్‌ అయితే ఈ ఎఫ్‌టీఏను చారిత్రాత్మక ఒప్పందంగా అభివర్ణించారు. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులు, టెక్నాలజీ, నవ కల్పనల కు సంబంధించి కొత్త అవకాశాలు ఏర్పడతాయన్నారు. ఈ ఒప్పందం స్ఫూర్తితో రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, నైపుణ్యాల ప్రోత్సాహం కోసం రెండు దేశాల ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్టు నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ నంబియార్‌ ప్రకటించారు. ఈ ఎఫ్‌టీఏతో రెండు దేశాల ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతమై, భారత కంపెనీలకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ తెలిపారు.


తొలి రోజే రూ.1,344 కోట్ల ఎగుమతులు

ఎఫ్‌టీఏ అమలులోకి వచ్చిన తొలి రోజే భారత్‌ నుంచి యూకేకు ఎలాంటి సుంకం లేకుండా 14 కోట్ల డాలర్ల విలువైన (రూ.1,344 కోట్లు) ఎగుమతులు జరిగాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ తెలిపారు.

అవకాశాలు పుష్కలం శ్రమ సాంద్రిత రంగాలకు లబ్ధి

ఈ ఒప్పందంతో ప్రపంచంలోని అతి పెద్ద వినియోగ మార్కెట్లలో ఒకటైన యూకే మార్కెట్‌లో తమకు మరిన్ని వ్యాపార అవకాశాలు ఏర్పడతాయని భారత పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. మన దేశం నుంచి యూకేకు ఎగుమతయ్యే 99 శాతం వస్తు, సేవలు, అలాగే యూకే నుంచి మన దేశానికి దిగుమతయ్యే 90 శాతం వస్తు, సేవలు ఈ ఎఫ్‌టీఏ కారణంగా జీరో డ్యూటీ పరిధిలోకి వస్తాయి.

ఇవి కూడా చదవండి...

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు

జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 03:17 AM